May 28,2023 21:46

ఝాంగ్జూ: చైనాకు చెందిన సోషల్‌ మీడియా ఇన్ఫ్లుయెన్సర్‌ ఓ ఛాలెంజ్‌లో భాగంగా వరుసగా బాటిళ్ల కొద్ది మద్యం తాగి ప్రాణాలు కోల్పోయాడు. చైనీస్‌ వోడ్కాగా పేరున్న బైజ్యూ అనే దేశీయ మద్యం తాగడం వల్ల అతడు చనిపోయాడు. ఈ ఘటన ఝాంగ్జూ ప్రావిన్స్‌లో చోటు చేసుకొంది. చైనా వెర్షన్‌ టిక్‌టాక్‌ డుయిన్‌లో సాంక్యూయాంజ్‌గా పేరున్న ఇన్‌ఫ్లూయెన్సర్‌ మే16 తెల్లవారుజామున 'పీకే' అనే ఛాలెంజ్‌లో మరో ఇన్‌ఫ్లూయెన్సర్‌తో పోటీపడ్డాడు. ఈ పోటీలో విజేతలకు వీక్షకుల నుంచి గిఫ్ట్‌లు, ప్రోత్సాహకాలు అందుతాయి. ఓడిపోయిన వారికి శిక్షలు కూడా ఉంటాయి. ఈ పోటీలో ఓడిపోయినందుకు శిక్షగా అతడు పలు బాటిళ్ల బైజ్యూను ఎటువంటి విరామం లేకుండా తాగాల్సివచ్చింది. ఈ క్రమంలో అతడు కనీసం నీటిని కూడా తీసుకోలేదు. ఈ క్రమంలో సదరు లైవ్‌స్ట్రీమ్‌ను అర్ధరాత్రి తర్వాత ముగించాడు. మర్నాడు మధ్యాహ్నానికి అతడు మరణించాడు. సాంక్యూయాంజ్‌ అసలు పేరు వాంగ్‌. ఈ ఘటనపై అతడి స్నేహితుడు ఝావో మాట్లాడుతూ తొలుత తాను చూసేటప్పటికి ఎన్ని బాటిళ్లు తాగాడో తెలియలేదని పేర్కొన్నాడు. ఆ తర్వాత తాను వచ్చేటప్పటికే మూడు బాటిళ్లను పూర్తిచేసినట్లు గుర్తించాన్నారు. వాంగ్‌ ఇటీవలే తన గదిలో చేరాడని ఝావో పేర్కొన్నాడు. అతడి గొడవ దెబ్బకు మిత్రులు ఎవరూ రూమ్‌లు ఇవ్వలేదని పేర్కొన్నాడు. చైనాలోని సోషల్‌ మీడియా మార్కెట్‌లో విపరీతమైన పోటీ నెలకొంది. దీంతో ఇన్‌ఫ్లూయెన్సర్‌ లైవ్‌స్ట్రీమ్‌లు ఎక్కువ మంది వీక్షకులను సొంతం చేసుకొనేందుకు అన్ని హద్దులను దాటేస్తున్నాయి. ఈ నెల మొదట్లో ఇన్‌ఫ్లూయెన్సర్‌ ఇంటిపైన చిక్కుకొన్నట్లుగా నటించాడు. అతడిని అగ్నిమాపక సిబ్బంది వచ్చి రక్షించగా.. దానిని కూడా చిత్రీకరించి ఆన్‌లైన్‌లో పోస్టు చేశాడు. గతేడాది చైనా ప్రభుత్వం లైవ్‌ స్ట్రీమర్లపై పలు ఆంక్షలు విధించింది. దీంతోపాటు హద్దులు మీరిన లైవ్‌స్ట్రీమర్లపై నిషేధం కూడా విధించింది.