
ప్రజాశక్తి-మండపేట (డాక్టర్ బిఆర్.అంబేద్కర్ కోనసీమజిల్లా) : ఉపాధ్యాయ ఉద్యమ నిర్మాతల్లో అగ్రశ్రేణి నాయకుడు చెన్నుపాటి లక్ష్మయ్య పేరును ఓ విదేశీ పూల మొక్కకు యుటిఎఫ్ నామకరణం చేసింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలో యుటిఎఫ్ జిల్లా కౌన్సిల్ సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశంలో అరుణ వర్ణం ఆకులతో ఉన్న విదేశీ 'పోయిన్‌సెట్టియా రెడ్ మొక్క'కు చెన్నుపాటి లక్ష్మయ్య ఫ్లవర్స్ ప్లాంట్ అనే పేరుపెట్టి ఆవిష్కరించారు. ఈ మొక్కకు ఇంతవరకు స్థానికంగా పేరు లేకపోవడంతో ఇకపై చెన్నుపాటి పేరుతో పిలవాలని నిర్ణయించారు.
పోయిన్‌సెట్టియా మొక్క ఇండోర్ ప్లాంట్‌గా పెంచుకుంటున్నారు. దీనికి పూలు ఉండవు. ఆకులే ఎరుపు రంగులోకి మారడం దీని విశిష్టత. ఇవి అరుణ పతాకాలులాగ రెపరెపలాడతాయి. యుటిఎఫ్ ఉద్యమ పతాకాన్ని గుర్తు తెచ్చేలా ఈ ఆకులు ఉండటంతో ఈ మొక్కకు యుటిఎఫ్ వ్యవస్థాపక చెన్నుపాటి పేరు పెట్టారు. నిజాయితీకి చిహ్నంగా ఈ మొక్కను భావిస్తారు. మొక్క పాలను కొన్ని ఔషధాల్లోనూ వినియోగిస్తుంటారు. ఇటీవల ఈ మొక్కలను కడియం నర్సరీలకు రప్పించారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెఎస్‌ఎస్.ప్రసాద్, రాష్ట్ర కార్యదర్శులు రాఘవులు, ప్రభాకర్‌వర్మ, జాతీయ పర్యావరణ మిత్ర, యుటిఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ చిలుకూరి శ్రీనివాసరావు, యుటిఎఫ్ ప్రతినిధులు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జ్యోతిబసు, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.