
మంగళగిరి: ఎమ్మెల్సీగా ఎన్నికైన పంచుమర్తి అనురాధ, టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడుని ఉండవల్లి లోని ఆయన నివాసంలో శుక్రవారం కలిశారు. చేనేత, పద్మశాలి సంఘాల నేతలతో కలిసి వెళ్లిన ఆమె, చందబ్రాబు కు కృతజ్ఞతలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ చేనేతల పక్షపాతి అని, అఖండ చేనేత జనావళికి అద్భుత కానుకగా అనురాధ విజయాన్ని అందించారని అఖిల భారత పద్మశాలి సంఘం జాతీయ కార్యదర్శి గుత్తికొండ ధనంజయరావు అన్నారు. రాబోయే ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి టిడిపి అభ్యర్థిగా నారా లోకేష్ ని అఖండ విజయంతో గెలిపించి ఆయనకు కానుకగా ఇస్తామని అన్నారు. అంతకుముందు మంగళగిరి నుంచి ర్యాలీగా చంద్రబాబు నివాసానికి చేనేతలు వందలాదిగా చేరుకున్నారు. కార్యక్రమంలో పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ కేంద్ర కమిటీ అధ్యక్షులు స్వర్గం పుల్లారావు, మంగళగిరి నియోజకవర్గ టిడిపి సమ న్వయకర్త నందం అబద్దయ్య, రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి తమ్మిశెట్టి జానకి దేవి, పద్మశాలి సంఘం నేత పంచమర్తి ప్రసాదరావు తదితరులు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.