
ప్రజాశక్తి-చీరాల: చీరాల ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఎస్‌డబ్ల్యుఎఫ్ చీరాల శాఖ ఆధ్వర్యంలో నాయకులు ధర్నా నిర్వహించారు. ఆర్టీసీలో అక్రమ బదిలీలు ఆపాలని, పేరుకుపోయిన బకాయిలను వెంటనే చెల్లించాలని, జీతాలతో పాటే ఓటి బిల్లులు చెల్లించాలని కోరుతూ శుక్రవారం ఎస్‌డబ్ల్యుఎఫ్ చీరాల డిపో కమిటీ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు బి శ్రీనివాసరావు మాట్లాడుతూ అక్రమ బదిలీ విధానం వలన చీరాలలో 25 మంది కార్మికులు బదిలీ అవుతారని, అందువల్ల ఈ బదిలీలు వెంటనే ఆపాలని పాత పద్ధతుల్ని కొనసాగించాలని కోరారు. అలాగే క్యాడర్ స్ట్రెంత్ పేరుతో అక్రమ బదిలీలను ఆపాలని, ఆర్టీసీకి సంబంధించిన బకాయిలన్నీ ప్రభుత్వం చెల్లించాలని, తక్షణమే ఆర్టీసీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకొని పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరావుతో పాటు తులసీరావు, బాషా, వైవి రావు, కేబికే రెడ్డి, జై రావు, సిఐటియు నాయకులు పి కొండయ్య, సురేషు తదితరులు పాల్గొన్నారు.