Jul 21,2021 12:07

బీజింగ్‌ : సెంట్రల్‌ చైనాలోని హెనాన్‌ ప్రావిన్స్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు 12 మంది మరణించారు. సుమారు రెండు లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు మీడియా తెలిపింది. ఈ ప్రాంతంలో 60 ఏళ్లలో ఇదే అత్యధిక వర్షపాతమని అధికారులు తెలిపారు. రాష్ట్ర వరద నియంత్రణ, నిర్వహణ బ్యూరోకి చెందిన బృందం లెవల్‌ 3 హెనాన్‌లో సహాయక చర్యలను ప్రారంభించింది. సుమారు 849 మందిని రక్షించామని, 1500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు వెల్లడించింది. హెనాన్‌ ప్రావిన్స్‌లోని జెంగ్‌హౌ నగరంలో 1975లో 198.5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైందని, మంగళవారం గరిష్టంగా 201.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని జాతీయ వాతావరణ అబ్జర్వేటరీ తెలిపింది. శనివారం రాత్రి 8 గంటల నుండి మంగళవారం రాత్రి 8 గంటల వరకు ఈ నగరం 617.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని.. 60 ఏళ్ల అనంతరం రికార్డుస్థాయిలో వర్షపాతం నమోదైందని మీడియా తెలిపింది. టైఫూన్‌తో భారీ వర్షం కురిసినట్లు నిపుణులు తెలిపారు.

జెంగ్‌హౌలో రెడ్‌ అలెర్ట్‌ జారీ చేశామని, స్థానిక నదులు, జలాశయాలపై నిఘా పెంచినట్లు అధికారులు తెలిపారు. అన్ని సబ్‌ వేస్టేషన్‌లను వరదలు ముంచెత్తాయని, దీంతో సబ్‌వేలను మూసివేసినట్లు తెలిపింది. బుధవారం ఏడుగంటల సమయానికి జెంగ్‌హౌలోని 36 వేల మందిని ఈ విపత్తు ప్రభావితం చేసిందని, సుమారు రెండు లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని జెంగ్‌హౌ మునిసిపల్‌ అధికారులు తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం నడుములోతు నీళ్లలో జెంగ్‌హౌలోని లైన్‌ 5 సబ్‌వే ట్రెయిన్‌లో కొంతమంది ప్రయాణికులు చిక్కుకుపోయారని అన్నారు. అయితే వారిని సురక్షితంగా బయటకు తీశామని అన్నారు. వరుసగా రెండు రోజులు భారీ వర్షాలు కురవడంతో .. 16 జలాశయాల్లోని నీటి మట్టాలు హెచ్చరికస్థాయిని దాటి ప్రవహిస్తున్నాయని మీడియా తెలిపింది. ఈ వరదలతో 9,222 హెక్టార్లలో పంట దెబ్బతినిందని, దీంతో 73 మిలియన్‌ యువాన్‌ల నష్టం వాటిల్లిందని వెల్లడించింది. రాబోయే 24 గంటల్లో హెనాన్‌ ప్రావిన్స్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.

పిఎల్‌ఎ సెంట్రల్‌ థియేటర్‌ కమాండ్‌ 730 మంది కమాండర్లను సహాయక చర్యలకోసం పంపింది. అదే సమయంలో 1,1589 మంది పోలీస్‌ అధికారులు, సైనికులు, 60కిపైగా వాహనాలు, 6,760 మంది అగ్నిమాపక సిబ్బంది, 1,383 అగ్నిమాపక వాహనాలు, 38 పడవలు సహాయక చర్యల్లో పాల్గన్నాయి. ప్రజల ప్రాణాలను, ఆస్తులను రక్షించేందుకు ప్రాముఖ్యత నివ్వాలని చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌ జింగ్‌హౌ వరద నివారణ, విపత్తు సహాయక బృందం అధికారులకు ఆదేశించారు. వీలైనంత త్వరగా పరిస్థితులను అదుపులోకి తీసుకురావాలని సూచించారు.

china Floods  : 60 ఏళ్లలో అత్యధిక వర్షం -  12 మంది మృతి

 

china Floods  : 60 ఏళ్లలో అత్యధిక వర్షం -  12 మంది మృతి

 

china Floods  : 60 ఏళ్లలో అత్యధిక వర్షం -  12 మంది మృతి