Sep 15,2021 22:02

చదువుల కోవెల...రుషివ్యాలీ
వరించిన పలు జాతీయ,అంతర్జాతీయ అవార్డులు
విద్యలో దేశంలోనే అగ్రస్థానం
ప్రజాశక్తి-కురబలకోట

చదువుల కోవెలకు నిలయంగా రుషివ్యాలీ స్కూల్‌ నిలుస్తోంది.చిత్తూరు జిల్లా మదనపల్లెకు సమీపంలోని కురబలకోట మండలం తెట్టు పంచాయతీలో 1895లో జిడ్డు క్రిష్ణమూర్తి జన్మించారు. ఆయనను అనిబిసెంట్‌ దత్తత తీసుకొన్నారు. ప్రపంచ తత్వవేత్తగా ఎదిగారు. ఆయన ఆశయాలకు ఆనుగుణంగా మారు ప్రాంతంలోని తెట్టు పంచాయతీ పరిధిలో 1926లో రుషివ్యాలీ స్కూల్‌ ప్రారంభమయ్యింది. స్కూల్‌ విస్తీర్ణం 400 ఎకరాలలో ఉంది. మదనపల్లె పట్టణానికి 15 కిలోమీటర్ల దూరంలో స్కూల్‌ను నిర్మించారు. నాల్గవ తరగతి నుండి 10వ తరగతి, ఇంటర్‌ వరకు ఇక్కడ చదువుకునే అవకాశం ఉంది.సెంట్రల్‌ సిలబస్‌లో ఆంగ్ల మాద్యమంలో విద్యాభోధన జరుగుతుంది. 360 మంది విద్యార్థులకు మాత్రమే ప్రవేశం. ఇక్కడ సీట్లు కోసం తహతహ లాడతారు. రాష్ట్రపతుల కుటుంబీకులు, ప్రధానుల కుటుంబీకులు ఇక్కడ చదువుకున్న వారిలో ఉన్నారు. ఇందిరా గాంధీ తన కుటుంబసభ్యులు రాజీవ్‌ గాంధీ, సోనియా గాంధీ, మేనకాగాంధీంతో కలసి ఈ స్కూల్‌ను సందర్శించారు. మేనకాగాంధీ తనయుడు వరుణ్‌ గాంధీ కూడా ఈ స్కూల్‌ విద్యార్థే. నిర్భయం, ఆపై ప్రశాంత వాతావరణంలో విద్యాబోధన ఇక్కడ ప్రత్యేకత. విద్యార్థుల ఇష్టా ఇష్టాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. చదువులో బాగంగా వివిధ చేతివృత్తులలో కూడా శిక్షణ ఇస్తారు. ఈ స్కూల్‌కు అనుసంధానంగా రిషివ్యాలీ రివర్‌ స్కూల్‌ దేశ,విదేశాలలో నిశ్శబ్ద విప్లవం సాగిస్తుంది. కురబలకోట మండలంలో వివిధ ప్రాంతాలలో 13 శ్యాటిలైట్‌ పాఠశాలలను, మదనపల్లె మండలంలో మరో పాఠశాలను నెలకొల్పారు. ఈ పాఠశాలలు పాఠ్య పుస్తకాలు లేకుండా కార్డుల ద్వారా విద్యాభోధన అందించడం ఇక్కడ ప్రత్యేకత. విద్యార్థులు ఉల్లాసంగా ఉత్సాహంగా చదువుకుంటారు. ఈ పాఠశాలలో టీచర్‌ ఓ సహాయకుడిగా వ్యవహరిస్తారు. ఒక టీచర్‌తోనే 5 తరగతులు ఒకే తరగతిలో నిర్వహిస్తారు. మల్టీగ్రేడ్‌ మల్టీ లెవల్‌లో విద్యాభోధన ఉంటుంది. విద్యార్థులకు తనకు తానే (సెల్ప్‌ లర్నింగ్‌ ) నేర్చుకునే అవకాశం ఉంది. చేతివృత్తులు, కథలు, నాటికలు, తోలుబొమ్మలాటలు విద్యార్థులకు నేర్పిస్తారు. పెట్టెలో బడి, మెట్రిక్‌ మేళ, తల్లుల కమిటీ, పంచతంత్రం, ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు బోధిస్తుంటారు. ఈ విద్యావిధానం కూడా ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. సత్యాన్వేషణతోనే జ్ఞానోదయం అన్న జిడ్డు క్రిష్ణమూర్తి ఆశయాలతో విజయానికి సోపానమని పద్మశ్రీ అవార్డు గ్రహీత రాధికా హెడ్జ్‌బర్గార్‌ అన్నారు. ముఖ్యంగా రుషివ్యాలీ స్కూల్‌ దేశంలో ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డు రుషివ్యాలీ స్కూల్‌ డైరెక్టర్‌ రాధికా హెడ్జ్‌బర్గార్‌కు రావడం ఆ స్కూల్‌కు వన్నె తెచ్చిందన్నారు. స్కూల్‌లో పండగ వాతావరణం నెలకొంది. రుషివ్యాలీకి ఇప్పటి వరకు జాతీయ అంతర్జాతీయ అవార్డులు ఎన్నో వచ్చాయి. వాటిలో 2006లో జిడిఎస్‌ అవార్డు కింద 43 లక్షల పురస్కారం లభించింది. 2009లో స్వాబ్‌ అవార్డు సొంతమైయింది. అలాగే జిందాల్‌ అవార్డు కింద కోటి నగదు పురస్కారం లిభించింది. రుషివ్యాలీ ఆధ్వర్యంలో చుట్టుపక్కల ప్రజలకు ఉచితంగా వైద్యం అందిస్తున్నారు.