
ప్రజాశక్తి-తాడేపల్లి: ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ, కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా, రైతాంగ హక్కులకై ఏప్రిల్ 5న జరిగే చలో డిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఏపి రైతు సంఘం జిల్లా అధ్యక్షులు జొన్నా శివశంకరరావు కోరారు. సోమవారం రాత్రి కాజ వెంకటేశ్వరరావు అధ్యక్షతన తాడేపల్లి ప్రజాసంఘాల కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. 5న చలో డిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి బుధవారం తాడేపల్లిలో సదస్సు నిర్వహించాలని తీర్మానించారు. ఈ సందర్భంగా శివశంకరరావు మాట్లాడుతూ మతోన్మాద నియంతృత్వ బిజెపి ప్రభుత్వానికి బుద్ధి చెప్పకపోతే ఈ దేశ ప్రజా సంపద అంతా ఆదానీ, అంబానీల చేతుల్లోకి వెళ్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏప్రిల్ 5న దేశ రాజధాని డిల్లీలో లక్షలాది మందితో జరిగే కార్మిక, కర్షక ర్యాలీని జయప్రదం చేయాలని కోరారు. అసంఘటిత రంగంలో పని చేస్తున్న కార్మికులకు కనీస వేతనం రూ.20 వేలు, పెన్షన్ రూ.10 వేలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు పద్థతి ఎత్తివేసి పర్మినెంట్ ఉద్యోగాల విధానం అమలు చేయాలని కోరారు. సైన్యంలో ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలని కోరారు. ఆర్‌ఎస్‌ఎస్, భజరంగ్ దళ్ కార్యకర్తలను సైన్యంలోకి రిక్రూట్‌మెంట్ చేసుకోవడానికే ఈ పథకాన్ని తీసుకొచ్చారని విమర్శించారు. వ్యవసాయ ఉత్పతులు అన్నింటికీ కనీస మద్దతు ధర గ్యారెంటీ చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయం మీద ఆధారపడిన పేద, మధ్యతరగతి రైతులు, వ్యవసాయ కార్మికులు అందరికీ రుణమాఫీ అమలు చేయాలని కోరారు. 60 ఏళ్లు నిండిన వారందరికీ పింఛను మంజూరు చేయాలని కోరారు. కార్మికులకు శాసనంగా మారిన నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు పెనుభారంగా మారిన విద్యుత్ సవరణ చట్టం 2022ను రద్దు చేయాలని కోరారు. పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన విభజన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఉపసంహరించుకోవడంతో పాటు కడప ఉక్కును వెంటనే ప్రారంభించాలని కోరారు. 200 రోజులు ఉపాధి మామీ పనులు కల్పించడంతో పాటు రోజు కనీస వేతనం రూ.600 ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన మేరకు సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికులు, హమాలీ, ఆటో, ప్రైవేటు ట్రాన్స్‌పోర్టు తదితర అసంఘటిత రంగ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు. వీటితో పాటు మొత్తం 21 డిమాండ్ల సాధన కోసం జరుగుతున్న చలో డిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి బుధవారం జరిగే సదస్సును జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో సిఐటియు తాడేపల్లి పట్టణ కార్యదర్శి వేముల దుర్గారావు, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు కోటా బాబురావు, సిఐటియు పట్టణ నాయకులు కొట్టె కరుణాకరరావు, రైతు సంఘం మండల కార్యదర్శి కాజ వెంకటేశ్వరరావు, కౌెలు రైతు సంఘం నాయకులు పల్లె కృష్ణ, సంసోన్‌లు పాల్గొన్నారు.