
గడిచిన రెండు సంవత్సరాల కరోనా కాలంలో ఆన్‌లైన్ బోధనాభ్యసన ద్వారా విద్యారంగంలో ఎదురైన అనేక సమస్యలను ప్రత్యక్షంగా చూశాం. కోవిడ్‌ను అడ్డం పెట్టుకుని సంప్రదాయక విద్యా వ్యవస్థను దెబ్బ తీసేందుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రయత్నం చేసింది, చేస్తున్నది. కేంద్రం ఆజ్ఞలను అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కాచుకు కూర్చుంది. ఇది ప్రత్యామ్నాయం కాదని సర్వేలు, విద్యావేత్తలు తెలియచేసినప్పటికీ విద్య ద్వారా వ్యాపారం కోసం ముమ్మర ప్రయత్నం చేస్తున్నది. ఈ పరిస్థితి కె.జి నుండి పి.జి వరకు ఉంది. మార్కెట్ విస్తరణ కోసం మన సంప్రదాయ విద్యా వ్యవస్థపై ఈ రూపంలో సైద్ధాంతిక దాడి ప్రారంభమైంది. ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ ప్రకటన సందర్భంగా ఇ-లెర్నింగ్‌ను దేశ వ్యాప్తంగా అందుబాటు లోకి తెచ్చి డిజిటల్ విద్యను ప్రోత్సహించడమే దీని లక్ష్యమని ప్రకటించారు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఒకటుంది. కోవిడ్‌కు ముందే మన దేశంలో కార్పొరేట్ సంస్థలతో కుదుర్చుకున్న భారీ ఒప్పందాలు ఇప్పుడు బయటపడుతున్నాయి.
దేశంలో ఆన్‌లైన్ విద్యా వ్యాపారం కోసం ఇప్పటికే బైజూస్, ఆన్ అకాడమీ, దేశీ, ఎడెక్స్, కోర్సెరా, ఆలివ్ బోర్డ్...వంటి కార్పొరేట్ సంస్థలు విద్యారంగంలో పెద్ద ఎత్తున వ్యాపారం కోసం ప్రయత్నం చేస్తున్నాయి. ఎడెటెక్ సంస్థకు 3 కోట్ల వరకు, బైజూస్ కు 3 కోట్లు దాటి విద్యార్థులు వినియోగదారులుగా ఉన్నారనేది సమాచారం. కేంద్ర ప్రభుత్వం అన్ని స్థాయిలలో విద్య నుంచి తప్పుకుని ఆన్‌లైన్ విద్యా మార్కెట్‌ను ప్రోత్సహించే చర్యలను వేగవంతం చేసింది. అదే కోవలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు పూర్తిగా ద్వారాలు తెరిచింది.
అదే బైజూస్ బోధన
ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ విద్య అందిస్తున్న 100 కంపెనీలలో ఇదొకటిగా ఉంది. 21 దేశాలలో 15 కోట్ల మంది విద్యార్థులు వినియోగదారులుగా ఉన్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బైజూస్ కార్పొరేట్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. బైజూస్ ఎడ్యుకేషన్ యాప్ ద్వారా నాల్గవ తరగతి నుండి పదవ తరగతి వరకు ఆ కంపెనీ తయారు చేసిన సిలబస్ లేదా కంటెంట్‌ను మాత్రమే ప్రవేశపెడతారు. గత కొద్ది సంవత్సరాలుగా ఆన్‌లైన్ విధానాన్ని తేవడానికి ప్రయత్నం చేసింది. కరోనా అందుకు కలసి వచ్చింది. 2030 నాటికి ఉన్నత విద్య వరకు 50 శాతం ప్రవేశాలు లక్ష్యంగా పెట్టుకుంది. అంటే జాతీయ నూతన విద్యా విధానం (ఎన్.ఇ.పి)లో పేర్కొన్న సంస్కరణలని చెప్పవచ్చు. ప్రతి విద్యార్థికి ట్యాబ్ ఇస్తారట. తరగతి గదికి ఒక టి.వి పెడతారట. వారి కంటెంట్‌నే పాఠ్యపుస్తకాలుగా అందుబాటులోకి తేనున్నారు. అయితే...అనేక ఛానళ్లతో, విదేశీ యూనివర్సిటీలతో ఒప్పందం కుదుర్చుకుని గతంలో పెట్టిన ఆన్‌లైన్ క్లాసులు పేద, బడుగు బలహీన వర్గాలకు ఏ మాత్రం ఉపయోగ పడలేదు. అందుకే రెండు తెలుగు రాష్ట్రాలలోని తల్లిదండ్రులు పాఠశాలలు తెరవాలని, భౌతికంగా ప్రారంభించాలని డిమాండ్ చేశారు. సౌకర్యాల లేమి ఒకవైపు వెంటాడుతుండగా...కొన్ని ప్రాంతాలలో పాఠశాలలు లేవు. గ్రామీణ, గిరిజన ప్రాంతాలలో అక్షరాస్యత రేటు స్వల్పంగా ఉన్నది. పునాది విద్యపై శ్రద్ధ పెట్టలేని ప్రభుత్వం ఇప్పుడు ఆన్‌లైన్, డిజిటల్ విద్యా వ్యవస్థల ప్రవేశానికి అత్యంత ఉత్సాహం చూపుతున్నది.
ఆన్‌లైన్ కోసమే అంతా
పెద్ద మార్కెట్ కోసం కార్పొరేట్ సంస్థలకు లాభాలను చేకూర్చే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుతుంది. ఇందులో భాగంగానే రాష్ట్ర విద్యారంగంలో అనేక సంస్కరణలను తీసుకొచ్చింది. దేశంలో ఏ రాష్ట్రంలోను ఎన్.ఇ.పి ని ముందుగా అమలు చేయలేదు. కాని మన రాష్ట్రంలో జీవో 172 ఉత్తర్వులను అమలు చేసి పాఠశాలలను కుదించే ప్రయత్నం చేసింది. విద్య పునర్‌వ్యవస్థీకరణ పేరుతో ప్రపంచబ్యాంకు నుండి అప్పు తెచ్చి సంస్కరణలకు పూనుకుంది. తాజాగా 117 జీవో తెచ్చి పాఠశాలల విలీనం, విద్యా సంస్థలను కేంద్రీకరించడం, ప్రాథమిక పాఠశాలల వ్యవస్థ లేకుండా చేయడం, కేవలం ఆంగ్ల మాధ్యమానికే ప్రాధాన్యతను ఇవ్వడం, ఉపాధ్యాయుల పోస్టులు రేషనలైజేషన్ చేయడం తదితర చర్యలు...భవిష్యత్తులో బైజూస్ వంటి డిజిటల్ విద్యా విధానానికి మార్గం సుగమం చేయడానికే. ఉపాధ్యాయుల అవసరాన్ని, ప్రాధాన్యతను డిజిటల్ విద్య తగ్గించనుంది. నేటి పాలకులకు కూడా అదే కావాలి. కనుక రాష్ట్రంలో సంస్కరణలను వేగవంతం చేస్తున్నారు.
డిజిటల్ విద్య ప్రత్యామ్నాయం కాదు
కార్పొరేట్ సంస్థలు ఎప్పడూ కూడా మార్కెట్లో లాభార్జన విపరీతంగా చేయగల అంశాలనే చొప్పిస్తాయి. ఎందుకంటే దేశంలో నూతన ఆర్థిక విధానాలు అమలులోకి వచ్చినప్పటి నుండి పెట్టుబడిదారులకు, కార్పొరేట్ సంస్థలకు అనుగుణంగా విద్యా రంగంలో మార్పులు వచ్చాయి. ప్రస్తుతం జరుగుతున్నది అదే. అంతర్జాతీయంగా ఒక అంచనా ప్రకారం ఏటా 13 ట్రిలియన్ డాలర్ల విద్యా వ్యాపారం జరుగుతున్నది. సంప్రదాయక విద్యా వ్యవస్థను దెబ్బ తీస్తే తప్ప ఆన్‌లైన్ విద్య సాధ్యం కాదని ఈ ఒప్పందాలు స్పష్టం చేస్తున్నాయి.
అయితే డిజిటల్, ఆన్‌లైన్, టీవీలు, లాప్‌టాప్‌ల ద్వారా బోధన నాణ్యమైన విద్యకు ప్రత్యామ్నాయం కాదు. ఇవి అదనపు సమాచారం, వేగవంతంగా జరుగుతున్న మార్పుల అధ్యయనానికి ఉపయోగపడే సాధనాలు మాత్రమే. కాని పాలకులు డిజిటల్ విద్యే ప్రత్యామ్నాయం అని చెప్తున్నారు. ప్రభుత్వం అన్ని స్థాయిల్లో విద్య నుంచి తప్పుకుని ఆన్‌లైన్ విద్యా మార్కెట్‌ను ప్రోత్సహించే చర్యలు వేగవంతం చేసింది. ఉపాధ్యాయులకు, విద్యార్థులకు మధ్య, విద్యార్థులలో ఒకరికొకరికి మధ్య ఉండవలసిన సజీవ సంబంధాలు లేకుండా చేస్తుంది.
ఆన్‌లైన్ తరగతుల్లో పిల్లవాడు వ్యక్తిగా ఎలా అభివృద్ధి చెందుతాడు? విద్యార్థిలో కమ్యూనికేషన్ నైపుణ్యాలు, భాషా పరిజ్ఞానం, శాస్త్రీయ దృక్పథం వంటివి ఎలా పెంపొందించబడతాయి. విమర్శనాత్మక దృక్పథం ఏవిధంగా అలవడుతుంది? ఇటువంటివి డిజిటల్ విద్యా బోధనలో కనిపిస్తాయా? విద్యార్థికి-ఉపాధ్యాయునికి మధ్య ప్రత్యక్ష సంబంధాలు లేనపుడు నైతిక విలువలు ఎలా పెంపొందించబడతాయి. చారిత్రాత్మకంగా చూస్తే ఉపాధ్యాయుడికి, తరగతి గదికి సరైన ప్రత్యామ్నాయం ఇంత వరకు లేదు. సంవత్సరాల తరబడి ఒక పరికరం ద్వారానే బోధన అభ్యసనం అనేది సరికాదు.
సమాజంలో జ్ఞాన ప్రక్రియలు, సముపార్జనలు ఒక సమిష్టి ప్రక్రియగా ఉంటేనే సామాజిక స్పృహ కలిగిన పౌరులుగా ఎదుగుతారు. అభిప్రాయాలను పంచుకోవడం, చర్చించడం ఆధారంగానే సమిష్టి అభిప్రాయానికి వస్తారు. ఆన్‌లైన్ విద్య విద్యార్థిని ఒంటరిని చేస్తుంది. ఇవే విపరీత ధోరణులకు, సంఘ విద్రోహ శక్తులుగా మారడానికి దారితీస్తాయి.
ప్రశ్నించే తత్వం సన్నగిల్లుతుంది
డిజిటల్ విద్యలో ప్రశ్నించే తత్వం, ప్రశ్నకు జవాబు దొరికే పరిస్థితి ఉండదు. ప్రశ్న నుండే ఘర్షణ ప్రారంభం అవుతుంది. ఘర్షణ నుండే నూతన ఆవిష్కరణలు పుడతాయి. అటువంటి ప్రక్రియకు ఆ విధానంలో అవకాశం లేదు. విద్యార్థి మరబొమ్మలా మారే ప్రమాదం ఉంది. మన రాజ్యాంగం ప్రతి పౌరునికి ప్రశ్నించమని, శాస్త్రీయ ఆలోచన, మానవ వాదాన్ని పెంచుకోవాలని చెప్పింది. అటువంటి రాజ్యాంగ హక్కును కోల్పోతున్నట్లే కదా?
ఆన్‌లైన్ విద్యావిధానం రాజ్యాంగ మూలాల లోపలికి చొరబడుతుంది. సామాజిక న్యాయం, రిజర్వేషన్లు ప్రమాదంలో పడతాయి. బోధనా పరికరాలు ఏ రూపంలో ఉన్నా అవి విద్యారంగాన్ని శాసిస్తాయి. రాష్ట్ర విద్యావ్యవస్థ నిర్వహణ, సిలబస్, కరికులమ్, పరీక్షలు, పథకాలలో ఈ సంస్థల మితిమీరిన జోక్యం పెరుగుతుంది. విద్యార్థులకు ఏం అందించాలనేది బైజూస్ నిర్ణయిస్తుంది. ఎంతో విశిష్టాత్మకంగా మన రాష్ట్ర భౌగోళిక, సామాజిక పరిస్థితులకు, ఆర్థికాభివృద్ధికి దోహదపడే విధంగా కరికులమ్, సిలబస్‌ను రూపొందించే ఎన్.సి.ఇ.ఆర్.టి వంటి సంస్థల లక్ష్యాలు నీరుగారతాయి. మన దేశ చరిత్రను తెలుసుకునే అవకాశాన్ని కోల్పోయే నేటి బాలలు రేపటి మంచి పౌరులుగా ఎలా తయారవుతారనే ప్రశ్నకు సమాధానం డిజిటల్ విద్యలో ఎక్కడా కనపడదు.
విద్యారంగం నుండి ప్రభుత్వం తన బాధ్యత నుండి తప్పుకునేదానికి ఇటువంటి సంస్కరణలు తీసుకొస్తున్నది. 3,4,5 తరగతులను హైస్కూళ్లలో విలీనం చేయడం, పాఠశాలలను విలీనం చేయడం, 10 మంది విద్యార్థులు గల పాఠశాలల జాబితాను డైరక్టరేట్లకు పంపడం, హైస్కూలులో సమాంతర మీడియంలను రద్దు చేయడం, విద్యార్థులు-ఉపాధ్యాయుల నిష్పత్తిని పెంచి భారీ సంఖ్యలో మిగులు ఉపాధ్యాయుల పోస్టులను చూపడం, ఎన్నడూ లేని విధంగా ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మార్చడం వంటివి ఈ సంస్కరణలలో భాగమే. కనుక భవిష్యత్తులో టీచర్ల స్థానంలో టి.వి లతో చదువులు చెప్పించే పనిలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం బైజూస్‌తో ఒప్పుందం కుదుర్చుకుంది. దీనివలన బడ్జెట్‌లో నిధులు తగ్గించవచ్చు. పి.పి.పి విధానం ముందుకొస్తుంది. పెద్ద ఎత్తున కార్పొరేట్ విద్య పెరగనుంది. ఇటువంటి విధానాలకు వ్యతిరేకంగా ప్రభుత్వ విద్యారంగ రక్షణకై విశాల ఉద్యమాన్ని నిర్మించి, ఐక్యతతో పోరాడాల్సిన సమయమిది.
వ్యాసకర్త: యుటిఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు,
కె.విజయ గౌరి సెల్ : 8985383255