Sep 04,2022 08:23

ప్రజాశక్తి- కలెక్టరేట్‌ (విశాఖపట్నం) : ప్రభుత్వరంగ పరిశ్రమల్లో కార్మిక చట్టాలను సక్రమంగా అమలు చేయడం లేదని లేబర్‌, టెక్స్‌టైల్స్‌ అండ్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ పార్లమెంట్‌ స్టాండింగ్‌ కమిటీకి సిఐటియు విశాఖ జిల్లా నాయకులు శనివారం ఫిర్యాదు చేశారు. విశాఖలోని ప్రభుత్వరంగ పరిశ్రమలైన పోర్టు, హెచ్‌పిసిఎల్‌, ఐఒసిఎల్‌, స్టీల్‌ప్లాంట్‌ కార్మికులకు అమలు జరుగుతున్న ప్రభుత్వ జిఒలపై కార్మిక సంఘాలతోనూ, యాజమాన్యాలతో చర్చించేందుకు ఈ కమిటీ విశాఖ వచ్చింది. ఎంపి మెహతబ్‌ భర్తృహరి చైర్మన్‌గా ఉన్న ఈ కమిటీలో సిపిఎం ఎంపి కరీం సహా 19 మంది సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీని కలిసి పలు సమస్యలపై వినతిపత్రం అందజేసిన సిఐటియు విశాఖ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కెఎం.శ్రీనివాసరావు, ఆర్‌కెఎస్‌వి.కుమార్‌, కోశాధికారి ఎస్‌.జ్యోతీశ్వరరావు, నాయకులు బి.జగన్‌, కుమార మంగళం, ఆర్‌.లక్ష్మణమూర్తి మీడియాకు ఆ వివరాలు వెల్లడించారు. పార్లమెంటరీ కమిటీతో మాట్లాడడానికి స్టీల్‌ప్లాంట్‌ మినహా మిగిలిన పోర్టు, హెచ్‌పిసిఎల్‌, ఐఒసిఎల్‌ యాజమాన్యాలు కార్మిక సంఘాలకు సమాచారం ఇవ్వకుండా వారి అనుయాయులకు తర్ఫీదు ఇచ్చి సమావేశానికి సమాయత్తం చేశాయని విమర్శించారు. ఇటువంటి కార్మిక వ్యతిరేక చర్యలను తమ సంఘం తీవ్రంగా ఖండిస్తోందన్నారు. విశాఖ పోర్టులో తొమ్మిది వేల మంది కాంట్రాక్టు కార్మికులు పని చేస్తున్నారని, స్కిల్డ్‌ పనులు వీరు చేస్తోన్నా, వారెవరికీ స్కిల్డ్‌ వేతనం ఇవ్వడం లేదని తెలిపారు. హెచ్‌పిసిఎల్‌లో రోజుకు రూ.553 మాత్రమే ఇస్తున్నారని చెప్పారు. ఇటీవల కాలంలో విశాఖలోని ప్రభుత్వ పరిశ్రమల్లో ప్రమాదాలు సంభవించి విధుల్లోనే కార్మికులు చనిపోయిన ఉదంతాలు ఉన్నాయన్నారు. హిందూస్తాన్‌ షిప్‌ యార్డ్‌లో 11 మంది కార్మికులు ప్రమాదంలో చనిపోతే వారి యాక్సిడెంట్‌ రిపోర్టును ఇంతవరకూ బహిర్గతం చేయలేదని తెలిపారు. షిప్‌యార్డ్‌లో ఇఎస్‌ఐ, పిఎఫ్‌ సక్రమంగా అమలు జరగడం లేదన్నారు. పిఎఫ్‌ రికవరీ చేస్తున్నప్పటికీ కమిషనర్‌ కార్యాలయానికి జమ చేయడం లేదని తెలిపారు. అత్యధిక పరిశ్రమల్లో మేనేజ్‌మెంట్‌ కంట్రిబ్యూషన్‌ కూడా కార్మికుల వద్ద నుంచే రికవరీ చేస్తున్నారన్నారు. రైల్వేలో, ఇతర ప్రభుత్వరంగ పరిశ్రమల్లో రూ.784 చెల్లించాల్సిన కార్మికునికి రూ.500 మాత్రమే ఇస్తున్నారని తెలిపారు. రూ.625 చెల్లించాల్సిన కార్మికునికి రూ.400 చెల్లిస్తున్నారని చెప్పారు. రూ.581 చెల్లించాల్సిన కార్మికునికి రూ.350 ఇస్తున్నారని తెలిపారు. వేతనం తగ్గించి ఇవ్వడం చట్ట వ్యతిరేకమన్నారు. ఏటా బోనస్‌, వారాంతపు సెలవులు, పండగ సెలవులు, ఎర్నడ్‌ లీవులు సక్రమంగా అమలు కావడం లేదని తెలిపారు. స్టీల్‌ప్లాంట్‌ మినహా ఏ ప్రభుత్వరంగ పరిశ్రమలోనూ చట్టపరమైన హక్కులు అమలు జరగబం లేదని కమిటీ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. కాంట్రాక్టు పూర్తయిన తరువాత పనినుంచి నిలుపుదల చేస్తే కార్మికులకు రావాల్సిన చట్టపరమైన బెన్‌ఫిట్స్‌ను అమలు చేయడం లేదన్నారు. ఈ చట్ట ఉల్లంఘనలపై పరిశ్రమల అధికారులను స్టాండింగ్‌ కమిటీ ప్రశ్నించాలని, కార్మికులు పోరాడి సాధించుకున్న జిఒలు, హక్కులు అమలయ్యేలా చూడాలని కోరినట్లు సిఐటియు తెలిపారు.