250 బ్యాంక్‌ శాఖలను తెరుస్తాం : కెనరా బ్యాంక్‌ సిఎండి వెల్లడి

హైదరాబాద్‌ : ప్రభుత్వ రంగంలోని కెనరా బ్యాంక్‌ ఆకర్షణీయ ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికం (క్యూ2)లో 11 శాతం వృద్థితో రూ.4,015 కోట్ల నికర లాభాలు సాధించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.3,606 కోట్ల లాభాలు ఆర్జించింది. గడిచిన క్యూ2లో కెనరా బ్యాంక్‌ గ్లోబల్‌ బిజినెస్‌ 9.42 శాతం పెరిగి రూ.23,59,344 కోట్లకు చేరింది. గ్లోబల్‌ డిపాజిట్లు 9.34 శాతం వృద్థితో రూ.13,47,347 కోట్లుగా చోటు చేసుకుంది. మంగళవారం కెనరా బ్యాంక్‌ ఆర్థిక ఫలితాలను ఆ బ్యాంక్‌ ఎండి, సిఇఒ సత్యనారాయణ రాజు వెల్లడించారు. గతేడాది 200 కొత్త శాఖలను ప్రారంభించామన్నారు. ఈ ఏడాదిలో 250 కొత్త శాఖలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇప్పటికే 45 శాఖలను తెరిచామన్నారు. బ్యాంక్‌ స్థూల నిర్థక ఆస్తులు 42 బేసిస్‌ పాయింట్లు మెరుగుపడి 0.99 శాతానికి పరిమితమయ్యాయన్నారు. 2023 ఇదే సెప్టెంబర్‌ త్రైమాసికంలో 1.41 శాతం నికర ఎన్‌పిఎలు చోటు చేసుకున్నాయన్నారు. ప్రస్తుతం తమ బ్యాంక్‌ 9,658 శాఖలు, 9,881 ఎటిఎం కేంద్రాలను కలిగి ఉందన్నారు. విదేశాల్లో లండన్‌, న్యూయార్క్‌, దుబారు, ఐబియు గిఫ్ట్‌ సిటీల్లోనూ కార్యకలాపాలు కలిగి ఉందన్నారు.

➡️