
న్యూయార్క్ : మూడు చైనా టెలికాం కంపెనీలను డీ లిస్ట్ చేయడాన్ని అమెరికాకు చెందిన న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రారంభించింది. చైనా మిలటరీతో ముడిపడిన సంస్థల్లో పెట్టుబడులను నిషేధిస్తూ ట్రంప్ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నటు సంబంధిత అధికారులు పేర్కొన్నారు. వచ్చే వారంలోగా చైనా మొబైల్ టెలికమ్యూనికేషన్స్, చైనా టెలికమ్యూనికేషన్స్ కార్పొరేషన్, చైనా యూనికామ్ (హాంకాంగ్) లిమిటెడ్ల్లో ట్రేడింగ్ నిలిచిపోనుంది. ఈలోగా ఈ కంపెనీల లావాదేవీలు కూడా పరిష్కారం కావాల్సి వుందని ఎక్స్ఛేంజ్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది. చైనా కంపెనీల్లో పెట్టుబడులు పెట్టరాదంటూ నవంబరులో ట్రంప్ అమెరికన్లను ఆదేశించారు. అది చైనాకు తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది. ఆ ఆదేశాల్లో 31 కంపెనీలు వున్నాయి. అమెరికన్లు పెట్టే పెట్టుబడుల నిధులను చైనా తన సైనిక, ఇంటెలిజెన్స్ సేవలకు ఉపయోగించుకుంటోందన్నది ట్రంప్ ఆరోపణ. దీంతో ఈ 31 కంపెనీల్లో అమెరికన్ కంపెనీలు లేదా వ్యక్తులు వాటాలు కలిగివుండేందుకు లేకపోయింది. వాణిజ్యం, కరోనా వైరస్, హాంకాంగ్, జిన్జియాంగ్ వంటి పలు అంశాలపై ఉద్రికత్తలు తలెత్తడంతో ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.