
ఈ నేపథ్యంలో అమరావతిలోని రైతులు, ప్రజలు...బిజెపి నేతలను ప్రశ్నిస్తున్నా, కొందరు నేతలు బిజెపి యాత్రకు మద్దతు ఇస్తున్నారు, పాల్గొంటున్నారు. అమరావతికి ఎవరు మద్దతు ఇచ్చినా తీసుకుంటామంటున్నారు. అమరావతికి ద్రోహం చేసింది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. ద్రోహం చేసిన బిజెపి మద్దతుతో అమరావతి ఉద్యమం ఎలా ముందుకు సాగుతుంది? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండింటిపైన పోరాడాల్సిందే. కొందరు నేతలు గుర్తించినా, గుర్తించకపోయినా అమరావతి రైతులు, రాష్ట్ర ప్రజలు మాత్రం ఈ విషయం గుర్తించారు. అందుకే అమరావతి యాత్రలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ తోడు దొంగలేనని ఒక రైతు సూటిగా సోము వీర్రాజునే ప్రశ్నించారు. ఇదే రాష్ట్ర ప్రజలందరి అభిప్రాయం.
రాజధాని అమరావతిలో బిజెపి యాత్ర చేస్తోంది. సరికొత్త నాటకానికి తెరతీసింది. రాష్ట్రంలో అధికారం అప్పగిస్తే రెండు సంవత్సరాలలో అమరావతికి నిధులు కేటాయించి, అభివృద్ధి చేస్తామని సోము వీర్రాజు నమ్మబలుకుతున్నారు. అమరావతి ప్రజలు, రైతులు బిజెపి నేతలను నిలదీస్తున్నారు. ఏడు సంవత్సరాల తర్వాత అమరావతి గుర్తొచ్చిందా? అని కడిగేస్తున్నారు, బిజెపి నేతలకు సమాధానాలు కరువయ్యాయి. అమరావతి ప్రజలే కాదు, రాష్ట్ర ప్రజలందరూ బిజెపిని సూటిగా ప్రశ్నిస్తున్నారు.
ఢిల్లీని తలదన్నే రాజధాని నిర్మిస్తామని 2014 ఎన్నికలకు ముందు మోడీ హామీ ఇచ్చారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్ట ప్రకారం రాజధాని నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే. నాలుగు సంవత్సరాల పాటు టీడీపీతో కలిసి రాష్ట్ర ప్రభుత్వంలో బిజెపి భాగస్వామిగా ఉంది. రాజధాని అభివృద్ధికి 42 వేల కోట్ల రూపాయల అవసరమని కేంద్రానికి ఆ మంత్రివర్గమే నివేదిక పంపింది. కానీ ఏడేళ్ల కాలంలో కేంద్రం ఇప్పటివరకు ఇచ్చింది రూ. 1500 కోట్లు మాత్రమే. గత ఐదేళ్లుగా కేంద్ర బడ్జెట్లో మన రాష్ట్ర రాజధాని నిధుల ఊసే లేదు. తొలి నుండి కేంద్రం, బిజెపి...రాష్ట్ర రాజధాని అమరావతి పట్ల నిర్లక్ష్యపూరితంగానే వ్యవహరిస్తున్నాయి. రాజధాని శంకుస్థాపనకు ప్రధాని వస్తున్నప్పుడు భారీగా నిధులు ప్రకటిస్తారని అందరూ అనుకున్నారు. ఢిల్లీ నుండి చెంబుడు నీళ్లు, గుప్పెడు మట్టి తెచ్చి రాజధాని, రాష్ట్ర ప్రజల నోట్లో బిజెపి మట్టి కొట్టారు. అప్పటి నుండి ఇప్పటి వరకు రాష్ట్రానికి, రాజధానికి బిజెపి మొండి చేయి చూపుతూనే ఉంది. రాజధాని అమరావతి లోనే కొనసాగాలని, ఆరు నెలల్లో ప్రభుత్వాలు అభివృద్ధి చేయాలని హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు తర్వాత ఇప్పుడు అమరావతికి మద్దతుగా బిజెపి యాత్ర చేయడం మోసపూరితమే తప్ప, చిత్తశుద్ధి లేదు.
ఈ పాపం ఇద్దరిదీ
గత ప్రభుత్వంలో అసెంబ్లీలో టిడిపి, వైసిపి, బిజెపి కలిపి రాజధానిగా అమరావతిని ఏకగ్రీవంగా నిర్ణయించాయి. తెలుగుదేశం ప్రభుత్వం కంటే అమరావతిని మరింత మెరుగ్గా అభివృద్ధి చేస్తామని ఎన్నికల ముందు వైసీపీ హామీ ఇచ్చింది. ముఖ్యమంత్రి జగన్, నేనిక్కడే ఇల్లు కూడా కట్టుకుంటున్నాను అంటూ ప్రజలకు రాజధాని విషయంలో భరోసా ఇచ్చారు. కానీ మాట తప్పి మూడు రాజధానుల చట్టం తెచ్చారు. రాజధానిని, వెనకబడిన ప్రాంతాల అభివృద్ధినీ నిర్లక్ష్యం చేశారు. రాజధాని అమరావతిపై హైకోర్టు వివిధ పార్టీల అభిప్రాయాలను కోరింది. రాజధానికి మాకు సంబంధం లేదు, రాజధాని నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వ ఇష్టం అంటూ బిజెపి, కేంద్ర ప్రభుత్వం రాతపూర్వకమైన అఫిడవిట్ కోర్టుకు ఇచ్చాయి. బిజెపితో పొత్తుకు ముందు రాజధానిలో కవాతు చేస్తామని జనసేన ప్రకటించింది. పొత్తు తర్వాత కవాతు నిలిపివేసింది. బిజెపి ఒత్తిడితోనే కవాతు ఆగిందని ప్రజలందరి అనుమానం. ఇలా బిజెపి పూటకో మాట, రోజుకో డ్రామా ఆడుతున్నది. అందుకే కేంద్రం వత్తాసుతోనే రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల చట్టం తెచ్చి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేస్తున్నారని ప్రజలందరూ భావిస్తున్నారు.
నలభైరెండు కేంద్ర ప్రభుత్వ సంస్థలకు రాజధాని అమరావతిలో స్థలాలు కేటాయించారు. కానీ 40 సంస్థల నిర్మాణాలు ఇప్పటివరకు ప్రారంభమే కాలేదు. నిధులు కేటాయించలేదు. కేంద్ర ప్రభుత్వ సంస్థల నిర్మాణాలు చేయటానికి ఎవరూ అడ్డం కాదు. బిజెపి సాకులు చెప్పి తప్పించుకుంటున్నది. అమరావతి నిర్మాణానికి నిధులు లేవని, అందువలన ఆరు నెలల సమయం చాలదని ఆరేళ్ల సమయం కావాలని కోర్టుకి వైసిపి ప్రభుత్వం సాకులు చెబుతున్నది. కనీసం ఈ సమయంలోనైనా నిధుల బాధ్యత మాది, నిధులు ఇస్తామని కేంద్రం, బిజెపి ప్రకటించలేదు. అమరావతి రైలు ప్రాజెక్టుకి రూ. 1800 కోట్ల అవసరం కాగా కేంద్ర బడ్జెట్లో కేవలం లక్ష రూపాయలు మాత్రమే కేటాయించడం సిగ్గుచేటు. రాయలసీమ నుండి అమరావతికి హైవే, అమరావతి ఔటర్ రింగ్‌రోడ్, ఇన్నర్ రింగ్ రోడ్ లాంటి ప్రాజెక్టులు ఎన్నో రూపుదిద్దుకున్నా, వాటికి కేంద్రం నయా పైసా నిధులు కేటాయించలేదు. ఇదే బిజెపి తన రాజకీయ అవసరాల కోసం గుజరాత్ రాష్ట్రంలో దోలేరా సిటీ, గిఫ్ట్ సిటీ ఇలా రకరకాల ప్రాజెక్టులకు వేల కోట్ల రూపాయల నిధులు కేటాయించింది. ఆంధ్రప్రదేశ్ రాజధానికి మాత్రం శూన్య హస్తాలు చూపిస్తున్నది. రాజధాని వివాదాన్ని వైసిపి కొనసాగిస్తున్నది. వివాదం ఇలా కొనసాగుతూ ఉంటే నిధులు ఇవ్వాల్సిన అవసరం లేదని బిజెపి భావిస్తున్నది.
సమ న్యాయమా! మోసమా!
బిజెపి సమ న్యాయం అంటూ సమ మోసం చేస్తోంది. రాజధాని అమరావతికి నిధులు ఇవ్వదు. ఉత్తరాంధ్ర లోని విశాఖ ఉక్కును ప్రైవేట్‌పరం చేస్తూ ఆ ప్రాంత అభివృద్ధిని నాశనం చేస్తున్నది. కడప ఉక్కు ఊసే లేదు. వెనకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమకు బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజీ నోటి మాటలకే పరిమితం అయింది. కేంద్ర విద్యా, వైద్య సంస్థలకు నామమాత్రపు నిధులే. విభజన హామీలు అమలు దిక్కేలేదు. బడ్జెట్ లోటు భర్తీ అరకొరే. పోలవరం నిర్వాసితులకు ప్యాకేజీ నిధులు ఇవ్వకుండా ముంచేశారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమంటూ నిస్సిగ్గుగా ప్రకటించారు. ఇలా అన్ని విధాల రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను బిజెపి కేంద్రం వంచించింది. అయినా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, వైసీపీ ప్రభుత్వం పల్లెత్తు మాట మాట్లాడడంలేదు. ప్రతిపక్షమైన తెలుగుదేశం మౌనం వహిస్తున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాయి. బిజెపి, వైసిపిలు దోబూచులాడుతున్నాయి. కేంద్రాన్ని వైసిపి అడగదు. వైసిపి వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాలను బిజెపి కాపాడుతుంది. అందుకే పార్లమెంటులో బిజెపి తెచ్చే ప్రమాదకర చట్టాలను వైసిపి బలపరుస్తున్నది. రాష్ట్రంలో వైసిపి చేసే దుర్మార్గాలను బిజెపి పరోక్షంగా, ప్రత్యక్షంగా మద్దతునిస్తున్నది. అందులో రాజధాని అమరావతి, రాష్ట్రం బలైపోతున్నాయి. అమరావతి విషయంలో బిజెపి సరికొత్త డ్రామా ఆడుతూ, రైతులను మరోసారి మోసగించటానికి ప్రయత్నిస్తున్నది.
రాష్ట్రంలో బిజెపిని అధికారంలోకి తెస్తే రెండు సంవత్సరాల్లో అభివృద్ధి చేస్తామని చెబుతూ మరో వంచనకు పాల్పడుతున్నది. ఎనిమిదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్నది, బిజెపినే అనే విషయం ప్రజలు మర్చిపోలేదు. నాలుగు సంవత్సరాల పాటు టీడీపీతో కలిసి రాష్ట్రంలో కూడా బిజెపి అధికారాన్ని పంచుకున్నది. అయినా అమరావతిని ఎందుకు అభివృద్ధి చేయలేదు? ఎవరు అడ్డం వచ్చారు? దీనికి సమాధానం లేదు .రాష్ట్రంలోనే కాదు. దేశంలోను రైతులకు బిజెపి ద్రోహం చేసింది. ఢిల్లీలో జరిగిన రైతు ఉద్యమాన్ని, అందులో పాల్గొన్న వారిని బిజెపి దేశద్రోహులుగా ముద్ర వేసింది. 700 మంది రైతులు మరణించినా కనికరం లేకుండా, కర్కశంగా వ్యవహరించింది. పోరాట ఒత్తిడితో గత్యంతరం లేక ప్రమాదకర రైతు చట్టాలను రద్దు చేసినా, గిట్టుబాటు ధరలు ఇతర హామీలను అమలు చేయడం లేదు. అమరావతి లోనూ, దేశమంతటా రైతులకు ద్రోహం చేయడంలో బిజెపి దుష్ట పాత్ర ప్రజలందరికీ స్పష్టమే. రాజధానికి, రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపిని కేంద్రాన్ని నిలదీయకుండా ప్రేక్షక పాత్ర వహిస్తూ ఏదో ఒక రూపంలో బిజెపికి ప్రయోజనం కలిగించడంలో వైసిపి, టిడిపి, జనసేన అందరిదీ ఒకటే దారి.
తోడు దొంగలే
ఈ నేపథ్యంలో అమరావతిలోని రైతులు, ప్రజలు...బిజెపి నేతలను ప్రశ్నిస్తున్నా, కొందరు నేతలు బిజెపి యాత్రకు మద్దతు ఇస్తున్నారు, పాల్గొంటున్నారు. అమరావతికి ఎవరు మద్దతు ఇచ్చినా తీసుకుంటా మంటున్నారు. అమరావతికి ద్రోహం చేసింది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. ద్రోహం చేసిన బిజెపి మద్దతుతో అమరావతి ఉద్యమం ఎలా ముందుకు సాగుతుంది? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండింటిపైన పోరాడాల్సిందే. కొందరు నేతలు గుర్తించినా, గుర్తించకపోయినా అమరావతి రైతులు, రాష్ట్ర ప్రజలు మాత్రం ఈ విషయం గుర్తించారు. అందుకే అమరావతి యాత్రలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ, తోడు దొంగలేనని ఒక రైతు సూటిగా సోము వీర్రాజునే ప్రశ్నించారు. ఇదే రాష్ట్ర ప్రజలందరి అభిప్రాయం. ప్రధాన పార్టీలైన వైసిపి, టిడిపిలకు కేంద్రాన్ని ఎదిరించే ధైర్యం లేదు. కానీ రాష్ట్ర ప్రజలు బిజెపిని ఎదిరించడంలో ముందున్నారు. ఈ పార్టీలే వెనుకబడుతున్నాయి. బిజెపి అండతో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎదుర్కోవచ్చని, అమరావతిని నిలుపుకోవచ్చని కొందరు నేతలు భ్రమపడుతున్నారు. ఇప్పటికి అనేకసార్లు బిజెపిని నమ్ముకుంటే ముంచేశారు. మరోసారి నమ్ముకుంటే నిండా మునిగిపోతారు. అందుకే అప్రమత్తంగా ఉండాలి. బిజెపి కుట్రలను ఛేదించాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటాలు ఉధృతం చేయాలి. ఢిల్లీ రైతు ఉద్యమ స్ఫూర్తితో అమరావతి ఉద్యమం విశాల ఉద్యమంగా సాగాలి. మరింత ఉధృతం కావాలి. హైకోర్టు తీర్పు ఇచ్చినందున ఉద్యమాలు అవసరం లేదని కొందరు వాదిస్తున్నారు. చట్టాలైనా, హామీలైనా, తీర్పులైనా అమలు జరగాలంటే ప్రభుత్వాలపై ఒత్తిడి, పోరాటం కొనసాగక తప్పదనేది మన జీవిత అనుభవం.
సిపిఎం రాజధాని విషయంలో గతంలోనూ, నేడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని తప్పు పడుతూనే ఉంది. రైతుల ఉద్యమానికి మద్దతు తెలుపుతూనే స్వతంత్రంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ...బీజేపి, కేంద్రం ప్రమాదాన్ని గురించి హెచ్చరిస్తూనే ఉంది. రాజధానిగా అమరావతి కొనసాగాలి, అదే సందర్భంలో అమరావతి ప్రజలకు పూలింగ్ చట్ట ప్రకారం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఉద్యమిస్తోంది. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం అన్ని ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేయాలని కోరుతున్నది. పూలింగ్ చట్టప్రకారం భూములు తీసుకుని ఏడు సంవత్సరాలు దాటిపోయినా, ఇప్పటికి రైతుల ప్లాట్లు అభివృద్ధి చేయలేదు. అమరావతిలో నిర్మాణ పనులు స్తంభించిపోయాయి. ప్రజల సొమ్ము వధా అయిపోయింది. ఉపాధి కోల్పోయిన పేదలకు ఇచ్చే రూ. 2500 పెన్షన్ నెలనెలా సక్రమంగా రావడం లేదు. ఏడేళ్లుగా నయా పైసా పెంచలేదు. దళితులు, బలహీన వర్గాల అసైన్డ్ భూములకు సమాన ప్యాకేజీ ఇవ్వకుండా టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు రెండూ మోసం చేశాయి. ఉచిత విద్య, వైద్యం, ఉపాధి గ్యారంటీ హామీలు కాగితాలకే పరిమితమయ్యాయి. రాజధాని ప్రజలస్థితి రెంటికి చెడ్డ రేవడి లాగా మారింది. అటు రాజధాని లేదు. ఇటు వ్యవసాయం లేకుండా పోయింది. హామీల అమలు కోసం రాష్ట్రంలో అమరావతి రాజధాని, వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి, విభజన హామీల అమలు, హోదా తదితర అంశాలపై రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి పోరు సాగాలి.
సిహెచ్. బాబూరావు / వ్యాసకర్త : సిపిఐ(ఎం )రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు /