Sep 14,2021 22:15

అమృత్‌సర్‌ : ఆధునీకరణ పేరుతో 1919 నాటి జలియన్‌ వాలాబాగ్‌ చారిత్రక గుర్తుల చెరిపివేత ప్రయత్నాలను ఖండిస్తూ పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో మంగళవారం పెద్దయెత్తున ఆందోళన జరిగింది. కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా నగరంలో పలు రాజకీయ, రైతు, సామాజిక సంస్థలకు చెందిన నేతలు భారీ ర్యాలీ చేపట్టాయి. ఈ మార్చ్‌లో జలియన్‌ వాలాబాగ్‌ అమరవీరుల బంధువులు కూడా పాల్గొన్నారు. ఆధునీకరణ పేరుతో చారిత్రక గుర్తులను చెరిపేస్తున్నారని ఆందోళనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జలియన్‌ వాలాబాగ్‌ ప్రాంగణంలోకి ప్రవేశించకుండా పోలీసులు బారికేడ్లతో అడ్డుకున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా అమృత్‌సర్‌ పోలీసులు ఐదు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు గుమిగూడడానిు నిషేధిస్తూ సెక్షన్‌ 144ను విధించారు. నవంబర్‌ 6 వరకు స్మారక పరిసరాల్లో నిరసనలకు అనుమతులు లేవని పోలీసులు పేర్కొన్నారు. ప్రాంగణంలోకి వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే కొన్ని గంటల పాటు ఆందోళన చేశారు.
సిపిఐ జిల్లా కార్యదర్శి అమర్‌జిత్‌ సింగ్‌ మాట్లాడుతూ ఇంత భారీ సంఖ్యలో పోలీసులను మోహరించడాన్ని చూస్తుంటే.. రెజినాల్డ్‌ డయ్యర్‌, ఓ.డయ్యర్‌లను అనుసరించిన అప్రజాస్వామిక దృక్పథం ఇంకా మన వ్యవస్థలో ఉన్నట్లు అనిపిస్తోందని అన్నారు. జలియన్‌ వాలాబాగ్‌ ఫ్రీడమ్‌ ఫైటర్స్‌ ఫౌండేషన్‌ అధ్యక్షులు సునీల్‌కుమార్‌ మాట్లాడుతూ బాగ్‌ ఒక స్మారకం కంటే ఇప్పుడు పిక్‌నిక్‌, సెల్ఫీ ప్రాంతంగా కనిపిస్తోందన్నారు. అమరవీరుల జ్ఞాపకాలను తిరిగి ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రాంగణ పరిధిలోని ఇరుకైన గోడలపై వేసిన బొమ్మలను తొలగించాలని ఆందోళనకారులు డిమాండ్‌ చేశారు. దీనిగుండానే డయ్యర్‌ తన దళాలతో వచ్చి బాగ్‌ ప్రాంతంలో సమావేశమైన వారిపై కాల్పులు జరిపారు. చరిత్రకు విరుద్ధంగా ప్రత్యేక ఎగ్జిట్‌ పాయింట్‌, అమరజ్యోతిని వేరే చోటుకు మార్చడం, బావిపై కొత్త నిర్మాణం చేపట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.