Nov 23,2021 18:52

ఈ చెక్క గుర్రాలను చూస్తే... 'చల్‌చల్‌ గుర్రం, చలాకీ గుర్రం. రాజు గారి గుర్రం. నేనెక్కితే గుర్రం, మబ్బుల్లో పరుగులెట్టు గుర్రం'. అంటూ కొయ్య గుర్రం మీద ఊగుతూ పాడుకున్న, ఆడుకున్న రోజులు గుర్తొస్తాయి. అటువంటి ఈ బొమ్మలకు ప్రాణం పోస్తును మస్తాన్‌ వలి ఆధునిక కాలంలో కూడా ప్రాచీన కళకు ప్రాచుర్యం తెస్తూ వృత్తిలో సంతృప్తి చెందుతున్నారు.
ప్రస్తుత బాల్యమంతా ఆటలు.. సరదాలకు దూరమైపోతోంది. నాలుగేళ్ల చిన్నారి మొదలు... వయస్సు మళ్లిన వారంతా అందరి చేతుల్లోనూ ఫోన్లే ఉంటున్నాయి. అందులోని గేమ్స్‌ ఆడుతూ, అదో ప్రపంచంలా గడుపుతున్నారు. ఫలితంగా కళ్లు, మెదడు సంబంధ వ్యాధులు వస్తున్నాయి. ఇటువంటి రోజుల్లో పిల్లల ఆరోగ్యం, ఆనందాన్ని దృష్టిలో ఉంచుకుని మస్తాన్‌ వలి ఈ చెక్క గుర్రం బొమ్మలను తయారు చేస్తున్నారు. అంతేకాదు... తన వృత్తిలో కొత్తదనం వెతుక్కుంటూ.. తనకు సంతోషాన్ని కలిగించిన బొమ్మల తయారీకి ప్రాధాన్యత ఇస్తున్నారు.
గుంటూరు జిల్లా పొన్నూరు మండలానికి చెందిన షేక్‌ మస్తాన్‌ మలి చిన్నప్పటి నుంచే వడ్రంగి పనులు చేస్తూ జీవనం సాంగించేవారు. అయితే ఆ పని ఎంత చేసినా సంతృప్తి ఇవ్వలేదు. కొత్తగా ఏదన్న చేయాలన్న ఆలోచన తనని నిత్యం వెంటాడుతూ ఉండేది. అదే విషయాన్ని తన మిత్రుడు సుభానికి చెప్పాడు. స్నేహితుని సలహా మేరకు కొయ్య బొమ్మల తయారీ గురించి తెలుసుకున్నారు. అందులో కొన్ని మెలకువలు నేర్చుకున్నారు. '62 ఏళ్ళ వయసులో 40 సంవత్సరాలు వృత్తిలో ఇవ్వని తృప్తి 5 ఏళ్ల క్రితం కొయ్య బొమ్మ తయారు చేయడంలో పొందాను' అని మస్తాన్‌ వలి అన్నారు. నేరేడు చెక్కతో బొమ్మ తయారు చేసి, మధ్యలో సీటు ఏర్పాటు చేసి, రంగులు వేస్తే బొమ్మ సిద్ధం. చెక్క బమ్మకి రంగులు వేయడంతో రోడ్డున వచ్చే, పోయే వారిని ఆకర్షిస్తుంది. చూసిన ప్రతిఒక్కరూ 'బొమ్మలు బాగున్నాయి' అని చెప్పడంతో ఎంతో ఆనందం పొందారు. దశాబ్దాల క్రితం ఎక్కువగా ఇళ్లలో చిన్నారులను ఇలాంటి బొమ్మల పైనే ఎక్కించి ఆట్లాడేవారు. అలాంటి పాత రోజుల్ని మస్తాన్‌ వలి గుర్తుకు తెచ్చుస్తున్నారని చుట్టూ పక్కల వ్యాపారస్తులు, వినియోగదారులు అంటున్నారు. ఆయన చేసిన బొమ్మకి కూడా మంచి ధర కూడా పలికింది. ఆ ఉత్సాహంతో గుర్రంతో పాటు, హంస, ఏనుగు బొమ్మలు తయారు చేయడం మొదలుపెట్టారు. అప్పుడు ఎక్కువ బొమ్మలు చేసి పట్టణాలకు తీసుకెళ్లి ఎగ్జిబిషన్‌లలో అమ్మారు. ఎగ్జిబిషన్‌ నిర్వాహకులు కూడా ఆర్డర్లు ఇచ్చి మస్తాన్‌ వలిని ప్రోత్సహించారు.

చల్‌ చల్‌ గుర్రం.. చెక్కల గుర్రం ...

జీవం ఉట్టిపడేలా గుర్రం తయారీ
జీవం ఉట్టిపడేలా గుర్రం బొమ్మలు చేయడం మస్తాన్‌ వలి ప్రత్యేకత. కొద్దిగా ఖర్చుకు వెనుకాడని వారికోసం గుర్రమే నిలబడిందా అనే భ్రమ కలిగే విధంగా బొమ్మలు తయారు చేస్తారు. ముక్కలు చేయకుండా ఒకే చెక్క తీసుకొని గుర్రాన్ని తయారు చేసే నైపుణ్యం ఆయనది. జూలు, తోక, కూర్చునే సీటు సహజంగా ఉండేలా మార్కెట్లో వస్తువులు కొనుగోలు చేసి అమర్చుతారు. ఖరీదైన చెక్కను మెషీన్‌ సహాయంతో ముక్కలుగా కట్‌ చేసుకుని, ఇనుప ముక్కల సహాయంతో పిల్లలు కూర్చునేందుకు వీలుగా సీటు అమర్చి బొమ్మను తయారీ చేసి, వాటికి రంగులు వేస్తారు. దీనికి ఒక రోజంతా పడుతుంది. మస్తాన్‌ మాత్రం రోజుకి రెండు బొమ్మలను తయారుచేస్తారు. మామూలు బొమ్మ రూ.1500 ఖరీదు ఉంటుంది. కొంత మంది తమకు నచ్చిన విధంగా బొమ్మ కావాలని ఆర్డర్లు ఇస్తారు. దానికి తగ్గట్టు ధర కూడా ఉంటుంది. రోజురోజుకీ బొమ్మలకి ఆదరణ పెరగడంతో ప్రకాశం జిల్లా జాండ్రపేటలో దుకాణం పెట్టారు. నెల్లూరు, బెంగుళూరు, విజయవాడ, చీరాల చుట్టు పక్కల ప్రాంతాల వారు వచ్చి, బొమ్మలు కొనుక్కుపోయేవారు. రోజుకు రెండు బొమ్మలు అమ్ముడు పోయేవి. లాభం కూడా వచ్చేది.

చల్‌ చల్‌ గుర్రం.. చెక్కల గుర్రం ...


కరోనాతో దుకాణం మూత
ప్రతిరోజూ పొన్నూరు నుంచి బస్సులో ప్రయాణించి జాండ్రపేట వెళ్లేవారు మస్తాన్‌ వలి. సాయంత్రానికి రెండు, మూడు చెక్క బొమ్మలు తయారు చేసి, అమ్ముకుని తిరిగి ఇంటికి వచ్చేవారు. ''అంతా సానుకూలంగా ఉన్న సమయంలో రెండేళ్ల క్రితం కరోనా కారణంగా దుకాణం మూత పడింది. దాంతో తిరిగి పొన్నూరు వచ్చి ఇంటి వద్దే బమ్మలు తయారీ చేస్తున్నాను. కరోనా వల్ల వ్యాపారం సాగలేదు. కుటుంబం ఇబ్బందులు పడింది. రెండు నెలల నుంచి వ్యాపారం కొద్దిగా సాగుతుంది. నెలకు 15 బమ్మల వరకూ అమ్ముడు పోతున్నాయి. చెక్క గుర్రాల తయారీ కళను బతికించి, ఆదరణ తెచ్చిన మస్తాన్‌... బొమ్మల తయారీ నేర్చుకోవాలనుకునే వారికి నేర్పుతానని అంటున్నారు. తమ లాంటి హస్త కళాకారులకు ప్రభుత్వం రుణ సహాయం అందిస్తే ఆసరాగా ఉంటుందని మస్తాన్‌ వలి అంటున్నారు.

చల్‌ చల్‌ గుర్రం.. చెక్కల గుర్రం ...
చెక్క బొమ్మలతో ఆరోగ్యానికి మేలు
ఇప్పుడు ఏ షాపు చూసినా ప్లాస్టిక్‌ బొమ్మలే కనిపిస్తున్నాయి. ఇవి పిల్లల ఆరోగ్యానికి హాని కలిస్తాయి. ఈ తరుణంలో మస్తాన్‌ వలి చేస్తున్న చెక్క బొమ్మలు వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. పట్టణంలో మార్కెట్‌ జెండా చెట్టు దగ్గర ఇప్పుడు బొమ్మలు తయారుచేస్తున్నారు. ఈ బమ్మ చిన్నారులకు ఆరోగ్యంతో పాటు, వ్యాయామాన్ని కూడా ఇస్తుంది. బొమ్మలు కావాలనుకునేవారు 63011 08035 ఫోన్‌ నెంబర్లో మస్తాన్‌ని పలకరించొచ్చు.
- షేక్‌ ఖాజా మహ్మద్‌, పొన్నూరు విలేకరి