Aug 08,2022 00:54

జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభిస్తున్న మంత్రి అమర్‌నాథ్‌

ప్రజాశక్తి - విశాఖపట్నం : చేనేత, పట్టు వస్త్రాలకు ఇప్పటికీ దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉందని పరిశ్రమలు, పెట్టుబడులు, ప్రాథమిక వసతులు, వాణిజ్యం, ఐటి, హ్యండులూమ్‌ అండ్‌ టెక్స్‌టైల్స్‌ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ తెలిపారు. ఆదివారం సాయంత్రం స్థానిక జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో ఎనిమిదో జాతీయ చేనేత దినోత్సవ రాష్ట్ర స్థాయి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో జాతీయ చేనేత దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు. వ్యవసాయ రంగం తర్వాత భారత దేశంలో అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్న రంగం చేనేత రంగమని తెలిపారు. రాష్ట్రంలో సుమారు లక్షా 50 వేల మంది ప్రత్యక్షంగా, మరో 50 వేల మంది పరోక్షంగా చేనేత వృత్తిని నమ్ముకొని జీవనం సాగిస్తున్నారని తెలిపారు. గత మూడు సంవత్సరాలలో వైయస్‌ఆర్‌ నేతన్న నేస్తం పథకం ద్వారా రూ.576.07 కోట్లు చేనేతల అభివృద్ధికి ఖర్చు చేసినట్టు తెలిపారు. అదే విధంగా 50 సంవత్సరాలు నిండిన ప్రతి చేనేత కార్మికునికీ పెన్షన్‌ మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం 12 కొత్త క్లస్టర్లను రూ.17.86 కోట్లతో అమలు చేస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో వంద కోట్ల ఆప్కో ద్వారా వ్యాపారం చేయాలని లక్ష్యంతో పని చేస్తున్నామన్నారు. ప్రైవేటు వస్త్ర సంస్థలకు దీటుగా ఆప్కో మెగా షోరూమ్‌లను విశాఖపట్నంలో ప్రారంభిస్తా మన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, చేనేత, జౌళి శాఖ డైరెక్టర్‌ నాగరాణి పాల్గొన్నారు.