May 29,2023 21:40

చీపురుపల్లి : ర్యాలీలో పాల్గొన్న వైసిపిజిల్లా అధ్యక్షులు శ్రీనివాసరావు తదితరులు

ప్రజాశక్తి-చీపురుపల్లి :  వైసిపి ప్రభుత్వం పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలపై టిడిపి అధినేత చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా చీపురుపల్లిలో ఆ పార్టీ ఆధ్వర్యాన భారీ మోటారు సైకిల్‌ ర్యాలీ నిర్వహించారు. గరివిడి పెట్రోల్‌ బంక్‌ జంక్షన్‌ నుంచి చీపురుపల్లి గాంధీ సెంటర్‌ వరకు జరిగిన బైక్‌ ర్యాలీలో జెడ్‌పి చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు, జెడ్‌టిపిటిసిలు, ఎంపిపిలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం చీపురుపల్లి గాంధీ సెంటర్‌ వద్ద కార్యకర్తలను ఉద్దేశించి జెడ్‌పి చైర్మన్‌ మాట్లాడారు. టిడిపి ప్రభుత్వ హయాంలో పేదలకు ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయని చంద్రబాబునాయుడుకు వైసిపి ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు లేదన్నారు. రాష్ట్రంలో సుమారు 33 లక్షల మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే వాటిని జీర్ణించుకోలేక ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు సెంటు స్థలంలో శవాలు పూడ్చుకోవడానికి తప్ప ఏమి ఇల్లు సరిపోతుంది అనడాన్ని ఖండిస్తున్నామన్నారు. మహానాడులో చంద్రబాబు నాయుడు ప్రకటించిన మేనిఫెస్టో చూస్తుంటే ప్రజలంతా నవ్వుకుంటున్నారని అన్నారు. రాబోయే ఎన్నికలు పేదవాడికి పెత్తందారులకి మధ్య జరిగే యుద్ధమని అన్నారు. ఎన్నికల సమయాల్లో చంద్రబాబు నాయుడు ఆల్‌ ఫ్రీ బాబుగా మారిపోతాడని, ఎన్నికలు అయ్యాక ప్రజలను మోసం చేస్తాడని, ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని అన్నారు. కార్యక్రమంలో గుర్ల, చీపురుపల్లి, గరివిడి, మెరకముడిదాం మండలాల జెడ్‌పిటిసిలు, ఎంపిపిలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నగరంలో భారీ ర్యాలీ
విజయనగరం టౌన్‌ : పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను శ్మశాన వాటికతో పోల్చిన చంద్రబాబు తీరును ఖండిస్తూ వైసిపి ఆధ్వర్యాన సోమవారం నగరంలో భారీ ద్విచక్ర వాహన రాలీ చేపట్టారు. డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి నివాసం నుంచి మూడులాంతర్లు, గంటస్తంభం, కన్యకాపరమేశ్వరి ఆలయం మీదుగా వైఎస్‌ఆర్‌ సర్కిల్‌ వరకూ ఈ ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా ఆ పార్టీ నగర అధ్యక్షులు ఆశపు వేణు, మండల పార్టీ అధ్యక్షులు నడిపేన శ్రీనివాసరావు, జోనల్‌ ఇన్చార్జి అల్లు చాణక్య మాట్లాడుతూ చంద్రబాబుకు మతిభ్రమించిందని, అధికారం కోసం పగటి కలలు కంటూ కల్లబొల్లి మాటలు చెబుతున్నారని విమర్శించారు. ఆయన కలలు కలలుగానే మిగిలిపోతాయని అన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు సుమారు 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వడంతో పాటు, తెలుగుదేశం పార్టీ హయంలో అసంపూర్తిగా వదిలేసిన టిడ్కో ఇళ్లను సైతం పూర్తి చేశారని గుర్తు చేశారు ఎన్నికల సమీపిస్తున్న వేళ మోసపూరిత హామీలతో అన్ని ఆల్‌ ఫ్రీ అంటూ మేనిఫెస్టోను విడుదల చేశారని విమర్శించారు. వచ్చే ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ నామరూపాలు లేకుండా పోతుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జోనల్‌ ఇన్చార్జులు, కార్పొరేటర్లు, యువజన విభాగం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

చంద్రబాబు వ్యాఖ్యలపైవైసిపి నిరసన ర్యాలీలు
చంద్రబాబు వ్యాఖ్యలపైవైసిపి నిరసన ర్యాలీలు


టిడిపి ఎన్ని కుతంత్రాలు చేసినా గెలిచేది వైసిపినే..
భోగాపురం :
టిడిపి ఎన్ని కుతంత్రాలు చేసినా రానున్న ఎన్నికల్లో వైసిపినే విజయం సాధిస్తుందని ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు అన్నారు. వైసిపి నాలుగేళ్ల పాలనకు మద్దతుగా ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, మండల కన్వీనర్‌ ఉప్పాడ సూర్యనారాయణ ఆధ్వర్యంలో మండలంలో సోమవారం భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. మహారాజుపేట జంక్షన్‌ నుండి పోలిపల్లి, సవరవల్లి, ఎ.రావివలస, భోగాపురం వరకు జాతీయ రహదారి సర్వీస్‌ రోడ్‌ వెంబడి ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్ని అడ్డంకులు వచ్చినా సంక్షేమ పథకాలు ఆపకుండా ముందుకు సాగిస్తున్న ఘనత జగన్మోహన్‌ రెడ్డికే దక్కుతుందని, టిడిపి ఎన్ని కుయుక్తులు చేసినా ప్రజలు నమ్మరన్నారు. కార్యక్రమంలో హౌసింగ్‌, మత్స్యకార కార్పొరేషన్‌ డైరెక్టర్లు శివారెడ్డి, మైలపల్లి నరసింహులు, కర్రోతు వెంకటరమణ, శ్రీనివాసరావు, విజయభాస్కర్‌ రెడ్డి, పట్న తాతయ్యలు, వైస్‌ ఎంపిపి రావాడ బాబు, సూరాడ చిన్న, ఎంపిటిసిలు, సర్పంచులు పాల్గొన్నారు.