Oct 03,2022 19:14

స్వాధీనం చేసుకున్న బంగారంతోపాటు నిందితులను చూపుతున్న పోలీసులు

ప్రజాశక్తి - ఆదోని
దొంగతనం కేసులో నిందితులను అరెస్టు చేసి, బంగారం స్వాధీనం చేసుకున్నట్లు ఆదోని వన్‌ టౌన్‌ సిఐ విక్రమ్‌ సింహా తెలిపారు. అనుమానాస్పదంగా కొత్త వ్యక్తులు తిరిగితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. గతేడాది జులై, డిసెంబర్‌ నెలల్లో ఆదోని తిమ్మారెడ్డి బస్టాండ్‌, షరాఫ్‌ బజార్‌లో జరిగిన చోరీ నిందితులను వన్‌టౌన్‌ పోలీసు స్టేషన్‌లో సోమవారం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. డోన్‌ పట్టణంలోని అనంతపురం హైవేలో ఇద్దరు మహిళలు అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు సమాచారం అందిందని తెలిపారు. ఈ మేరకు సిబ్బందితో దాడులు నిర్వహించి పల్నాడు జిల్లా చీరాలకు చెందిన నాగమణి, పద్మను అరెస్టు చేసినట్లు చెప్పారు. 9 తులాల బంగారు ఆభరణాలను రికవరీ చేసినట్లు తెలిపారు. ఈ ఆభరణాలను పత్తికొండ, ఆదోని పట్టణంలోని శివ శంకర్‌ నగర్‌కు చెందిన బాధితులకు అప్పగించామని చెప్పారు. ఇల్లు వదిలి వేరే ప్రాంతాలకు వెళ్లినప్పుడు పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. కొత్త వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తే అప్రమత్తమై పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. పుకార్లను నమ్మవద్దని, ఎలాంటి అనుమానాలు ఉన్నా తమను సంప్రదించాలని కోరారు. పోలీసులు హాజీ బాష, మద్దిలేటి, లక్ష్మణ్‌ ఉన్నారు.