Nov 26,2021 07:50

* 683 మంది బలిదానాలు.

* అమరుల త్యాగాల స్ఫూర్తితో కొనసాగుతున్న రైతు పోరాటం

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : చారిత్రాత్మక రైతు ఉద్యమం ప్రారంభమై నేటికి (శుక్రవారానికి) ఏడాది పూర్తయింది. పాలక ప్రభుత్వాలు సృష్టించిన అనేక అవాంతరాలను, ప్రేరేపిత దాడులను, హత్యలను ఎదుర్కొని ముందుకు సాగుతున్న రైతాంగానికి దేశం జేజేలు పలుకుతోంది. ప్రకతి దయ చూపనప్పటికీ రైతులు తీవ్రమైన చలిలో, వానలో, ఎండలో నిర్విరామంగా ఉద్యమాన్ని కొనసాగించారు. ప్రభుత్వ విభజించు, పాలించు పన్నాగాన్ని అడ్డుకొని ఐక్యతే లక్ష్యంగా ఉద్యమం సాగింది. ఈ సుదీర్ఘ పోరాటంలో 683 మంది రైతులు అమరులయ్యారు. ఆ రైతుల బలిదానాల త్యాగాల స్ఫూర్తితో కొనసాగుతున్న రైతాంగ పోరాటం దేశంలోని అన్ని వర్గాలకు, ప్రపంచంలోని రైతాంగానికి ఒక దిక్సూచిగా నిలిచింది. ఒక చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకుంది.
గత ఏడాది నవంబర్‌ 26, 27 తేదీల్లో 'చలో ఢిల్లీ' పిలుపుతో రైతు ఉద్యమం ప్రారంభమైంది. ఇంత సుదీర్ఘ పోరాటం కొనసాగించాల్సి రావడం కేంద్ర ప్రభుత్వ అహంకారానికి స్పష్టమైన ప్రతిబింబమని ఎస్‌కెఎం పేర్కొంది. ఇది ప్రపంచ చరిత్రలో అతిపెద్ద, సుదీర్ఘమైన నిరసన ఉద్యమమని పేర్కొంది. పన్నెండు నెలల వ్యవధిలో దేశంలోని ప్రతి రాష్ట్రం, ప్రతి జిల్లా, ప్రతి గ్రామానికి విస్తరించిన ఉద్యమంలో కోట్లాది మంది ప్రజలు భాగస్వామ్యమయ్యారు. మూడు రైతు వ్యతిరేక చట్టాల రద్దుకు ప్రభుత్వ నిర్ణయం, కేంద్ర మంత్రివర్గం ఆమోదించడం రైతు ఉద్యమంలోని పాల్గొన్న రైతులు, ఉద్యమానికి సంఘీభావం తెలిపిన సామాన్య పౌరుల విజయమని ఎస్‌కెఎం పునరుద్ఘాటించింది. ప్రాంతీయ, మత, కుల విభజనలకు అతీతంగా రైతులు ఐక్యం కావడంతో ఈ ఉద్యమానికి ఒక ప్రత్యేక గుర్తింపు లభించింది. ఇది దేశంలో ప్రజాస్వామ్యం, లౌకికవాదం మూలాలను మరింత లోతుగా తీసుకెళ్లిందని ఎస్‌కెఎం పేర్కొంది.ప్రతి ఒక్క నిరసనకారుడు శాంతియుత సంకల్పంతో ఉండటంతోనే ఉద్యమం నిలదొక్కుకోగలిగింది. కార్మిక సంఘాలు, మహిళా, విద్యార్థి, యువజన సంఘాలతోసహా ఇతర ప్రగతిశీల, ప్రజాస్వామిక ప్రజా సంఘాల సహకారం నుంచి రైతు ఉద్యమం మరింత బలాన్ని పొందింది. దేశంలోని దాదాపు అన్ని ప్రతిపక్ష రాజకీయ పార్టీలు ఈ పోరాటంలో రైతులకు మద్దతుగా నిలిచాయి. ఈ ప్రజా ఉద్యమంలో కళాకారులు, విద్యావేత్తలు, రచయితలు, వైద్యులు, న్యాయవాదులు మొదలైన సమాజంలోని అనేక వర్గాల వారు తమ వంతు సహకారం అందించారు. ఈ ఉద్యమంలో పాల్గొన్న వారందరికీ, మద్దతుదారులకు ఎస్‌కెఎం తన కృతజ్ఞతలు తెలియజేస్తోంది. నిరసన చేస్తున్న రైతుల మిగిలిన న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ఉద్యమం కొనసాగుతోందని ఎస్‌కెఎం స్పష్టం చేసింది.
వార్షికోత్సవ సందర్భంగా నేడు నిరసనలు
సంయుక్త కిసాన్‌ మోర్చా పిలుపు మేరకు సాగిన చారిత్రాత్మకమైన రైతు ఉద్యమం మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఢిల్లీలోని వివిధ రైతు ఉద్యమ శిబిరాల వద్దకు వేలాది మంది రైతులు చేరుకుంటున్నారు. పంజాబ్‌, హర్యానా, ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌ తదితర రాష్ట్రాల నుంచి రైతులు ఢిల్లీకి చేరుకుంటున్నారు. కర్ణాటకలో రైతులు ముఖ్యమైన రహదారులను దిగ్బంధిస్తారు. తమిళనాడు, బీహార్‌, మధ్యప్రదేశ్‌లలో కార్మిక సంఘాలతో కలిసి అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసనలు నిర్వహించనున్నారు. రారుపూర్‌, రాంచీలలో ట్రాక్టర్‌ ర్యాలీలు నిర్వహించనున్నారు. పశ్చిమ బెంగాల్‌లో కలకత్తాతో పాటు ఇతర జిల్లాల్లో ర్యాలీలను నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా సంఘీభావ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.