
ప్రజాశక్తి - ప్రత్తిపాడు : ఈత సరదా ఇద్దరు స్నేహితుల ప్రాణాలను తీసుకుంది. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ కేంద్రంలో శుక్రవారం జరిగిన ఘటనపై ఎస్‌ఐ డి.రవీంద్రబాబు వివరాల ప్రకారం.. స్థానిక చినపల్లె ప్రాంతానికి చెందిన చీలి ప్రసన్నకుమార్ (25), మరో ప్రాంతానికి చెందిన షేక్ నాగుల్‌మీరా (22) ఇద్దరూ స్నేహితులు. కారు డ్రైవర్‌గా పని చేసే ప్రసన్నకుమార్‌కు ఏడాది కుమారుడు ఉండగా భార్య మూడోనెల గర్భవతి కావడంతో తాడికొండలోని పుట్టింటి వద్ద ఉంటోంది. ఆమె వద్దకు వెళ్లిన ప్రసన్నకుమార్ గురువారమే ప్రత్తిపాడుకు వచ్చాడు. నాగూల్‌మీరా భవన నిర్మాణ పనులకు వెళ్తుంటారు. ఈ క్రమంలో వీరిద్దరూ శుక్రవారం ఉదయం 9.30 గంటలప్పుడు స్థానిక కోండ్రుపాడు మార్గంలోని తాగునీటి చెరువు వద్దకు ద్విచక్ర వాహనంపై వెళ్లారు. చెరువులో ఈత కోసమని దూకగా అటుగా పొలం పనులకు వెళ్తున్న రైతు గమనించి చెరువు బాగా లోతుగా ఉంటుందని హెచ్చరించేందుకు చెరువ వద్దకు వెళ్లాడు. అయితే అప్పటికే ఇద్దరూ మునుగుతూ తేలుతూ ఉండడంతో రైతు తాడుకొసమని పక్కనే ఉన్న పశువుల కొట్టం వద్దకు వెళ్లి స్థానికులకూ సమాచారం తెలిపాడు. ఇంతలోనే ఇద్దరూ మునిగిపోయారు. విషయం తెలిసిన స్థానిక పోలీసులు ఘటనా స్థలిని పరిశీలించారు. స్థానిక ఈతగాళ్లను పిలిపించి అరగంట గాలించగా ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో తాడేపల్లి నుండి గజ ఈతగాళ్లను పిలిపించగా వారు అరగంట గాలించి మధ్యాహ్నం 2.30 గంటల తర్వాత ప్రసన్నకుమార్, నాగూల్‌మీరా మృతదేహాలను వెలికి తీశారు. వీటిని పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల (జిజిహెచ్)కు తరలించారు. మృతుడు ప్రసన్నకుమార్ తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా మృతుల స్నేహితుడు ఒకరు కొద్ది నెలల కిందట క్వారీ గుంతలోనే నీటిలో పడి మృతి చెందాడు.