Feb 22,2021 18:35

బీజింగ్‌ : విభేధాల పరిష్కారానికి వివిధ రంగాల్లో, వివిధ స్థాయిల్లో చర్చల యంత్రాంగాలను నెలకొల్పాల్సిందిగా అమెరికాను చైనాకోరింది. చర్చలు జరపడం ద్వారా తమ మధ్య వున్న విభేదాలను సక్రమంగా పరిష్కరించుకోవచ్చని స్టేట్‌ కౌన్సెలర్‌, విదేశాంగ మంత్రి వాంగ్‌ యి సోమవారం పేర్కొన్నారు. చైనా-అమెరికా సంబంధాలను సరైన మార్గంలోకి ఎలా తీసుకురావాలనే అంశంపై వాంగ్‌ యి మాట్లాడారు. గత కొద్ది సంవత్సరాలుగా అమెరికా మౌలికంగా అన్ని స్థాయిల్లోనూ ద్వైపాక్షిక చర్చలను రద్దు చేసింది. రెండు దేశాల మధ్య సంబంధాలు క్షీణించడానికి ఇది ప్రధాన కారణమని వాంగ్‌ యి పేర్కొన్నారు. చైనా-అమెరికా ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణకు ఏర్పాటు చేసిన వేదికను ప్రారంభిస్తూ ఆయన మాట్లాడారు. జో బైడెన్‌ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత ఇరు దేశాల సంబంధాల అభివృద్ధికి సంబంధించి వాంగ్‌ సవివరమైన సూచనలు చేశారు. వీటిని చూస్తుంటే అమెరికాతో సంబంధాలను కొనసాగించేందుకు చైనా నిజాయితీగా, చిత్తశుద్ధితో వ్యవహరిస్తోందని అర్ధమవుతోందని రాజకీయవిశ్లేషకులు పేర్కొంటున్నారు. ఆర్థిక, సామాజిక, సాంకేతికాభివృద్ధి రంగాల్లో ప్రస్తుతమున్న ప్రతిష్టంభనను నివారిచేందుకు ఇరు దేశాలు ఒక మార్గాన్ని కనుగొనాల్సి వుందని పరిశీలకులు పేర్కొంటున్నారు. ఆర్థిక పునరుద్ధరణ, ప్రజల మధ్య పరస్పర మార్పిడులు జరగాలన్నా సహకారం అన్నింటికంటే ముఖ్యమని అన్నారు. అన్నింటికన్నా ముందు చేయవలసిన పని ఇరు దేశాలు పరస్పరం గౌరవించుకోవడమని, ఒకరి అంతరంగిక వ్యవహారాల్లో మరొకరు జోక్యం చేసుకోకపోవడమని అన్నారు. చైనా రాజకీయ వ్యవస్థను, కమ్యూనిస్టు పార్టీని నిందించడం అమెరికా తక్షణం మానుకోవాలని వాంగ్‌ సూచించారు. సుపరిపాలన అందించడానికి పారదర్శకమైన పద్ధతిలో అమెరికాతో కలిసి పనిచేయడానికి చైనా సిద్ధంగా వుందని అన్నారు.