Nov 20,2020 20:27

న్యూఢిల్లీ : దేశంలో చిన్న మొత్తాల పథకాలకు భారీ డిమాండ్‌ నెలకొంది. కరోనా కాలంలోనూ ఈ పథకంలో రూ.లక్ష కోట్లకు పైగా చిన్న మొత్తాల్లో పొదుపు చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌లో స్మాల్‌ సేవింగ్స్‌ పథకాల్లో పెట్టుబడులు రూ.97,129 కోట్లకు చేరాయి. చిన్న మొత్తాల చరిత్రలో ఆరు నెలల కాలంలో ఈ పథకాల్లోకి వచ్చిన పెట్టుబడుల్లో ఇప్పటివరకిదే అత్యధిక గరిష్టం. మరోవైపు గతేడాది ఇదే కాలం పొదుపుతో పోల్చితే 25 శాతం పెరిగాయి. గడిచిన ఐదు ఆర్థిక సంవత్సరాల ప్రథమార్ధాల్లో వచ్చిన సరాసరి పెట్టుబడుల కంటే 130 శాతం అధికంగా నమోదయ్యాయి. భవిష్యత్‌పై అనిశ్చితి నెలకొన్నప్పుడు ప్రజలు జాగ్రత్తపడతారనడానికి ఇదే సంకేతమని నిపుణులు పేర్కొన్నారు.