Jul 27,2021 07:43

సారూ..
నా గుడిసె ఏడుత్తోంది
మబ్బులు కమ్మేత్తాయని
పిడుగులు కూల్చేత్తాయని
చినుకు పోటు పొడిచేత్తాదని
దిక్కెరగని స్థలంలో
ఎముకల పోట్లు పెట్టి
మా కండరాల కప్పడంతో
బక్క పాణం నిల్బెట్టుదామని
కట్టుకున్న పల్చాటి గుడిసె
ఏట్లో ఏకమై
కాట్లో తేలియాడుతూ
మట్టిలో కప్పెట్టుకుపోతా
కంట్లో నీరెట్టి
గుక్కబట్టి ఏడుత్తాంది
అయ్యా..సారూ
ఒకతూరి సూసిపోరాదు
చిక్కుళ్ళుపడ్డ కొంపది
చివుక్కుపోయిన గంతది
సిరిగిపోయిన పేలికల్తో
ఎదురు కట్టెకు లంగరు సుట్టి
నిలబెట్టిన గుడిసెది
చినుకు పోటు
తలపోటైంది సారూ
కోడి, కుక్క, పిల్లి ఏటిపాలై
కోత కోసిన నేల సరకల్లోంచి
సుక్కలొంక సూత్తున్నాం
బాగా తడిసిన
మురికి శరీరాల రొంపుతో
కాలం ఎగరేసిన గువ్వలమై
రెక్కలు తెగి పడున్నాం సారూ
ఒకసారొచ్చి సూసిపోరాదూ.
 

- నరెద్దుల రాజారెడ్డి,
సెల్‌ : 9666016636