May 30,2021 14:59

సుకుమార వదనాలైన మొక్కలు ప్రకృతికి పర్యాటక శోభనద్దే సుందర విందాలు. పువ్వూ, పింది ఆకులతో మనసుల్ని ఇట్టే ఆకట్టుకుంటాయి. కోటానుకోట్లగా ఉన్న విరితోటలో ఏ మొక్కందం ఆ మొక్కది. అయితే కొన్ని ప్రత్యేక మొక్కలు మాత్రం విభిన్న ఆకారాల్లో కొలువుదీరి, కనువిందు చేస్తుంటాయి. చక్కనైన ఆకారాలకు ప్రాకారాలుగా నిలుస్తున్న ఈ వెరైటీ మొక్కలకు గిరాకీ కూడా ఎక్కువే. ఈ అరుదైన మొక్కల గురించి ఈ వారం తెలుసుకుందాం !

                                                                       డక్‌ కాక్టస్‌..

డక్‌ కాక్టస్‌..

పొడవాటి ముళ్ల ముక్కు, సన్నగా ఉండే పీకతో అచ్చంగా బాతును పోలి ఉండే కాక్టస్‌ మొక్క ఇది. పెద్దగా నీటి వనరు అవసరం లేని ఈ ఎడారి మొక్క పదుల సంవత్సరాలు బతుకుతుంది. కుండీల్లో పెంచుకుంటే చూడచక్కగా ఉంటుంది. మొదలు మట్టి భాగంలో రాళ్లు వేసుకుంటే మరింత శోభాయమానంగా ఉంటుంది.

                                                                         గోస్ట్‌ ఆర్చిడ్‌..

  గోస్ట్‌ ఆర్చిడ్‌..

మన వాడుకలో ముద్దుగా 'తెల్లదెయ్యం పూలమొక్క' అంటారు. ఇది ఆర్చిడ్‌ జాతికి చెందింది. తెల్లటి రేఖ పువ్వు ముఖం మాదిరిగా పుప్పొడి ఉంటుంది. ఇది ఇంటి లోపల ఎండ తగలని ప్రదేశంలో పెంచుకునే మొక్క. మట్టి లేకపోయినా బొగ్గు, కొబ్బరి పొట్టు వంటి కర్బన మిశ్రమాల్లో కూడా ఈ మొక్క పెరిగేస్తుంది. నీళ్లు కూడా కొద్ది మోతాదులో చాలు. ఆకులు సన్నగా, పొడవుగా ఉంటాయి. శీతల ప్రాంతాల్లో పువ్వులు బాగా పూస్తాయి.
 

                                                                    నేక్డ్‌ మేన్‌ ఆర్చిడ్‌..

నేక్డ్‌ మేన్‌ ఆర్చిడ్‌..

నేక్డ్‌ మేన్‌ ఆర్చిడ్‌ అనేది ఆర్చిడ్‌ మొక్కల్లో మరో వింత పూలమొక్క. పువ్వులు లేత గులాబీ రంగుతో, టోపీ ఉండి బఫూన్స్‌ వలే ఉంటాయి. తోకలతో పూల బొమ్మలు చూడ్డానికి వింతగా నవ్వు పుట్టిస్తాయి. వీటిని ''లాఫింగ్‌ ఫ్లవర్స్‌'' అనీ అంటారు.
 

                                                                       పంప్కిన్‌ కాక్టస్‌..

  పంప్కిన్‌ కాక్టస్‌..

ఎడారి జాతికి చెందిన ఈ మొక్క అచ్చంగా గుమ్మడికాయను పోలి ఉంటుంది. పైన ఉండే రంగురంగుల డిజైన్‌ ఎంతో ఆకర్షణగా ఉంటుంది. తల భాగాన పుప్పొళ్ళు చిన్నిచిన్ని మొక్కలతో అందంగా ఉంటాయి. దీనికి చాలా తక్కువ నీరు అవసరం. మొక్క ఎదుగుదలా నెమ్మదిగా ఉంటుంది.
 

                                                                        ట్రిగ్‌ కోస్టస్‌..

 ట్రిగ్‌ కోస్టస్‌..

కోస్టస్‌లో డజన్‌ వరకూ రకాలున్నాయి. అందులో ఒకటి ట్రిగ్‌ కోస్టస్‌. నాటిన రెండేళ్ల తరువాత రింగులు రింగుల్లాంటి గెలలు వస్తాయి. వాటిలోంచి రేఖలు మాదిరిగా ఉండే పూలు విచ్చుకుని, వాడిపోతుంటాయి. ఒకానొక సమయంలో ట్రిగ్‌ మాత్రమే మిగులుతుంది. పసుపు, ఎరుపు రంగుల కలబోతతో ఈ గెల ఎంతో రమణీయంగా ఉంటుంది. ఇది నెలలు తరబడి ఆకర్షణీయంగా ఉంటుంది. ఆకులు సన్నగా, పొడవుగా ఉంటాయి. కుండీల్లోనూ, నేల మీదా వీటిని పెంచుకోవచ్చు. వీటి ఆకులను ఆయుర్వేదంలో ఔషధంగా వాడతారు.
 

                                                                         ఊట మొక్క..

  ఊట మొక్క..

వంకరటింకర్ల ఊట మొక్క ఇది కర్వడ్‌ షేప్‌ సుకులెంట్‌ ప్లాంట్‌. ఊట మొక్కను ఆంగ్లంలో సుకులెంట్‌ ప్లాంట్‌ అంటారు. ఈ మొక్కల యొక్క ఆకులను లేదా కాండాన్ని గిల్లినప్పుడు లేదా తుంచినప్పుడు నీరు ఊరుతుంది. అందువల్ల ఈ మొక్కలను ఊట మొక్కలు అంటారు. ఊట మొక్కలు పొడి వాతావరణానికి తగినవిగా ఉంటాయి. ఇవి వాటి యొక్క ఆకులు, కాండం, వేర్లలో ఏదో ఒకచోట నీటిని నిల్వ చేసుకుంటాయి. ఇవి సాధారణంగా మామూలు మొక్కలకు కొంచెం భిన్నంగా ఉంటాయి. వీటి ఆకులు ఎక్కువ కండ కలిగి, చూడ్డానికి అందంగా ఉంటాయి. కుండీల్లోనూ నేల మీద పెంచుకోవచ్చు. పెద్దగా నీరు అవసరం లేదు. మొక్క మొదలు నీరు నిలువ ఉంటే చనిపోతాయి. ఆకుల్లేని వీటి కాడలు వంకర్లు తిరుగుతూ పెరుగుతాయి. చూడ్డానికి ఇవి ప్లాస్టిక్‌ వస్తువుల్లానే ఉంటాయి.

                                                                       భలే బాటిల్‌ గార్డు..

 భలే బాటిల్‌ గార్డు..

బాటిల్‌ గార్డు అంటే ఆనపకాయ (సొరకాయ)ని మనకు తెలుసు. పాదులా పాకే ఈ మొక్క రకరకాల ఆకృతుల్లో కాయలు కాస్తుంది. అచ్చంగా బాటిల్‌ ఆకారంలో ఉంటుంది. వీటిలో మరలా డబుల్‌ స్టెప్‌, త్రిబుల్‌ స్టెప్‌ ఆనపకాయలు కాసే మొక్కలుంటాయి. నిత్యం ఇరగ కాపుకాసే ఈ హైబ్రీడ్‌ ఆనపకాయలు పాదు ఇంటి ముంగిట వేస్తే, ఎంతో కనువిందు చేస్తాయి.
 

                                                                   శంఖం పువ్వు మొక్క..

శంఖం పువ్వు మొక్క..

పువ్వు, ఆకు, తీగ, వేరు ఇలా మొక్కలోని అన్ని భాగాలూ వైద్య విలువలున్న పాదు జాతి మొక్క శంఖు పూలమొక్క శంఖాకారంగా ఉండే తెలుపు, నీలి, ముదురు నీలి, లేతగులాబీ రంగుల్లో పువ్వులు పూస్తాయి. పువ్వులు నీటిలో వేయగానే రంగు దిగుతుంది. సహజ రంగులుగా వీటిని తినే ఆహారాల్లో వాడతారు. ఇంటి పెరట్లో, కుండీల్లో వీటిని పెంచుకోవచ్చు. నల్లరేగడి, ఎరుపు, రాతి నేలల్లో సైతం ఇవి చక్కగా పెరుగుతాయి. పూజకు కూడా వీటిని ఉపయోగిస్తారు. వాసన రాకపోయినా పువ్వులు అందంగా సుతిమెత్తగా ఉంటాయి.

- చిలుకూరి శ్రీనివాసరావు
89859 45506