Aug 08,2022 07:34

ఒట్టావా : కెనడాలో భారీ ఎత్తున ఉద్యోగాలు అందుబాటులో ఉన్నట్లు ఆ దేశ లేబర్‌ ఫోర్స్‌ చేసిన సర్వే వివరాలు వెల్లడించింది. ఈ ఏడాది మేతో పోలిస్తే ఆగష్టు నెలకు మరో 3 లక్షల ఖాళీలు పెరిగి మొత్తం 10లక్షలను దాటేశాయి. చాలా పరిశ్రమల్లో కార్మికుల కొరత తీవ్రంగా ఉన్నట్లు సర్వే పేర్కొంది. దీనికి తోడు దేశంలో ఇప్పటికే ఉద్యోగాల్లో ఉన్న వారిలో చాలా మంది రిటైర్మెంట్‌ వయస్సుకు దగ్గరపడటంతో విదేశీ కార్మికులకు డిమాండ్‌ పెరుగుతోంది. దీంతో ఈ ఏడాది కెనడా అత్యధికంగా 4.3 లక్షల మందికి పౌరసత్వం ఇచ్చే అవకాశం ఉంది. ఇది 2024 నాటికి 4.5 లక్షలకు చేరవచ్చని అంచనా. ఈ పరిస్థితుల్లో ఉద్యోగావకాశాలు కూడా ఎక్కువగా ఉండటం వలసదారులను ఆకర్షిస్తోంది. వృత్తి నిపుణులు, సైంటిఫిక్‌-టెక్నికల్‌ సేవలు అందించేవారు, రవాణా, గోదాములు, ఫైనాన్స్‌, ఇన్యూరెన్స్‌, వినోద రంగం, రియల్‌ ఎస్టేట్‌ రంగంలో అత్యధిక ఖాళీలు ఉన్నాయి. వీటితోపాటు నిర్మాణ రంగంలో 89,900, విద్యారంగంలో 9,700 ఖాళీలు ఏర్పడ్డాయి. ఇక ఆహార సేవల రంగంలో ఖాళీలు ఫిబ్రవరి నుంచి 10శాతం పెరిగాయి. అలాగే కెనడాలో రానున్న పదేళ్లలో దాదాపు 90 లక్షల మంది రిటైర్మెంట్‌కు దగ్గర కానున్నారు. వాస్తవానికి కెనడాలో పదవీ విరమణ వయస్సు కన్నా ముందుగానే రిటైర్మెంట్లు తీసుకొంటారు. ప్రతి 10 రిటైర్మెంట్లలో మూడు ముందుగా తీసుకునేవే ఉంటాయి.