Jun 29,2022 08:13

ఐక్యరాజ్య సమితి : ఆక్రమిత పాలస్తీనా భూభాగంలో దిగజారుతున్న పరిస్థితుల పట్ల చైనా రాయబారి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పాలస్తీనా-ఇజ్రాయిల్‌ సమస్య పూర్తిగా పట్టాలు తప్పకుండా వుండేలా చూసేందుకు అత్యవసర, నిర్ణయాత్మక చర్యలు చేపట్టాలని ఆయన అంతర్జాతీయ సమాజాన్ని కోరారు. ఇజ్రాయిల్‌ సెటిల్‌మెంట్లతో విస్తరణ కొనసాగుతున్నందున పాలస్తీనా భూమి, సహజ వనరులన్నీ పూర్తిగా అన్యాక్రాంతమవుతున్నాయని ఐక్యరాజ్య సమితిలో చైనా శాశ్వత రాయబారి ఝాంగ్‌ జున్‌ ఆందోళన వెలిబుచ్చారు. తద్వారా పాలస్తీనియన్ల స్వయం నిర్ణయాధికార హక్కు దెబ్బ తింటుందని అన్నారు. పాలస్తీనాతో సహా మధ్య ప్రాచ్యంలో పరిస్థితులపై భద్రతా మండలిలో ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్క అంగుళం విస్తరించుకుంటూ వెళుతున్న నేపథ్యంలో రెండు దేశాల ఏర్పాటు పరిష్కారమనేది మరింత కఠినంగా మారుతోందని అన్నారు. సెటిల్‌మెంట్ల నిర్మాణ కార్యకలాపాలన్నిటిని ఆపాలని, ఐక్యరాజ్యసమితి చేసిన 2334 తీర్మానం ఉల్లంఘన జరగకుండా చూడాలని ఇజ్రాయిల్‌ను కోరుతున్నామని ఝాంగ్‌ చెప్పారు.