
ప్రజాశక్తి-కొండపి : అంగన్‌వాడీల సమస్యల పరిష్కారం తలపెట్టిన చలో విజయ వాడను అడ్డుకోవడం దారుణమని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కెజి.మస్తాన్ తెలిపారు. చలో విజయవాడ కార్యక్రమంలో పాల్గొనరాదని కోరుతూ కెజి.మస్తాన్‌కు పోలీసులు ఆదివారం నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హక్కుల కోసం పోరాడటమే నేరమా అనిప్రశ్నించారు. అంగన్‌వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. అంగన్‌వాడీలపై అధికారులు, రాజకీయ నాయకులు వేధింపులు అరికట్టాలని ఆయన డిమాండ్ చేశారు. పొదిలి : రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన చలో విజయవాడ వెళ్ళకూడదని అంగన్‌వాడీలకు ముందస్తు నోటీసులు ఇవ్వడాన్ని తాము ఖండిస్తున్నట్లు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. రమేష్ ఓ ప్రకటనలో తెలిపారు. అంగన్‌వాడీ ప్రాజెక్టు అధ్యక్షురాలు ఎం.శోభారాణి, అంగన్‌వాడీలు నీరజ, జి.భాగ్యలక్ష్మి, జి.కోటేశ్వరిని పోలీసు స్టేషన్‌కు పిలిపించి నోటీసులు జారీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. నిర్భంధాలతో పోరాటాలను అణచివేయాల నుకోవడం ప్రభుత్వ అవివేకమన్నారు. శాంతియుతంగా జరపతలపెట్టిన ధర్నాకు ఆటంకాలు కల్పించరాదన్నారు. అంగన్‌వాడీల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పామూరు : అంగన్‌వాడీల సమస్యల పరిష్కారం కోసం చేపట్టనున్న చలో విజయవాడ నేపథ్యంలో పోలీసులు నాయకులపై బైండోవర్ కేసులు పెట్టడం సరైనది కాదని సిపిఎం మండల కార్యదర్శి కె.మాల్యాద్రి తెలిపారు. పోలీసులు సిపిఎం, ప్రజాసంఘాల నాయకులకు ఆదివారం ముందస్తు నోటీసులు అందజేయడం దారుణమని ఆయన ఆరోపించారు. పోలీసుల నుంచి నోటీసుల అందుకున్న వారిలో కె.మాల్యాద్రి, షేక్ ఖాశిం సాహెబ్, సిహెచ్.వెంకటేశ్వర్లు, మహాదేవయ్య, పిచ్చిరెడ్డి తదితరులు ఉన్నారు. నాగులుప్పలపాడు : అంగన్‌వాడీల సమస్యల పరిష్కారం సోమవారం తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమంలో పాల్గొనకూడదంటూ మండల పరిధిలోని చదలవాడ గ్రామానికి చెందిన సిఐటియు నాయకుడు ఎ. చిరంజీవికి , దాసరి ఆంజనేయులు, సిపిఎం మండల నాయకులు జె.జయంతిబాబు, టి శ్రీకాంత్ , జి. బసవపున్నయ్య, రైతుసంఘం నాయకులకు పోలీసులు మందస్తు నోటీసులు అందజేశారు