Oct 03,2022 23:01

ప్రజాశక్తి-ఎమ్మిగనూరు (కర్నూలు జిల్లా) : ఆంధ్రప్రదేశ్‌ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా పోలా రామాంజనేయులు, ప్రధాన కార్యదర్శిగా పిల్లలమర్రి బాలకృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని కుర్నీ కల్యాణ మండపంలో రెండు రోజులపాటు జరిగిన ఆంధ్రప్రదేశ్‌ చేనేత కార్మిక సంఘం 10వ రాష్ట్ర మహాసభ సోమవారం ముగిసింది. ఈ మహాసభకు హాజరైన ప్రతినిధులు నూతన కమిటీని ఎన్నుకున్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షులుగా కామర్తి రాజు, కట్టా శివదుర్గారావు, సహాయ కార్యదర్శులుగా డోమపర్తి రామారావు, వాసా గంగాధరరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్ర కమిటీ సభ్యులుగా అనుముల వీరబ్రహ్మం, గోరు రాజు, పిచ్చుక ఆదిశేషు, వీరనాల శివనారాయణ, నందం చంద్రకళ, డొక్క ఓబులేసు, బషీర్‌, సంపత్‌కుమార్‌, బి.చంద్ర, శేషాద్రి, వెంకటేశ్వరరావు, కె.లక్ష్మన్న, భరణి, కాలప్ప, ఎన్‌.రమణ ఎన్నుకోబడ్డారు.

  • 31న రాష్ట్ర వ్యాప్త సచివాలయాల ముందు ధర్నా

ఈ నెల 31న రాష్ట్రంలోని అన్ని సచివాలయాల ముందు చేనేత కార్మికులు ధర్నాలు చేసి సమస్యలను పాలకుల దృష్టికి తేవాలని ఎపి చేనేత కార్మిక సంఘం మహాసభ పిలుపునిచ్చింది. వైఎస్‌ఆర్‌ నేతన్న నేస్తం పథకాన్ని ప్రతి చేనేత కార్మికునికీ వర్తింపజేయాలని ఆంధ్రప్రదేశ్‌ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పోలా రామాంజనేయులు, పిల్లలమర్రి బాలకృష్ణ, వృత్తిదారుల సంఘం రాష్ట్ర కన్వీనర్‌ ఎం.భాస్కరయ్య డిమాండ్‌ చేశారు. రెండో రోజు ప్రతినిధుల సభలో వారు మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్లే చేతివృత్తులు కనుమరుగవుతున్నాయని తెలిపారు. చేనేత రంగాన్ని కాపాడుకోవడానికి ప్రతి కార్మికుడూ పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో రెండు లక్షల మగ్గాలు ఉండగా 81 వేల మందికి మాత్రమే నేతన్న నేస్తం పథకానికి అర్హులుగా గుర్తించారని తెలిపారు.

  • ప్రతి చేనేత కార్మికునికీ 'నేతన్న నేస్తం' వర్తింపజేయాలి : మహాసభలో 20 తీర్మానాలు ఆమోదం

మహాసభలో 20 తీర్మానాలు ఆమోదించారు. నేతన్న నేస్తం పథకం ప్రతి చేనేత కార్మికునికీ వర్తింపజేయాలని, చేనేతకు కేటాయించిన 11 రకాల రిజర్వేషన్లు కచ్చితంగా అమలు చేయాలని, ప్రస్తుత నిత్యావసర సరుకుల ధరలకు అనుగుణంగా కనీస వేతన చట్టం జిఒ చేయాలని, పట్టు నూలు ధరలు 2021 నాటి ధరలకు తగ్గట్టు తగ్గించాలని, చేనేతపై జిఎస్‌టి పూర్తిగా రద్దు చేయాలని, కేంద్ర ప్రభుత్వం 2017 మార్చి 30న నిలుపుదల చేసిన జీవిత బీమా సౌకర్యాన్ని, ఆరోగ్య బీమాను పునరుద్ధరించాలని, వయస్సుతో నిమిత్తం లేకుండా లక్షన్నర రూపాయలకు పెంచాలని, ప్రతి చేనేత కార్మికునికీ అంత్యోదయ కార్డులు ఇవ్వాలని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాదిరి చేనేత కార్మికులకు రూ.5 లక్షల స్కీమ్‌ను ప్రవేశపెట్టాలని, బోగస్‌ చేనేత సహకార సంఘాలను రద్దు చేయాలని, చేనేత వస్త్రాలపై 20 శాతం రిబేటు కొనసాగించాలని, సహకార సంఘాలకు ఆప్కో బకాయిలను వెంటనే చెల్లించాలని, స్కూలు పిల్లలకు ప్రభుత్వం ఇస్తోన్న వస్త్రాలు చేనేతవి ఇవ్వాలని, టెక్స్‌టైల్‌ పార్కులు కాదు చేనేత పార్కులు ఏర్పాటు చేయాలని, చేనేత కార్మికులకు ఇళ్ల స్థలాలు, పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని, చైనా నుండి పట్టు దిగుమతి చేసుకొని సబ్సిడీపై కార్మికులకు అందించాలని, చేనేత మహిళలకు ప్రసూతి సమయంలో ఉచితంగా ఆర్థిక సాయం చేయాలని, హెల్త్‌ కార్డులు ఇవ్వాలని, ప్రైవేట్‌ సెక్టార్‌లోని చేనేత కార్మికులకు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, చేనేత కార్మికులకు వెల్ఫేర్‌ బోర్డు ఏర్పాటు చేయాలి తీర్మానించారు. మహాసభలో చేనేత కార్మిక సంఘం రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు జెఎన్‌.శేషయ్య పాల్గన్నారు.