Oct 16,2020 19:37

లక్ష్మణరావు ఢిల్లీలోని ఐటివో ప్రాంతంలో రోడ్డుమీద టీ అమ్ముతుంటాడు. అయితే, అందరిలాంటి ఛాయ్‌వాలా కాదు. 24 పుస్తకాలను స్వయంగా రాసి ప్రచురించాడు ఆయన. అవన్నీ భారతీయ సమాజం గురించి, రాజకీయాల గురించి రాసినవే! అందులో నాటకాలు, నవలలు కూడా ఉన్నాయి. 'షేక్‌స్పియర్‌ కావాలన్నది నా కల. ప్రజలు నా పుస్తకాలు చదువుతుంటే ప్రస్తుతం నేను ఆ కలలో జీవిస్తున్నాను' అంటాడు 61 ఏళ్ల లక్ష్మణరావు.

మహారాష్ట్రలో ఓ చిన్న కుగ్రామం లక్ష్మణరావు స్వస్థలం. పదో తరగతి పూర్తి చేసి, ఐదేళ్లపాటు ఓ డాక్టరు వద్ద పని చేశాడు. మరో ఐదేళ్లు ఓ టెక్స్‌టైల్‌ మిల్లులో పనిచేశాడు. 1975లో గ్రామాన్ని విడిచిపెట్టాడు. అప్పుడు అతని వద్ద రూ.40 మాత్రమే ఉన్నాయి. పదో తరగతి సర్టిఫికెట్‌ తీసుకొని భోపాల్‌ చేరాడు. అక్కడ మూడు నెలల పాటు భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేసి, వచ్చిన డబ్బుతో ఢిల్లీ చేరుకున్నాడు. రోడ్డు మీద తినుబండారాలు అమ్మే ఓ చిన్న టిఫిన్‌సెంటర్లో పనికి కుదిరాడు. ఆ తరువాత సిగరెట్లు, బీడీలు చుట్టే కార్మికుడిగా పనిచేశాడు. 1980లో స్వయంగా టీ అమ్మే వ్యాపారం ప్రారంభించాడు. అదే ఇప్పటికీ కొనసాగుతోంది.
'ఢిల్లీలో ఎంతోమంది ప్రచురణ కర్తలు ఉంటారు. రచయితగా ఎదిగేందుకు ఢిల్లీ చాలా ఉపయోగపడుతుందని ఢిల్లీకి వచ్చా'నంటాడు ఆయన. కాని అతను రాసిన పుస్తకం అచ్చు వేసేందుకు ఏ ప్రచురణకర్తా ముందుకు రాలేదు. లక్ష్మణరావురోడ్డు మీద వ్యాపారం చేసేవాడు రచయితగా ఎలా మారగలడు? అంటూ కొందరు అవమానపరిచారు. దీంతో తనే స్వయంగా తను రాసిన 'నయీ దునియా కి నయీ కహానీ' నవలను 1979లో అచ్చు వేయించాడు. రచయిత కావాలనే సంకల్పంతో ఆయన ఎన్నో అవరోధాలను ఎదుర్కొన్నాడు. అందుకే ఆయన రాసిన పుస్తకాల్లో ఎక్కువ భాగం ఆయన అనుభవాల నుంచే వచ్చాయి. ఆయన రాసిన నవలలో 'రామ్‌దాస్‌' సుమారు 4 వేల కాపీలు అమ్ముడయ్యాయి. దానిని ఇప్పటికి నాలుగుసార్లు పున్ణప్రచురించారు. ఆ రచనకు 'ఇంద్రప్రస్థ సాహిత్య భారతి' అవార్డు కూడా వచ్చింది. అందులో ఓ విద్యార్థి అల్లరచిల్లరగా తిరుగుతుంటాడు. వాళ్ల టీచర్‌ అతని ప్రవర్తను మార్చి మంచి భవిష్యత్తువైపు నడిచేలా తీర్చిదిద్దుతాడు. దీంతో స్కూలులో టీచర్లందరికీ ఆ విద్యార్థి ప్రియశిష్యుడుగా మారతాడు. అనుకోకుండా జరిగిన ప్రమాదంలో ఆ విద్యార్థి చనిపోతాడు. ఇదీ కథ. ఇందులో విద్యార్థి, లక్ష్మణరావు గ్రామంలోని పిల్లవాడే. తన చిన్నప్పుడు జరిగిన కథే ఇది. ఆ సంఘటననే ఒక నవలాగా తీసుకొచ్చారు ఆయన.
వాస్తవాల అల్లికలు
లక్ష్మణరావు రచనలను అభిమానించేవారు గణనీయంగానే ఉన్నారు. ఆ రచనలను ఆయన రూ.300 ధరతో టీ స్టాల్‌, స్కూలు, కాలేజీ లైబ్రరీలలో అమ్మకానికి పెడతారు. మొత్తం 24 రచనల్లో ఇప్పటికి 12 పుస్తకాలు ప్రచురితమయ్యాయి. 6 పుస్తకాలను మళ్లీ మళ్లీ ప్రచురిస్తూనే ఉన్నారు. ఇప్పుడవి అమెజాన్‌, ప్లిప్‌కార్ట్‌ ఆన్‌లైన్‌ ద్వారా కూడా అందుబాటులో ఉన్నాయి. ఆయన రచనలను పొగుడుతూ అనేక పత్రికల్లో వార్తలు వచ్చాయి. 'లక్ష్మణ్‌ రచనలు మానవతకు అద్దం పడుతూ, నిజాయతీని ప్రతిబింబిస్తూ, జీవిత వాస్తవాల అల్లికల వంటివ'ని పలువురు విశ్లేషకులు అభినందించారు కూడా. 'నర్మదా', 'అభివ్యక్తి', 'దన్ష్‌', 'రేణు', 'అహంకార్‌', 'ద్రుష్టికాన్‌' వంటి తదితర రచనలు ఎంతో ప్రాముఖ్యం పొందాయి.
ఎంత ఎదిగినా ...
ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం లక్ష్మణరావు లక్షణం. తన రచనలకు విశేష ఆదరాభిమానాలు లభిస్తున్నా ఆయన దినచర్య మాత్రం మారలేదు. రోజూ ఉదయాన్నే టీ అమ్మే ప్రదేశానికి చేరుకుని, అక్కడ ఒక చాప పరుచుకుంటాడు. దానిమీద కిరోసిన్‌ స్టౌను సిద్ధం చేసుకుని టీ తయారుచేస్తుంటాడు. కస్టమర్లను చూడగానే అక్కడ సిద్ధంగా ఉన్న రెండు బెంచీల మీదికి ఆహ్వానిస్తాడు. లక్ష్మణరావుసామాన్య వ్యక్తులు, విద్యార్థులు, వలసకూలీలు అక్కడికి చేరి టీ తాగుతుంటారు. 'లక్ష్మణరావు సామాన్యుల గురించి రాస్తాడు. సామాన్యులాగా జీవిస్తాడు. అందుకే 'ఆయన రచనలు మాకు చాలా గర్వకారణం' అంటాడు మహ్మద్‌ రిహాన్‌ ఖాన్‌. అతనో రిక్షా కార్మికుడు. రిహాన్‌ పెద్దగా చదవలేదు. లక్ష్మణ్‌ పుస్తకాలనూ చదవలేదు. కాని ఆయన రచనల గురించి గొప్పగా చెబుతాడు. పోలీస్‌ అధికారుల్లో కూడా లక్ష్మణ్‌ అభిమానులు ఉన్నారు. కస్టమర్లకు టీ ఒక్కటే అమ్మడు. రాజకీయ, సాహిత్య విషయాలు మాట్లాడతాడు. అందుకే అక్కడ ఒక్కసారి టీ తాగిన వారు ఆయనను మరిచిపోరు.
రోడ్డు మీద నుంచి రాష్ట్రపతి భవన్‌కు
లక్ష్మణ్‌ రాసిన 'రేణు' కథ మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌ను ఎంతగానో కదిలించింది. వెంటనే లక్ష్మణ్‌ను కుటుంబంతో సహా రాష్ట్రపతి భవన్‌కు రమ్మని ఆమె ఆహ్వానం పంపారు. ఆ కథ కూడా లక్ష్మణ్‌ టీస్టాల్‌కు వచ్చే ఇద్దరు స్నేహితులలో ఓ విద్యార్థి పడుతున్న బాధ, ఆర్థికంగా ఆమె ఎదిగిన తీరు రాశాడు. అందులో తాగుబోతు తండ్రి, పేదరికంతో బాధ పడే ఓ అమ్మాయి అంచెలంచెలుగా ఎదుగుతూ ఫైనాన్షియర్‌గా మారిన విధానం కనబడుతుంది.
లక్ష్మణ్‌ రోజుకు పదిగంటలు టీ స్టాల్‌ నడుపుతాడు. ఒక గంట ప్రయాణం చేసి తూర్పు ఢిల్లీలో షకర్పూర్‌ ప్రాంతంలో ఉన్న తన నివాసానికి చేరుకుంటాడు. అతనికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. లక్ష్మణరావుఢిల్లీ యూనివర్శిటీలో కరస్పాండింగ్‌ కోర్సు ద్వారా డిగ్రీ, హిందీ సాహిత్యంలో మాస్టర్‌ డిగ్రీ పూర్తి చేశాడు. ఇంగ్లీషుతో పాటు ఇతర భాషల్లో పిహెచ్‌డి చేయాలన్న లక్ష్యంతో ఉన్నాడు. బాల్యం నుంచే లక్ష్మణరావుకు పఠనాసక్తి ఎక్కువ. 'ప్రముఖ హిందీ నవలా రచయిత గుల్షన్‌ నందా రాసిన 'ఉపన్యాస్‌'ను ఎన్నోసార్లు చదివాను. అలాగే శరత్‌, ప్రేమ్‌చంద్‌ రచనలు కూడా చదివేవాడిని. షేక్‌స్పియర్‌ రచనలంటే ఎంతో ఇష్టం' అంటాడు.