Dec 05,2020 19:43

శీతాకాలం చలిని మాత్రమే కాదు; దాంతో పాటు ఎన్నో సమస్యలనూ తెస్తోంది. చర్మం పొడిబారిపోవడం దగ్గర నుంచి రకరకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. చిన్నారులకు, మహిళలకు, వృద్ధులకు చలికి బుగ్గలు ఎర్రగా, చేతులు పొడిగా మారతాయి. పెదాలు, పాదాల పగుళ్లు, చర్మం చిట్లడం వంటి ఇబ్బందులు ఎదురవుతాయి. మెడ కండరాలు పట్టేయడం వంటి ఇబ్బంది తలెత్తుతుంది. ఈ కాలంలో ఎదురయ్యే ఈ సమస్యలకు అన్ని వయసుల వారూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

  • చలి గాలి సోకనివ్వకుండా చిన్నారులు, వృద్ధులు ఒంటిపైన మందపాటి దుస్తులు ధరించాలి. చెవుల్లోకి గాలి చొరబడకుండా మఫ్‌లర్‌, స్కార్ఫ్‌, మంకీక్యాప్‌ వంటివి తలపై నుంచి మెడభాగం వరకూ కప్పుకోవాలి. ఆస్తమా, ట్రాన్స్‌లైటిస్‌ ఉన్నవారు చెవిలో దూదిని తప్పక పెట్టుకోవడం మంచిది. చిన్నారులు, వృద్ధులు ఉదయం ఎనిమిదిలోపు, సాయంత్రం నాలుగు తర్వాత వచ్చే నీరెండలో కనీసం ఇరవై నిమిషాలపాటు అయినా ఉండేలా చూసుకోవాలి.
  • ఆహార నియమాలు తప్పక పాటించాలి. ఎక్కువ సమయం నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను తీసుకోకూడదు. అలా తీసుకోవడం వల్ల ఈ కాలంలో శరీరంలో ఉండే హెచ్చుతగ్గుల ఉష్ణోగ్రతల కారణంగా అరుగుదల ఆలస్యంగా జరుగుతుంది. వీలైతే తినటానికి కొద్దిసేపు ముందు వండుకోవాలి. అటువంటి అవకాశం లేకపోతే, హాట్‌బాక్సులు వాడటం మంచిది. మజ్జిగ, కూల్‌డ్రింక్స్‌, ఐస్‌క్రీమ్‌లు వంటి శీతల పదార్థాలను వీలైనంత వరకు తగ్గించి వాటి స్థానంలో వేడి వేడిగా రైస్‌, టమాటా, కార్న్‌, వెజిటబుల్‌ సూప్‌లను తీసుకోవాలి. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తి పెంచేందుకు తోడ్పడతాయి.
  • ఈ కాలంలో చర్మంపై దద్దుర్లు, అలర్జీలు వస్తుంటాయి. వీటి బారిన పడకుండా ఉండాలంటే, ధరించే ఉన్ని దుస్తుల్ని, కప్పుకునే రగ్గులు, దుప్పట్లను రోజూ ఎండలో పెడుతుండాలి. అలా చేయడం వల్ల అందులో ఉండే దుమ్ము, క్రిములు నశించి అలర్జీల వంటివి దరిచేరనివ్వకుండా ఉంటాయి. బెట్‌షీట్లను, దిండు గలేబుల్ని కనీసంగా వారంలో రెండుసార్లు మార్చుకోవాలి.
  • చలి కారణంగా రెండు పూటలా స్నానం చేయడానికి వెనకాడతాం. కానీ, రెండుపూటలా గోరువెచ్చని నీటితో స్నానం చేయటం మంచిది. పిల్లలకు సున్నిపిండిలో పసుపు, పాల మీగడ, వెన్న, నువ్వులనూనెల వంటివి చేర్చి శరీరానికి పట్టించి గోరువెచ్చని నీటితో స్నానం చేయించాలి. మహిళలు, వృద్ధులు స్నానం చేసే ముందు కొబ్బరినూనె పట్టించుకుని, గ్లిజరిన్‌ సబ్బుని వాడుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై దద్దుర్లు, దురద వంటివి రావు.
  • కొందరికి ఈ కాలంలో కాళ్లు పగులుతాయి. అటువంటి వారు గోరువెచ్చని నీటిలో ఒక స్పూను కొబ్బరినూనె వేసి పాదాల్ని అందులో పెట్టుకోవాలి. రాత్రి పడుకునే ముందు కాళ్లు, చేతులకు క్రీము రాసుకోవాలి.
  • చలికి ప్రధానంగా మెడ నరాలు పట్టేయడం, బెణకడం, తిమ్మిరి వంటి సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా నడి వయసుల వారిని ఈ సమస్యలు ఇబ్బంది పెడతాయి. అటువంటి వారు ఉదయం, సాయంత్రం పదీ పదిహేను నిమిషాల పాటు కాళ్లూ చేతులూ, మెడ కదుపుతూ వ్యాయామం చేయాలి. గర్భిణులు కూడా ఈ కాలంలో ఒకే దగ్గర ఎక్కువ సేపు కూర్చోకుండా మధ్యమధ్యలో అటూ ఇటూ తిరుగుతూ ఉండాలి. అలా చేయడం వల్ల తల్లి చురుగ్గా ఉండటమే కాకుండా బిడ్డకూ మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు.
  • సన్‌స్క్రీన్‌ లోషన్స్‌ ఎండాకాలంలో మాత్రమే కాదు, ఈ సమయంలోనూ అవసరమే! చలికాలంలో ఎండ చురుక్కుమంటుంది. అసలే చర్మం పొడిబారి ఉంటుంది. అటువంటప్పుడు ఈ ఎండ చర్మంపై మరింత ఇబ్బంది పెడుతుంది. లోషన్‌కు బదులు వెన్న, కొబ్బరి నూనె రాసుకుంటే మేలు. శరీరంతోపాటు జుట్టుకు కూడా పొడిబారడం, చిట్లటం, చుండ్రు వంటి సమస్యలు తలెత్తుతాయి. ఆముదం, కొబ్బరినూనె, ఆలివ్‌ వంటివి జుట్టుతత్వం బట్టి వాడుకొని, జుట్టుని సంరక్షించుకోవచ్చు.
  • చలికాలంలో దాహం వేయట్లేదని నీళ్లు తాగడం తగ్గించేస్తాం. శరీరానికి తగిన నీటిని అందించడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి అవసరమైనంత నీటిని తాగాలి. చిన్నారులు, గర్భిణులు, వృద్ధుల్లో రోగ నిరోధకశక్తి ఎక్కువగా ఉండదు కాబట్టి, నీటిని కాచి వడబోసుకుని తాగాలి.
  • ఈ కాలంలో దొరికే అన్ని రకాల పళ్లు, ఆకుకూరలు, కాయగూరల్ని తీసుకోవాలి. సోయా, చిక్కుళ్లు వంటి ప్రోటీన్లు గల గింజధాన్యాలు తీసుకోవాలి. పీచు పదార్థాల్ని ఆహారంలో తప్పక జోడించుకోవడం వల్ల వృద్ధులకు, గర్భిణులకు మలబద్ధకం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. అలర్జీ దరిచేకుండా ఉండాలంటే, ఈకాలంలో దొరికే కమలాలు, ఉసిరి వంటి 'సి' విటమిన్‌ ఉన్న పండ్లను తీసుకోవాలి
  • గది, ఆరుబయట, ఇంటి పరిసరాలు పొడిగా ఉండేలా చూసుకోవాలి. దోమలు ఇంట్లోకి ప్రవేశించకుండా జాగ్రత్తల్ని తీసుకోవాలి. చిన్నారులు, గర్భిణులు, వృద్ధులు, శ్వాసకోస సమస్యలున్నవారు పొగతో వచ్చే దోమ సంహారకాల్ని వాడకపోవడం మంచిది.