
తిరువనంతపురం : ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్‌పై గూఢచర్యం కేసు అబద్ధమని, అతని అరెస్టు చట్టవిరుద్ధమని కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) శుక్రవారం నాడు కేరళ హైకోర్టుకు తెలియజేసింది. నంబి నారాయణన్‌పై 1994లో గూఢచర్యం కేసు నమోదు కాగా, 1996లో ఆయనను నిర్దోషిగా సిబిఐ ప్రకటించింది. ఈ కేసు దర్యాప్తు అధికారులపై సిబిఐ కేసులు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో నంబి నారాయణ్‌పై గూఢచర్యం కేసు అబద్ధమని కేరళ హైకోర్టుకు సిబిఐ తాజాగా తెలియచేసింది. నకిలీ గూఢచర్య కేసు జాతీయ భద్రతకు చెందిన తీవ్రమైన అంశమని, ఇస్రోలోని ప్రముఖ శాస్త్రవేత్తలపై తప్పుడు కేసులు పెట్టేందుకు విదేశీ శక్తులు కుట్ర పన్నాయని కోర్టుకు దర్యాప్తు సంస్థ తెలియజేసింది. నంబి నారాయణన్ తరఫు న్యాయవాది కూడా భారత అంతరిక్ష పరిశోధనా కార్యక్రమంలో కీలకమైన క్రయోజెనిక్ ఇంజిన్ టెక్నాలజీని నిలిపివేసేందుకు నంబి నారాయణన్‌పై కేసు నమోదు చేశారని కోర్టుకు తెలియజేశారు. 1990లో నంబి నారాయణన్‌పై దర్యాప్తు జరిపిన అధికారులపై సిబిఐ నమోదు చేసిన కేసు, నిందితుల బెయిల అభ్యర్థనలపై కేరళ హైకోర్టు విచారణ సందర్భంగా సిబిఐ తాజా వ్యాఖ్యలు చేసింది.