Jul 25,2021 18:46

కోవిడ్‌ మహమ్మారి తెచ్చిన కష్టాలతో ఎందరో రోడ్డున పడ్డారు. పేద, మధ్య తరగతి బతుకులు అస్తవ్యస్తమయ్యాయి. ఈ కాలంలో ఎంతోమంది ఉపాధ్యాయులు జీవనాధారం కోల్పోయి బతుకుదెరువు కోసం పడరానిపాట్లు పడుతున్నారు. ఉపాధి కూలీలుగా, పళ్లు, కూరగాయలు అమ్ముకుంటూ, పొలం పనులకు వెళుతూ ఎంతోమంది కనపడుతున్నారు. ఒరిస్సా భువనేశ్వర్‌కు చెందిన ఉపాధ్యాయిని స్మృతిరేఖా బెహరా పరిస్థితి కూడా ఇదే. ఇప్పుడు ఆమె మున్సిపాలిటీ చెత్త ట్రక్కు నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తోంది. మూడు నెలలుగా ఇంటింటికీ తిరుగుతూ చెత్తను సేకరించే పనిలో నిమగమై ఉంది.


బెహరా పొలిటికల్‌ సైన్స్‌ చదివింది. భర్త ఓ ప్రైవేటు సంస్థలో పనిచేసేవాడు. ఇద్దరు పిల్లలు, కుటుంబ భారంలో భర్తకు చేదోడుగా స్థానికంగా గల ప్రయివేటు స్కూల్లో టీచర్‌గా చేరింది. నర్సరీ, ఎల్‌కేజీ పిల్లలకు పాఠాలు చెప్పేది. పై ఖర్చుల కోసం సాయంత్రాలు ట్యూషన్లు చెప్పేది. ఇలా సాగిపోతున్న వారి కుటుంబాన్ని కోవిడ్‌ రోడ్డున పడేసింది. 'లాక్‌డౌన్‌తో స్కూళ్లు మూతబడ్డాయి. హోం ట్యూషన్లు లేవు. భర్త ఉద్యోగం పోయింది. ఆదాయం వచ్చే మార్గం లేదు. 'ఇరుగుపొరుగు వారి సాయంతో కొన్ని రోజులు పిల్లలు ఆకలితో ఉండకుండా చూడగలిగాం. కాని ఎన్ని రోజులు అలా? ఏదైనా పని చూసుకుందామన్నా బయటి పరిస్థితి దారుణంగా ఉంది. ఎంతోమంది మాకు లాగే పనుల్లేక అలమటిస్తున్నారు. అందుకే నేను ఈ మార్గం ఎంచుకున్నాను. ఈ పని చేస్తున్నందుకు నేనేమి సిగ్గుపడడం లేదు. ఉన్నత విద్య అభ్యసించాను కాబట్టే జీవితం ఇక్కడితో ఆగిపోకూడదనుకున్నాను. ముందుకే వెళ్లాలనుకున్నాను' అంటుంది బెహరా.

చదువు నేర్పిన చేత్తో చక్రం పట్టింది!


'యూత్‌ అండ్‌ సోషల్‌ డెవలప్‌మెంట్‌' అనే సంస్థ 2019లో బెహరా నివసించే ప్రాంతంలో డ్రైవింగ్‌ శిక్షణ ఇచ్చింది. ఆ కోర్సు మీద ఆసక్తితో బెహరా డ్రైవింగ్‌ నేర్చుకుంది. 'అదే ఇప్పుడు మాకు తిండిపెడుతోంది. ఇందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను' అంటోంది ఆమె. 'ఉదయం 5 గంటలకు మొదలైన ఆమె డ్యూటీ మధ్యాహ్నం వరకు కొనసాగుతుంది. ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరించడం, దాన్ని డంపింగ్‌ యార్డుకు చేరవేయడం ఎంతో శ్రద్ధగా చేస్తుంది. ఏమాత్రం చిన్నతనంగా భావించకుండా ఈ పనిచేస్తున్నందుకు తనను నేను ఎంతో అభినందిస్తా' అంటాడు ఆమె భర్త. 'కోవిడ్‌ ఉధృతి కొనసాగుతున్నప్పుడు ఇంటింటికీ వెళ్లి తడి చెత్త, పొడి చెత్త సేకరించేదాన్ని. ఈ పని చేయడం చాలా కష్టం. కాని పిల్లలు రెండుపూటలా తినాలంటే తప్పదు గదా!' అంటోన్న బెహరా లాంటి ఉపాధ్యాయ, ఉపాధ్యాయినులు ఎంతోమంది మనకళ్ల ముందు కూడా ఉన్నారు.