Jun 02,2023 00:05

సిఐటియు ఆధ్వర్యాన ధర్నా చేస్తున్న చిరు వ్యాపారులు

ప్రజాశక్తి -పిఎం పాలెం : పొట్ట కూటి కోసం రోడ్డు పక్కన చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న పేదలపై జివిఎంసి దాడులు చేయడం అన్యాయమని సిఐటియు మధురవాడ జోన్‌ కమిటీ ఉపాధ్యక్షులు డి అప్పలరాజు అన్నారు. ఈ మేరకు మిథిలాపురి ఉడా కాలనీ ప్రాంతంలోని చిరు వ్యాపారులు సిఐటియు ఆధ్వర్యాన మధురవాడ జోన్‌-2 కార్యాలయం వద్ద గురువారం ధర్నా నిర్వహించారు. చిల్లర వర్తకులపై దాడులు ఆపాలని, రక్షణ కల్పించాలని పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ధర్నా అనంతరం జోనల్‌ కమిషనర్‌ కనక మహాలక్ష్మికి వినతిపత్రం అందజేశారు. తమకు వృత్తి చేసుకునేలా అనుమతి ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా అప్పలరాజు మాట్లాడుతూ, వీధి విక్రయదారుల పట్ల సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వాలు, స్థానిక అధికారులు అమలు చేయడం లేదన్నారు. చిరు వ్యాపారులపై దాడులు ఆపాలని, వారిని యథావిధిగా వ్యాపారాలు చేసుకొనివ్వాలని, సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌చేశారు. స్థానిక నాయకులు కె.పాపినాయుడు మాట్లాడుతూ, పేదలైన వీధి విక్రయదారులను కావాలనే జివిఎంసి సిబ్బంది ఇబ్బంది పెడుతున్నారన్నారు. అన్యాయాన్ని ఎదుర్కొనేందుకు తోపుడు బండ్ల కార్మికులు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం కార్యకర్తలు చాంద్‌ పాషా, కె.కామేష్‌, ఎం.ఆదినారాయణ, ఎన్‌.కృష్ణ, బి.శ్రీను, టి.అనిత, ఎన్‌.అరుణ, వై.కనకరత్నం, టి.శ్రీను, ఎన్‌.శీతంనాయుడు, ఎస్‌కె.రజాక్‌, అధిక సంఖ్యలో వర్తకులు పాల్గొన్నారు.