న్యూస్‌క్లిక్‌పై మరోసారి పంజా

Dec 21,2023 07:52 #AIKS, #NewsClick
news click bank account freeze

బ్యాంక్‌ ఖాతాలు ఫ్రీజ్‌

జీతాలు అందక ఉద్యోగుల అగచాట్లు

న్యూఢిల్లీ : న్యూస్‌క్లిక్‌ పోర్టల్‌పై అధికారులు మరోసారి పంజా విసిరారు. ఇప్పటికే వివిధ కేసులు, అరెస్టులతో వేధిస్తున్న అధికారులు తాజాగా ఆ వెబ్‌సైట్‌ బ్యాంక్‌ ఖాతాలను ఫ్రీజ్‌ చేశారు. దీంతో సకాలంలో జీతాలు అందక ఉద్యోగులు నానా అగచాట్లు పడుతున్నారు. ఆదాయపన్ను శాఖ తన బ్యాంక్‌ ఖాతాలను స్తంభింపజేసిందని, దీంతో ఉద్యోగులకు జీతాలు చెల్లించడం కష్టమవుతోందని న్యూస్‌క్లిక్‌ పోర్టల్‌ తెలిపింది. ఇప్పటికే చేపట్టిన పాలనాపరమైన, చట్ట పరమైన చర్యలకు కొనసాగింపుగా ఆదాయపన్ను శాఖ ఈ చర్యకు పాల్పడినట్లు కన్పిస్తోందని న్యూస్‌క్లిక్‌ వెబ్‌సైట్‌ ఓ ప్రకటనలో వ్యాఖ్యానించింది. తనపై 2021 ఫిబ్రవరిలో ఈడీ చేసిన దాడులు, సెప్టెంబర్‌లో ఐటీ చేసిన సర్వే, ఈ సంవత్సరం అక్టోబర్‌ 3న ఢిల్లీ పోలీస్‌ ప్రత్యేక విభాగం జరిపిన దాడులను ప్రస్తావించింది. అక్టోబర్‌ 3న ఢిల్లీ పోలీసులు న్యూస్‌క్లిక్‌తో సంబంధం ఉన్న పలువురు పాత్రికేయుల నివాసాలపై దాడులు చేశారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద వెబ్‌సైట్‌ వ్యవస్థాపకుడు ప్రబీర్‌ పుర్కాయస్థ, మానవ వనరుల విభాగం అధిపతి అమిత్‌ చక్రవర్తిని అరెస్ట్‌ చేశారు. చైనాకు అనుకూలంగా ప్రచారం చేసేందుకు న్యూస్‌క్లిక్‌కు సొమ్ము అందిందని పోలీసులు ఆరోపణలు మోపారు. 2021లో ఢిల్లీ పోలీసులకు చెందిన ఆర్థిక నేరాల విభాగం న్యూస్‌క్లిక్‌పై కేసు నమోదు చేసింది. న్యూస్‌క్లిక్‌ పోర్టల్‌ చట్ట విరుద్ధంగా అమెరికాకు చెందిన ఓ కంపెనీ నుండి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పొందిందని ఆరోపించింది. డిజిటల్‌ న్యూస్‌ వెబ్‌సైట్లలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 26%కి మించరాదని ఆ చట్టం నిర్దేశిస్తోంది. ఇక ఈ కేసుకు సంబంధించి 2021 ఫిబ్రవరిలో ఈడీ అధికారులు న్యూస్‌క్లిక్‌ కార్యాలయాలు, సంపాదకుడి నివాసంపై దాడి చేశారు. అధికారులు మోపిన ఆరోపణ లన్నింటినీ న్యూస్‌క్లిక్‌ ఆ ప్రకటనలో తోసిపుచ్చింది. తాను ఎప్పుడూ పన్ను నియంత్రణ నిబంధనలు సహా చట్టానికి కట్టుబడి ఉన్నానని స్పష్టం చేసింది. ఈ కేసును తన న్యాయవాది సమీక్షిస్తున్నారని, న్యాయసమ్మతం కాని, క్రూర చర్యలకు వ్యతిరేకంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వివరించిం ది. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తన బ్యాంక్‌ ఖాతాలను స్తంభింపజేశారని ఆరోపించింది. చెల్లింపులు జరిపేందుకు తమ సిబ్బంది ప్రయత్నిం చగా అప్పటికే బ్యాంక్‌ ఖాతాలు ఫ్రీజ్‌ అయ్యాయని తెలిసిందని పేర్కొంది. ‘ఈ చర్య కారణంగా పాత్రికేయులు, వీడియోగ్రాఫర్లు, కార్యాలయ సిబ్బంది, కన్సల్టెంట్లు, కంట్రిబ్యూటర్లకు జీతాలు చెల్లించలేకపోయాం. ఈ నెలలో పనిచేసిన 19 రోజులకు కూడా జీతాలు ఇవ్వలేదు’ అని తెలిపింది. బ్యాంక్‌ లావాదేవీలను తిరిగి ఎప్పుడు అనుమతించేదీ ఆదాయపన్ను శాఖ అధికారులు చెప్పడం లేదు. దీంతో సిబ్బంది, వారి కుటుంబసభ్యులలో అనిశ్చితి నెలకొంది. ముఖ్యంగా జీతాల పైనే ఆధారపడిన వారి పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఇదిలావుండగా న్యూస్‌క్లిక్‌పై పెట్టిన కేసులో విచారణను పూర్తి చేసేందుకు మరికొంత సమయం ఇవ్వాలంటూ పోలీసులు ఢిల్లీ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

  • ఖాతాలను తక్షణమే అన్‌ఫ్రీజింగ్‌ చేయాలని ఎఐకెఎస్‌ డిమాండ్‌

న్యూస్‌క్లిక్‌ ఖాతాలను ఆదాయ పన్ను శాఖ అన్యాయంగా స్థంభించజేయడాన్ని ఎఐకెఎస్‌ తీవ్రంగా విమర్శించింది. ఖాతాలను తక్షణమే అన్‌ఫ్రీజింగ్‌ చేయాలని డిమాండ్‌ చేసింది. వివిధ సమస్యలపై ప్రత్యామ్నాయ దృక్పథాన్ని అందించడంపై న్యూస్‌క్లిక్‌ కీలకమైన స్వరంగా ఉంటుందని ఎఐకెఎస్‌ తెలిపింది. గోగూండాలు చేస్తున్న పాడి రైతుల హత్యలు, ఢిల్లీ అల్లర్లలో సంఫ్‌ు పరివార్‌ పాత్ర, చారిత్రాత్మకమైన రైతు పోరాటం వంటి అంశాలను న్యూస్‌ క్లిక్‌ విస్తృతంగా కవర్‌చేస్తోందని పేర్కొంది. ఇలాంటి కవరేజ్‌ల కారణంగానే న్యూస్‌క్లిక్‌, దాని ఎడిటర్‌-ఇన్‌-చీఫ్‌ ప్రబీర్‌ పుర్కాయస్తా, హెచ్‌ఆర్‌ చీఫ్‌ అమిత్‌ చక్రవర్తిలను కేంద్ర వేటాడుతోందని ఎఐకెఎస్‌ విమర్శించింది. ఇప్పటి వరకూ ఎన్ని తీవ్ర దాడులు జరిగిన న్యూస్‌క్లిక్‌ కార్యక్రమాలు స్థిరంగా కొనసాగుతున్నాయని, అయితే ఖాతాలను స్థంభింపజేయడం ప్రాణాంతకంగా మారుతుందని ఎఐకెస్‌ ఆందోళన వ్యక్తం చేసింది. సంవత్సరం చివరిలోనూ, పండుగల సీజన్‌కు ముందు ఇలాంటి చర్య జీతాలపై ఆధారపడిన ఉద్యోగుల బాధను పెంచుతుందని తెలిపింది. తప్పుడు ఆరోపణలతో జర్నలిస్టులపై ఈ నిరంకుశ దాడి ప్రజాస్వామ మూలస్తంభాలపై ప్రత్యక్ష దాడిగా ఎఐకెఎస్‌ అభివర్ణించింది. జర్నలిస్టులపై ఈ ఫాసిస్ట్‌ దాడిని దేశ ప్రజలు తీవ్రంగా ప్రతిఘటిస్తారని ఎఐకెఎస్‌ స్పష్టం చేసింది. మోడీ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న జర్నలిస్టులు, మీడియా సంస్థలకు సంఘీభావం తెలియజేయాలని రైతులు, శ్రామిక ప్రజలకు ఎఐకెస్‌ పిలుపునిచ్చింది.

➡️