Aug 05,2022 21:10

-  బెంగాల్‌ బిజెపి ఎమ్మెల్యే
కొల్‌కతా : 
 పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)పై దేశవ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తినా బిజెపి మాత్రం తన మొండి వైఖరిని వీడటం లేదు. సిఎఎని ఈ ఏడాది డిసెంబరులోగానే అమల్జేసితీరుతామని భీష్మిస్తోంది. కోవిడ్‌ వ్యాక్షినేషన్‌ ముగిసిన వెంటనే ఈ ప్రక్రియ చేపడుతామని కేంద్ర హోమంత్రి అమిత్‌ షా ప్రకటించిన నేపథ్యంలో కింది స్థాయి నేతల ద్వారా దీనిని పదేపదే చెప్పిస్తోంది. సిఎఎ అమల్జేస్తే ఎక్కువ ప్రభావితమయ్యే పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో ప్రజలను చీల్చే దిశగా స్థానిక నేతలు సిఎఎపై ప్రకటన గుప్పిస్తున్నారు. తాజాగా పశ్చిమ బెంగాల్‌ బిజెపి ఎమ్మెల్యే అసిం సర్కార్‌ డిసెంబరులోగానే సిఎఎ అమల్లోకి వచ్చే వీలుందని శుక్రవారం చెప్పారు. పశ్చిమ బెంగాల్‌లోని బిజెపి శరణార్థుల సెల్‌ కన్వీనర్‌గానూ సర్కార్‌ ఉన్నారు. ప్రజల ఆకాంక్షలను నేరవేర్చడం కోసం రాష్ట్రంలో సిఎఎను అమలు చేయాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పుకొచ్చారు. 2024 లోక్‌సభ ఎన్నికలలోపు సిఎఎను అమలు చేయాల్సివుందని పునరుద్ఘాటించారు.