Apr 20,2021 22:50

న్యూఢిల్లీ : దేశాన్ని లాక్‌డౌన్‌ల నుంచి కాపాడుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను చివరి అస్త్రంగానే పరిగణించాలని ప్రధానమంత్రి మోడీ విజ్ఞపి చేశారు. కరోనా పరిస్థితులపై మంగళవారం రాత్రి 8.45 గంటలకు మోడీ జాతినుద్దేశించి ప్రసంగించారు. కరోనాపై గత కొన్నాళ్లుగా కఠినమైన పోరాటం చేస్తున్నామన్నారు. కొన్ని వారాల క్రితమే దేశంలో కరోనా రెండో దశ విజృంభించిందని, ఇది మనకు తీవ్రమైన సవాలు విసురుతోందని అన్నారు. ప్రస్తుత సంక్షోభ పరిస్థితులను అధిగమించేందుకు మనమందరం ధృడంగా ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. వైద్యులు, మెడికల్‌ సిబ్బంది, ఇతర ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లు, పోలీసులకు సెల్యూట్‌ చేసిన మోడీ, రెండో దశలో కూడా వారు నిర్విరామంగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. యువత కమిటీలను ఏర్పాటు చేసుకొని, ప్రజలు తగిన విధంగా కోవిడ్‌ నిబంధనలు పాటించేలా చూస్తే.. కంటైన్‌మెంట్‌ జోన్లు, లాక్‌డౌన్లు అవసరం ఉండవని అన్నారు. తగిన కారణం లేకుండా ఇళ్లలోంచి బయటకు వెళ్లద్దు అనే సందేశాన్ని వ్యాప్తి చేయాలని చిన్నారులను కోరారు.

దేశంలో ఆక్సిజన్‌ కొరత దేశం నలుమూలలా ఉందని మోడీ అన్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమలతో కలిసి పనిచేస్తున్నామని అన్నారు. ఆక్సిజన్‌ను కొరత ఉన్న ప్రాంతాలకు రవాణా చేసేందుకు బహుళ మార్గాలను వినియోగిస్తున్నామని, వ్యాక్సిన్లు, ఔషధాల సరఫరాను పెంచుతున్నామని చెప్పారు. 'దేశంలో బలమైన ఫార్మా రంగం ఉండడం మన అదృష్టం. అత్యవసరంగా అవసరమైన ప్రాంతాల్లోని ఆసుపత్రుల్లో బెడ్ల సంఖ్యను పెంచుతున్నాం. అలాగే పెద్ద కోవిడ్‌ ఆసుపత్రులను ఏర్పాటు చేస్తున్నాం' అని అన్నారు.

వ్యాక్సినేషన్‌పై మోడీ మాట్లాడుతూ.. వేగవంతంగా ప్రజలకు వ్యాక్సిన్‌ అందిస్తున్న దేశాల్లో భారత్‌ అగ్రభాగాన ఉందని, ఇప్పటికే దాదాపు 12 కోట్ల మందికి వ్యాక్సిన్‌ అందించామని చెప్పారు. వచ్చే నెల 1 నుంచి 18 ఏళ్ల పైబడిన వారందరికీ వ్యాక్సినేషన్‌ ప్రారంభమౌతుందని, ప్రజల ప్రాణాలను కాపాడడమే తమ లక్ష్యమని అన్నారు. అందరికీ వ్యాక్సిన్‌ ప్రారంభించిన తర్వాత నగరాల్లోని కార్మిక వర్గం అందరికీ వ్యాక్సిన్లు త్వరగా అందుతాయని, ఎక్కడివారు అక్కడే ఉండాలని కోరారు. మోడీ అంతకుముందు వ్యాక్సిన్‌ ఉత్పత్తిదారులతో వర్చువల్‌గా భేటీ అయ్యారు. ఈ సమావేశానికి భారత్‌ బయోటెక్‌ నుంచి ఎమ్‌డి కృష్ణ ఎల్ల, జెఎండి సుచిత్ర ఎల్ల, సీరం సంస్థ నుంచి ఎమ్‌డి అధర్‌ పూనావాలా హాజరయ్యారు. వ్యాక్సిన్ల ఉత్పత్తిపై మోడీ వారితో చర్చించారు.