Jan 09,2021 19:29

'నేను బతికే ఉన్నాను.. నన్ను గుర్తించండి.'' అని ఓ యువకుడు 18 ఏళ్లపాటు ప్రభుత్వంతో పోరాడాడు. తన ఉనికి కోసం శతవిధాలా ప్రయత్నించాడు. అతడు నడి వయసుకు చేరాక కానీ, అతను బతికే ఉన్నాడని అధికారికంగా గుర్తించలేదు అధికారులు. ఇదో చిత్రమైన కథ. ఇప్పుడు చలన చిత్రంగానూ రాబోతున్న కథ. ఎవరతడు? ఏమా కథ?

ఆస్తికోసం కొంతమంది అన్నదమ్ముల మధ్య కుమ్ములాటలు జరుగుతుంటాయి. కాని ఉత్తరప్రదేశ్‌ అజమ్‌ఘర్‌కు చెందిన భరత్‌లాల్‌ బిహారీ ఆస్తి రాబట్టుకోవడానికి అతణ్ణి అధికారికంగా చంపేశారు బంధువులు. 'నేను బతికే ఉన్నాను' అని నిరూపించుకునేందుకు అతను 18 ఏళ్లు పోరాడాల్సి వచ్చింది. ఈ 18 ఏళ్లూ తను బతికే ఉన్నానని నిరూపించేందుకు అతను చేయని ప్రయత్నం లేదు. క్రిమినల్‌ కేసు నమోదైతే పోలీసు రికార్డుల్లో తన పేరు నమోదవుతుందని బంధువుల అబ్బాయిని కిడ్నాప్‌ చేశాడు కూడా. అయితే ఫిర్యాదు చేస్తే తాము చేసిన మోసం బయటపడుతుందని ఆ బంధువు లాల్‌పై ఫిర్యాదు చేయలేదు. అజంఘర్‌, లక్నో, ఢిల్లీలో ధర్నాలు, ర్యాలీలు చేశాడు. అస్తిపంజరం వేషధారణతో, పాడెపై పడుకుని .. ఇలా రకరకాలుగా న్యూసెన్స్‌ చేస్తే, తనపై కేసు నమోదైతే .. తాను బతికే ఉన్నానని నిరూపించుకోవచ్చనుకున్నాడు. చివరికి భార్యతో వితంతు పింఛనుకు కూడా దరఖాస్తు చేయించాడు. అయితే ఆ అధికారి దాన్ని స్వీకరించకపోవడంతో ఆ ప్రయత్నమూ విఫలమైంది. 1989లో సందర్శకుల పాస్‌ తీసుకుని తనకు జరిగిన అన్యాయంపై కరపత్రాలు వేసి లక్నో అసెంబ్లీలో విసిరాడు. 'నన్ను బతికించండి' అని గట్టిగా అరుస్తూ అసెంబ్లీలోకి చొరబడ్డాడు. ఆ తరువాత చాలా సంతోషంగా పోలీసులకు లంగిపోయాడు. ఎందుకంటే ఇలాగైనా తనపై కేసు నమోదవుతుందని... అయితే ఆ కేసు విచారణలో న్యాయమూర్తి కనీసం అతని పేరు ఉచ్ఛరించకుండానే అతన్ని విడిచిపెట్టేశారు. ఇవేమీ లాభం లేదనుకుని 1988, 1989 పార్లమెంటరీ ఎన్నికల్లో పోటీచేశాడు. రాజీవ్‌గాంధీ, వి.పి.సింగ్‌లకు ప్రత్యర్థి అభ్యర్థిగా బరిలో దిగాడు. తన పేరు ప్రభుత్వ రికార్డులో నమోదయ్యేందుకే ఇంత తాపత్రయం పడ్డాడు.

భరత్‌లాల్‌ 1955లో జన్మించాడు. లాల్‌ చిన్నప్పుడే తండ్రి మరణించాడు. తల్లి రెండో వివాహం చేసుకుని లాల్‌ను బంధువుకు అప్పగించింది. లాల్‌కు చదువు అబ్బలేదు. చీరలు నేయడం నేర్చుకున్నాడు. తన 22వ ఏట హ్యాండ్‌లూమ్‌ వ్యాపారం చేసుకుందామని తనకున్న కొద్దిపాటి పొలానికి లోను తీసుకునేందుకు బ్యాంక్‌ వారిని కలిశాడు. అప్పుడే ప్రభుత్వ రికార్డుల్లో అతను జులై 1976న చనిపోయాడన్న విషయం తెలిసింది. అతని పొలంలోనే ఐదోవంతు భాగం లంచంగా ఇస్తామని చెప్పి సంబంధిత అధికారితో తప్పుడు పత్రాలు రాయించారు బంధువులు. ఆ విషయం తెలుసుకున్న లాల్‌ ఎంతో ఆశ్చర్యపోయాడు. తనకు జరిగిన అన్యాయం ఏ ఒక్క వ్యక్తి తప్పిదం వల్ల జరగలేదు. మొత్తం యంత్రాంగమంతా దీనికి బాధ్యత వహించాల్సిందే అనుకున్నాడు. 'నేను బతికే ఉన్నాను' అని నిరూపించుకునేందుకు ఆ రోజు నుంచే పోరాడడం మొదలుపెట్టాడు.

1994 జూన్‌ 30తో ఆ పోరాటానికి తెరపడింది. జరిగిన తప్పును సరిదిద్దుకుంటూ ప్రభుత్వం అధికారికంగా లాల్‌ పేరుతో ఒక ధృవపత్రం ఇచ్చింది. 'నేను ఒక్కడినే ఇలా రెండుసార్లు పుట్టాను. మొదటిసారి అమ్మ గర్భం నుంచైతే.. రెండోసారి ప్రభుత్వ గర్భం నుంచి... దీనివల్ల నేను రెండుసార్లు మరణిస్తాను కూడా..' అంటాడు చిరునవ్వుతో లాల్‌. భూమి తిరిగివచ్చింది. అతను బతికే ఉన్నట్లు సర్టిఫికేట్లలో నమోదైంది. నిరక్షరాస్యుడైన లాల్‌ ఈ సుదీర్ఘ పోరాటంతో చట్టపరమైన ప్రభుత్వ డాక్యుమెంట్లను అర్థం చేసుకునే నైపుణ్యాన్ని సంపాదించాడు కూడా. ఈ పోరాటంలో తను పడిన కష్టాలు అన్నీఇన్నీకావు. ఆదాయం లేక పస్తులు పడుకున్న రోజులు ఉన్నాయి. గ్రామంలోని వారంతా తనను భూతాన్నో, దెయ్యాన్నో చూసినట్లుగా ప్రవర్తించేవారని అప్పటి రోజులను గుర్తు చేసుకుంటాడు లాల్‌. ఈ పరిస్థితుల్లోనే తనలాగే ఇబ్బందులు పడుతున్న వారందరినీ ఏకం చేశాడు. అలా 1980లో చనిపోయిన వారి కోసం 'మృతక్‌ సంఫ్‌ు' ప్రారంభించాడు. ప్రభుత్వపరంగా జరిగిన నష్టాన్ని కచ్చితంగా ప్రభుత్వం చెల్లించాల్సిందేనని, నష్టపరిహారం కోసం లక్నో హైకోర్టులో పిల్‌ కూడా వేశాడు లాల్‌. ఆ కేసు ఇప్పటికీ నడుస్తోంది. 2018లో అలహాబాద్‌ హైకోర్టు దీనిపై విచారణ చేస్తున్న సమయంలో 'ప్రమాదం జరిగినప్పుడో... లేక మరణించినప్పుడో... ప్రభుత్వం నుంచి నష్టపరిహారం కోరడం సాధారణంగా జరుగుతుంది. కాని ఈ కేసు ఆ పరిస్థితికి పూర్తి విరుద్ధమైనది' అంటూ లాల్‌ తరపు న్యాయవాది వ్యాఖ్యానించారు.

మనదేశంలో చనిపోయిన వారి పేరు మీద ఓటరు కార్డులు రావడం, బతికున్న వారి పేర్లు మరణధ్రువీకరణ పత్రాల్లో చేరడం చాలా మామూలు విషయంగా పరిగణిస్తుంటాం. కాని లాల్‌ అలా ఊరుకోలేదు. దానికోసం పోరాటం చేశాడు. ఆ పోరాటం ఎంతోమంది బాధితులకు కొండంత ఊరట ఇచ్చింది. ఇప్పుడు 'మృతక్‌ సంఫ్‌ు'లో 20 వేల మంది సభ్యులు ఉన్నారు. తాము బతికే ఉన్నామని నిరూపించుకునేందుకు పోరాటాలు చేస్తూనే ఉన్నారు. 2008లో వారిలో రెండొందల మందికి పైగా విజయం సాధించారు. లాల్‌ నిస్వార్థ సేవకు ప్రతిఫలంగా 2003లో ఐ.జి నోబెల్‌ శాంతి బహుమతిని అందుకున్నాడు. ఇప్పుడు లాల్‌ జీవితగాథతో బాలీవుడ్‌లో ఓ చిత్రం కూడా రూపొందుతోంది.