Oct 02,2022 12:21

గాంధీనగర్‌  :   గుజరాత్‌ పర్యటనలో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ అధ్యక్షుడు అరవింద్‌ కేజ్రీవాల్‌పై ఓ వ్యక్తి వాటర్‌ బాటిల్‌తో దాడికి యత్నించాడు. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.రాజ్‌కోట్‌లో గర్బా వేదికగా ప్రజలకు అభివాదం తెలుపుతున్న సమయంలో వెనక నుంచి ఆయన వైపుగా ఓ వాటర్‌ బాటిల్‌ దూసుకొచ్చింది. అయితే, అది ఆయనను దాటుకుని వెళ్లి పడింది. ఈ ఘటనపై కేజ్రీవాల్‌ గానీ, ఆప్‌ పార్టీ గాని స్పందించలేదు.

డిసెంబర్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌తో కలిసి కేజ్రీవాల్‌ రెండు రోజుల గుజరాత్‌ పర్యటన చేపట్టారు.  తాము అధికారంలోకి వస్తే గుజరాత్‌లోని ప్రతి గ్రామంలోనూ ప్రభుత్వ పాఠశాలలను నిర్మిస్తామని, కచ్‌ జిల్లాలోని ప్రతి మూలకు నర్మదా నీటిని అందిస్తామని కేజ్రీవాల్‌ హామీ ఇచ్చారు. 33 జిల్లాల్లోనూ ప్రభుత్వ ఆసుపత్రులు నిర్మించి ఉచితంగా నాణ్యమైన చికిత్స అందిస్తామని అన్నారు.