Mar 24,2023 22:05
  • కేంద్రానికి 2 తీర్మానాలు పంపుతున్నామన్న సిఎం జగన్

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : దళితులు క్త్రెస్తవ మతంలోకి మారినా వారికి ఎస్‌సి హోదా ఉండే విధంగా రాజ్యాంగాన్ని సవరించాలని, బోయ/వాల్మీకులను ఎస్‌టి జాబితాలో చేర్చాలని ప్రవేశపెట్టిన తీర్మానాలను శాసన సభ శుక్రవారం ఏకగ్రీవంగా ఆమోదించింది. ఆ తీర్మానాలను ఆమోదించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తున్నట్లు సిఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. దళితులు క్రైస్తవ మతంలోకి మారినా ఎస్‌సి హోదా ఇవ్వాలను బిల్లును మంత్రి మేరుగ నాగార్జున ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సిఎం జగన్‌ మాట్లాడుతూ క్రైస్తవ మతంలోకి మారిన షెడ్యూల్డు కులాల వ్యక్తులు సామాజిక, ఆర్థిక, రాజకీయ వివక్షను ఎదుర్కొంటున్నారని తెలిపారు. సిక్కు, భౌద్ద మతంలోకి మారిన వారితో సమానంగా పరిగణించేందుకు వారు అర్హులని చెప్పారు. హిందూ మతానికి చెందిన షెడ్యూల్డు కులాల వారు, క్రైస్తవ మతంలోకి మారిన షెడ్యూల్డు కులాల వారి సామాజిక ఆర్థిక పరిస్థితులు ఒకేలా ఉన్నాయని తెలిపారు. సమాజంలో అవమానాలు, వివక్షకు గురవుతున్నారని, ఒక వ్యక్తి మరొక మతంలోకి మారడం ద్వారా వీటిలో ఏదీ మారదని, ఒక వ్యక్తి ఏ మతాన్ని ఆచరించాలనేది ఆ వ్యక్తి ఎంపిక అని, కుల నిర్ధారణపై ఎటువంటి ప్రభావం చూపకూడదని సిఎం పేర్కొన్నారు.

  • ఎస్‌టిల జాబితాలో బోయ, వాల్మీకులు

బోయ, వాల్మీకులను షెడ్యూల్‌ తెగల జాబితాలో చేర్చేందుకు తాము వేసిన వన్‌ మ్యాన్‌ కమిషన్‌ అధ్యయనం చేసి నివేదిక ఇచ్చిందన్నారు. అనంతపురం, కరూులు, వైఎస్‌ఆర్‌ కడప, చిత్తూరు జిల్లాల్లో నివసిస్తున్న బోయ, వాల్మీకి వర్గాలను దాని అన్ని పర్యాయపదాలతోపాటు (వాల్మీకి, చుండినవాకులు, దొంగబోయ, దొరలు, గెంటు, గురికార, కళావతి బోయలను షెడ్యూల్డ్‌ తెగల జాబితాలో చేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించాలని సభ తీర్మానించింది. ఈ బిల్లును బిసి సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ప్రవేశపెట్టారు. విజయవాడలో రూ.268 కోట్ల వ్యయంతో డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ 125 అడుగుల విగ్రహాన్ని, ఉద్యానవనాన్ని అభివృద్ధి చేస్తునుందుకు సిఎంకు కృతజ్ఞతలు తెలుపుతూ మంత్రి మేరుగ నాగార్జున ప్రతిపాదించిన తీర్మానాన్ని శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది.