May 27,2023 01:06
మాట్లాడుతున్న సిపిఎం జిల్లా కార్యదర్శి గంగయ్య

ప్రజాశక్తి-చీరాల: చేనేత ఉత్పత్తుల కొనుగోలు బాధ్యత ప్రభుత్వానిదే అని సిపిఎం బాపట్ల జిల్లా కార్యదర్శి సిహెచ్‌ గంగయ్య అన్నారు. ప్రభుత్వమే చేనేత ఉత్పత్తులకు మార్కెట్‌ సౌకర్యం కల్పించి చేనేత కార్మికులను ఆదుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. శుక్రవారం చీరాల పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో గంగయ్య మాట్లాడారు. ప్రభుత్వ విధానాల కారణంగా చేనేత ముడి సరుకుల ధరలు పెరగడం, ప్రభుత్వ సబ్సిడీ లేకపోవడంతో చేనేత ఉత్పత్తులపై పెట్టుబడి పెరిగింది. మరోవైపు ప్రభుత్వం విధించే వివిధ రకాల పన్నుల కారణంగా చేనేత రంగం సంక్షోభంలోకి నెట్టబడిందని అన్నారు. మరోవైపు ఉత్పత్తి అయిన సరుకులను మార్కెట్‌లో కొనేవారు లేరని అన్నారు. గతంలో ఉన్న ఆప్కో ఇప్పుడు లేని కారణంగా చేనేత నిల్వలు పేరుకుపోయాయన్నారు. ఈ నేపథ్యంలో తరతరాలుగా చేనేత వృత్తినే ఆధారం చేసుకుని జీవిస్తున్న కుటుంబాల జీవన పరిస్థితులు మరింత దుర్భరంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత కార్మికుల ఆదుకునేదుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చి ఉత్పత్తులను కొనుగోలు చేయాలని, ముడి సరుకులకు సబ్సిడీ ఇవ్వాలని, చేనేత ఉత్పత్తులపై విధించిన జీఎస్టీని ఎత్తివేసి చేనేత కార్మికులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో సీపీఎం చీరాల పట్టణ కార్యదర్శి నలతోటి బాబురావు ఉన్నారు.