Aug 06,2022 16:15

ప్రజాశక్తి-విజయవాడ : చెత్తపన్ను చెల్లించకపోతే కార్మికులకు వేతనాలు నిలిపివేస్తామని విజయవాడ నగరపాలక సంస్థ అధికారుల ఆదేశాలివ్వడం దుర్మార్గమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్ బాబూరావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన వైద్య శాఖ అధికారి ఆగస్టు 5వ తేదీన "అతి జరూరు" పేరుతో చెత్త పన్ను చెల్లించకపోతే ఆగస్టు నుండి వేతనాలు నిలిపివేస్తున్నట్లు సర్క్యులర్ జారీ చేశారని ఆయన తెలిపారు. చెత్త పన్ను వసూలు చేయటమే రాజ్యాంగ విరుద్ధమని, పైపెచ్చు మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బందితో సహా అందరూ చెత్త పన్ను చెల్లించకపోతే జీతాలు ఆపేస్తామని ప్రకటించడం అన్యాయమన్నారు. కంచే చేను మేసినట్లుగా కార్మిక చట్టాలను ప్రభుత్వమే ఉల్లంఘించడం దారుణమన్నారు. కరోనా కష్టకాలంలో సైతం ప్రాణాలకు తెగించి పనిచేసిన పారిశుధ్య సిబ్బందికి చెత్త పన్ను నుండి మినహాయింపు ఇవ్వాల్సింది పోయి, వేతనాలకు చెత్త పన్నుకు ముడి పెట్టడం గర్హనీయమన్నారు. సామాజిక న్యాయం, పేదల ప్రభుత్వము అంటూ డబ్బా కొట్టుకుంటూ పేదలు, బలహీనవర్గాలకు చెందిన కార్మికుల వేతనాలు నిలిపివేస్తామని బెదిరించడం తగదన్నారు. కార్మికులకు వేతనాలు నిలిపివేసి వారిని, వారి కుటుంబ సభ్యులను పస్తులు పెట్టే దుర్మార్గమైన ఆదేశాలు జారీ చేయటం క్షంతవ్యం కాదన్నారు.  వేతనాలు నిలిపివేసే అధికారం ప్రభుత్వానికి, అధికారులకు లేదని పేర్కొన్నారు. చెత్త పన్ను చెల్లించాలని ఎవరికీ నోటీసులు ఇవ్వడం లేదు, కట్టిన వారికి రసీదులు కూడా సరిగా ఇవ్వడం లేదని తెలిపారు. ప్రజల అభ్యంతరాలు కూడా తీసుకోకుండా ఏకపక్షంగా యూజర్ చార్జీలు వసూలు చేసే అధికారం ఎవరికి లేదన్నారు.  పారిశుధ్య కార్మికులకు లక్ష రూపాయలు జీతం ఇచ్చినా, తక్కువేనంటూ ముఖ్యమంత్రి జగన్ కార్మికులపై ప్రేమ వలకబోశారన్నారు. చిరు ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికులకు సైతం పెన్షన్లు, సంక్షేమ పథకాలు నిలిపివేశారని తెలిపారు. ఇప్పుడు చెత్త పన్ను భారాన్ని మోపుతున్నారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అవార్డుల కోసం, కేంద్రం మెప్పుతో రుణాలు తీసుకోవడానికి చెత్త పన్ను భారం మోపారని మండిపడ్డారు.  స్వచ్ఛభారత్ ,క్లీన్ ఏపీ CLAP పేరు చెప్పి చెత్త వాహనాల కాంట్రాక్టు బడా కంపెనీకి కట్టబెట్టారని తెలిపారు. ప్రతి వాహనానికి నెలకు 62,000 చెల్లిస్తున్నారని , బడా కంపెనీలకు మేలు చేయడం కొరకు ప్రజల నుండి చెత్త పన్ను వసూలు చేయడం, కార్మికులకు వేతనాలు కూడా నిలిపివేస్తామని ప్రకటించడం ఆక్షేపనీయమన్నారు. ఒకవైపున వృద్ధులు, వితంతువులు వికలాంగులను బెదిరించి పెన్షన్ లోనే చెత్త మొత్తాన్ని కోత పెడుతున్నారని తెలిపారు. ప్రజలను భయభ్రాంతులను చేసి పన్నులు వసూలు చేయటం నిరంకుశత్వం కాదా? అని ప్రశ్నించారు. ఈ అమానుష చర్యలకు ముఖ్యమంత్రి బాధ్యత వహించాలని, వైయస్సార్ పార్టీ ప్రజాప్రతినిధులు మౌనం వీడాలని తెలిపారు. తక్షణమే విజయవాడ నగరపాలక సంస్థ అధికారులు ఇచ్చిన ఆదేశాలను ఉపసంహరించుకోవాలని, లేనియెడల కార్మికులు ఉద్యమిస్తారు, ప్రజలు వారికి అండగా నిలుస్తారని హెచ్చరించారు. చెత్త పన్ను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు.