Mar 25,2023 00:19

మాట్లాడుతున్నశిరీషారాణి

ప్రజాశక్తి -నక్కపల్లి:చెత్త రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలని జిల్లా పంచాయతీ అధికారిణి శిరీషా రాణి సూచించారు. నక్కపల్లిలో ఏర్పాటు చేసిన శిక్షణ కేంద్రం వద్ద శుక్రవారం పారిశుధ్య నిర్వహణకు సంబంధించి ఎంపిక చేసిన మోడల్‌ పంచాయతీలు గోలుగొండ, కోటవురట్ల, నర్సీపట్నం, నాతవరం, నక్కపల్లి మండలాల నుండి రెండేసి పంచాయతీల సర్పంచ్‌లు, కార్యదర్శులు, సచివాలయం సిబ్బంది కు చెత్త నిర్వహణపై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా శిరీషా రాణి మాట్లాడుతూ, ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్‌, ఇతర వ్యర్థ పదార్థాలను వేయకుండా గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రజల్లో మార్పు వచ్చే విధంగా కృషి చేయాలని సూచించారు. పారిశుధ్య నిర్వహణ జీవన విధానంలో భాగస్వామ్యం కావాలన్నారు. గ్రామాల్లో సేకరించిన చెత్తను వర్మీ కంపోస్ట్‌గా తయారు చేయాలని సూచించారు. గ్రామాలు పరిశుభ్రంగా ఉంటే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. సంపద కేంద్రాల జిల్లా కోఆర్డినేటర్‌ నాగలక్ష్మి మాట్లాడుతూ, చెత్త సేకరణ, నిర్వహణపై అవగాహన కల్పించారు. ప్రతి ఇంటికి డస్ట్‌ బిన్‌లు అందజేసి, వాటిలో తడి, పొడి చెత్త వేరు వేరుగా వేసే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు ఈ కార్యక్రమంలో డిఎల్‌పిఓ మూర్తి, ఎంపీడీవో సీతారామరాజు, ఈఓపిఆర్‌డి వెంకటనారాయణ, సర్పంచ్‌ జయ రత్నకుమారి, పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్‌, ఆయా మండలాలకు సంబంధించి సర్పంచ్‌ లు, ఎంపీడీవోలు, ఈఓపిఆర్‌డిలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.