May 18,2023 09:12
  • రైలు ర్యాకులు అందకుండా కుట్రలు
  • ఉత్పత్తి సాగకుండా ఆటంకాలు
  • 2022 జనవరి నుంచి బ్లాస్ట్‌ ఫర్నేస్‌-3 మూసివేత

ప్రజాశక్తి-గ్రేటర్‌ విశాఖ బ్యూరో : వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ను వంద శాతం అమ్మేయాలని 2021 జనవరి 27న కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు బహిరంగ మార్కెట్‌లో పెట్టిన నుంచీ ప్లాంట్‌ మనుగడను దెబ్బతీసే కుట్రలకు పాల్పడుతూనే వస్తోంది. ఉక్కు చుట్టూ 'అష్ట దిగ్బంధం' ఉచ్చు బిగించి పీక నులిమేస్తోంది. స్టీల్‌ప్లాంట్‌ను ఎలాగైనా నష్టాల్లోకి నెట్టాలన్న ప్రణాళికను మూడేళ్లుగా మోడీ ప్రభుత్వం అమలు చేస్తూనే ఉంది. కరోనా కష్టకాలంలో సైతం రూ.950 కోట్లు మేర లాభాలను వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ ఆర్జించినా అడుగడుగునా ఆటంకాలను సృష్టిస్తూనే ఉంది. 2022 జనవరి నుంచి ప్లాంట్‌లోని బ్లాస్ట్‌ ఫర్నేస్‌-3ని మూసేసింది. దీంతో, రూ.3 వేల కోట్లు లాభాల్లో నడిచే అవకాశం చేజారింది. ఏటా 75 లక్షల టన్నుల ఉత్పత్తి వైజాగ్‌ స్టీల్‌ సామర్థ్యం కాగా, రోజుకు 21 వేల టన్నులు జరగాలి. కానీ, మూడు ఫర్నేస్‌లకు రెండే నడుస్తున్నాయి. రోజుకు తాజాగా ఎనిమిది వేల టన్నులలోపే ఉత్పత్తి జరగడం చూస్తే ప్లాంట్‌ను కేంద్ర ప్రభుత్వం ఎంత గడ్డు పరిస్థితుల్లోకి నెట్టేసిందే స్పష్టమవుతోంది.

  • కీలక అధికారులను నియమించకుండా నిర్లక్ష్యం

ప్లాంట్‌లో పూర్తి స్థాయి డైరెక్టర్‌ ఫైనాన్స్‌, డైరెక్టర్‌ ఆపరేషన్స్‌ ఖాళీలను 2021 నుంచి నియమించకుండా కేంద్రం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోంది. ఈ ఇద్దరు అధికారుల పర్యవేక్షణలోనే ఏటా రూ.50 వేల కోట్ల లావాదేవీలు జరగాల్సి ఉన్నా, ఈ పోస్టులను భర్తీ చేయడం లేదు. కేంద్రం వత్తాసుతో స్టీల్‌ప్లాంట్‌ యాజమాన్యం ఈ పోస్టులను భర్తీ చేయకుండా ఇన్‌ఛార్జి చైర్మన్‌పై పనిభారం మోపుతూ వస్తోంది. కేంద్రం ఇప్పుడు ఈ రెండు పోస్టులను భర్తీ చేయాలనుకున్నా ఆరు నెలల సమయం పడుతుందని స్టీల్‌ప్లాంట్‌ కార్మికులు చెబుతున్నారు. ఈ నిర్వాకాలన్నీ కలిసి తడిసిమోపుడై వైజాగ్‌ స్టీల్‌ నెత్తిన మూడేళ్లుగా నష్టాల గుదిబండగా కూర్చొన్నాయి.

  • కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ ఏం చేస్తోంది...

రైల్వే నుంచి వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌కు రైలు ర్యాకుల సరఫరా దాదాపు స్తంభించిపోయింది. నెలకు కనీసం 50 ర్యాకులు రైల్వే నుంచి స్టీల్‌ప్లాంట్‌కు ఇవ్వాల్సి ఉన్నా 15లోపే అందుతున్నాయి. రైల్వేకు స్టీల్‌ప్లాంట్‌ ఈ ర్యాకుల అద్దె ఎప్పుడూ బకాయిపడలేదు. ఎంత సొమ్మయినా చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామంటూ స్టీల్‌ సిఎండియే పలుమార్లు వెల్లడించారు. కానీ, కేంద్రం మోకాలడ్డుతోంది. రైల్వే ఉన్నతాధికారులు చెబుతున్న ప్రకారం రైల్వే జోన్‌ వైజాగ్‌కు వస్తే ర్యాకులు వందైనా ఇవ్వొచ్చు. నిర్ణయాధికారం ఇక్కడే ఉంటుంది. అయితే, జోన్‌తో సంబంధం లేకుండానే కేంద్ర స్టీల్‌ మంత్రిత్వ శాఖ ఆదేశానుసారం రైల్వేనే పంపిణీ చేయొచ్చు. కానీ, కేంద్ర ప్రభుత్వం ఆ పనిచేయడం లేదు.

  • కనీసం డివిజన్‌ ఉన్నా రైలు ర్యాకులు తెచ్చుకునేవాళ్లం

గతంలో రైల్వే డివిజన్‌ ఉన్నప్పుడు కనీసం 30 వరకూ రైల్‌ ర్యాకులు ప్లాంట్‌కు నెలకు లభించేవి. కేంద్రంలోని మోడీ సర్కారు వాల్తేరు రైల్వే డివిజన్‌ను ఎత్తేసి విశాఖకు స్టీల్‌ప్లాంట్‌కు ద్రోహం చేసింది. జోన్‌ ఇస్తానని డివిజన్‌ ఎత్తేసి మోసపుచ్చింది. స్టీల్‌ప్లాంట్‌లో ఐదు వేల పోస్టులు ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్నా కేంద్ర మంత్రిత్వ శాఖ భర్తీ చేయడం లేదు. ఏటా వేల సంఖ్యలో నిరుద్యోగులు ఉపాధి కోసం ఎదురుచూస్తున్నారు. ఎలాగైనా ప్లాంట్‌ను మూసేసే దిశగా కేంద్రం కుట్రలు చేస్తోంది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొని ప్లాంట్‌ను కాపాడుకోవడానికి కార్మికవర్గం సిద్ధంగా ఉంది.
- జె.అయోధ్యరామ్‌, విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కో-కన్వీనర్‌