Oct 19,2021 00:59

అనంతగిరిలో పోస్టర్‌ ఆవిష్కరిస్తున్న నాయకులు

ముంచంగిపుట్టు : గిరిజన ఉప తెగలు భగత, వాల్మీకిలను ప్రభుత్వ వెబ్‌ సైట్ల నుంచి తొలగించడంపై గిరిజన సంఘం, అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 22న తలపెట్టిన చలో ఐటిడిఎను జయప్రదం చేయాలంటూ సోమవారం మండలంలోని పలు గ్రామాల్లో గడపగడపకూ తిరిగి నాయకులు ప్రచారం చేశారు. ఆ రోజు ప్రతి ఇంటి నుంచీ అందరూ పాడేరు తరలిరావాలని, వాల్మీకి, బగత తెగలను తొలగించిన వారిని అరెస్టు చేసేంత వరకు ఉద్యమించాలని కోరారు. కార్యక్రమంలో గిరిజన ఉద్యోగుల సంఘం నాయకులు ఎం.ధర్మారావు, ఎస్‌.గోపి, గిరిజన సంఘం నాయకులు కె.త్రినాధ్‌, ఎంఎం.శ్రీను, పి.సత్యనారాయణ, ఎస్‌.గాసిరామ్‌ దొర తదితరులు పాల్గొన్నారు.
అనంతగిరి : ఈ నెల 22న జరిగే చలో ఐటిడిఎ కార్యక్రమం పోస్టర్‌ను మండల కేంద్రంలోని గిరిజన సంఘం కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జెడ్‌పిటిసి దీసరి గంగరాజు మాట్లాడుతూ గిరిజన తెగల మధ్య చిచ్చు పెట్టేందుకు కుట్ర జరుగుతోందన్నారు. గిరిజన చట్టాల నిర్వీర్యానికి పాలకులు కుటిల యత్నాలు చేస్తున్నారని తెలిపారు. అటువంటి ప్రయత్నాలను పోరాటాలతో తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గిరిజన సంఘం మండల నాయకులు ఎస్‌.నాగులు, జె.సుబ్బారావు, యుటిఎఫ్‌ మండల నాయకులు పి.దేవుడు, ఎస్‌.రాంబాబు, మల్లేష్‌, రఘు, పడాల నాగేష్‌ పాల్గొన్నారు.