Nov 06,2022 08:48

హిందూ మహాసముద్రంలో ఒక దీవి ఉండేది. ఆ దీవి పేరు తామ్ర ద్వీపం. రాజైన వీరవర్మ అకాలమరణం పొందడంతో యువరాజు సుగుణవర్మ రాజయ్యాడు.
ఆ సమయానికి తామ్ర ద్వీపం ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. ఉగాది సందర్భంగా యుద్ధ వీరులను సన్మానించడం ఆ రాజ్యం ఆనవాయితీ. ఎప్పటిలా మంత్రివర్యులు సన్మానానికి అర్హత కలిగిన యుద్ధ వీరుల జాబితాను తయారుచేసి, రాజుగారి ముందుంచాడు. ఒకొక్క పేరు చదివి వారి యుద్ధ నైపుణ్యతను వివరించసాగాడు. అంతా విన్న సుగుణవర్మకు తన గురువు చెప్పిన ఒక మంచి నీతివాక్యం మనసులో మెదిలింది. ఆ వాక్యమే అతనికి ఒక మార్గం చూపింది.
అప్పుడతడు 'మంత్రివర్యా! మన దీవి రక్షణకు యుద్ధవీరుల ఆవశ్యకత వెలకట్టలేనిది. నేను కాదనను. కానీ, యుద్ధవీరులతో పాటు రాజ్య సౌభాగ్యానికి సమస్త వృత్తిదారుల పాత్ర ఉందనేది నా అభిప్రాయం. రైతు లేకపోతే తిండి దొరకదు. కార్మికులు లేకపోతే మనకు అవసరమయ్యే వస్తుసామగ్రి, విదేశీ ద్రవ్యం లభించదు. తోటలు పెంచేవారు, కోటలు కట్టేవారు కూడా రాజ్యాభివద్ధికి అంతే అవసరం. చదువు చెప్పేవారు, నీతులు బోధించేవారు రేపటి పౌరులను తయారు చేయడంలో గణనీయ పాత్రనే పోషిస్తారు. వీళ్లంతా రాజ్యం అభివద్ధిలో భాగస్వాములే కదా! వీరిలో ఎవరు లేకపోయినా జీవనచక్రం నడక సాగదు. మరొక సామీప్యత ఈ సందర్భంలో చెప్పాలని ఉంది.
ఒక భవనం నిర్మించాలంటే ఎంతోమంది పనివాళ్ళు, ఎన్నోరకాల వృత్తుల వాళ్ళ శ్రమ తోడవ్వాలి. అప్పుడే ఆ భవన నిర్మాణం పూర్తవుతుంది. భవనంలాంటిదే రాజ్యం కూడా. రాజ్య సౌభాగ్యం వారందరి శ్రమ సమ్మేళనమే. అందుకే సమస్త వృత్తులలో మేటిగా ఉన్న వారిని ఎంపిక చేసి, రాజ సత్కారానికి ఆహ్వానించండి' అన్నాడు మంత్రితో.మంత్రికి ఈ ఆలోచన నచ్చింది. ఇంతకాలం తనకిలాంటి ఆలోచన రానందుకు కించిత్‌ సిగ్గుగానూ అనిపించింది. ఇలా చెయ్యడం వల్ల అన్ని వృత్తులను ప్రోత్సహించినట్లవుతుంది. వృత్తి పనివారలలో పోటీతత్వం పెంచినట్లవుతుంది. ప్రతి వృత్తినీ గౌరవించినట్టూ అవుతుంది. రాజ్యం సుసంపన్నమౌతుంది అని మంత్రి మనసులో అనుకుని, రాజు ఆజ్ఞను ప్రకటించాడు.
రాజుగారి ఆలోచన అమలైంది. వివిధ వృత్తులు చేసే వారందరిలోనూ ఉత్సాహం పెల్లుబికింది. శ్రమైక జీవన సౌందర్యం ప్రభవించింది. భూమి సస్యశ్యామలమైంది. కర్మాగారాలు వస్తు ఉత్పత్తిలో రాణించాయి. బలిష్టమైన సైన్యం ఆ ద్వీపానికి రక్షణ కవచంగా నిలిచి, రాజ్య సంపదను కాపాడగలిగింది. ప్రజలు వేనోళ్ళ కొనియాడారు. పక్క రాజ్యాలకు ఆదర్శ రాజ్యంగా మారింది. ఫలితంగా తామ్రదీవి సిరిసంపదలకు నిలయమై, కాలగమనంలో స్వర్ణదీవిగా పేరు తెచ్చుకుంది.
'శ్రమే సిరి. ఏ రాజ్యంలోని ప్రజలు కష్టపడి పనిచేస్తారో, ఏ రాజు పనికి తగ్గ వేతనం ఇచ్చి, వారిని గౌరవిస్తాడో.. అక్కడ సిరి సంపదలు వెల్లివిరుస్తాయి. తత్ఫలితంగా రాజ్యం సుభిక్షమౌతుంది. అలా జరగని పక్షంలో ఆ రాజ్యం అధోగతి పాలవుతుంది!' అన్న గురువుల వాక్యం రాజు ఎన్నడూ మరచిపోలేదు. తామ్ర ద్వీపం సుగుణవర్మ పరిపాలనలో సువర్ణభూమి అయింది.
- బెలగాం భీమేశ్వరరావు
9989537835