May 26,2023 20:46
  • దీక్షా శిబిరాల్లో నల్లబెల్లూన్లు ఎగురవేయాలని జెఎసి నేతల నిర్ణయం

ప్రజాశక్తి-గుంటూరు జిలా ప్రతినిధి/ తుళ్లూరు : ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలి సారిగా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి రాజధాని గ్రామాల్లో శుక్రవారం జరిగే భారీ బహిరంగ సభలో పాల్గననున్నారు. 2019 డిసెంబరు 17న మూడు రాజధానుల ప్రకటన తరువాత రాజధానిలో బహిరంగంగా ఆయన పర్యటించిన పరిస్థితులు లేవు. రాజధానికి భూములు ఇచ్చిన రైతులు 1253 రోజులుగా ఉద్యమం చేస్తున్నా ఆ వైపు కన్నెత్తి చూడలేదు. అసెంబ్లీ, మంత్రివర్గ సమావేశాలకు మాత్రమే ఆయన సచివాలయానికి వచ్చి వెళ్తున్న సమయంలో రైతుల నిరసన కనిపించకుండా రోడ్డుకు ఇరు వైపులా పరదాలు కట్టి పోలీసులు అడ్డుగా నిలబడుతున్నారు. ఈ నేపధ్యంలో గుంటూరు, ఎన్‌టిఆర్‌ జిల్లాలకు చెందిన 50 వేల మంది పేదలకు ఇళ్ల పట్టాలను ఇచ్చేందుకు ఈ నెల 26న ఆయన తుళ్లూరు మండలం వెంకటపాలెం రానున్నారు. ఈ సందర్భంగా 20 ఎకరాల్లో భారీ బహిరంగ సభకు అధికారులు ఏర్పాట్లు చేశారు. దాదాపు 60 వేల మంది సభకు వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇళ్ల పట్టాలు పొందుతున్న లబ్ధిదారులతోపాటు డ్వాక్రా మహిళలను సభకు సమీకరిస్తున్నారు. బహిరంగ సభా ప్రాంగణానికి ఎటువైపు నుంచి రైతులు వచ్చి నిరసన తెలుపుతారోనన్న అనుమానంతో పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. సిఎం సభ నేపధ్యంలో రైతులు తమ శిబిరాల్లోనే బెలూన్లు ఎగుర వేసి నోటికి నల్లరిబ్బన్లు కట్టుకుని నిరసన తెలపాలని అమరావతి జెఎసి నాయకులు నిర్ణయించిన నేపధ్యంలో సభా ప్రాంగణానికి ఐదు కిలో మీటర్ల దరిదాపుల్లో ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలీసులు నియంత్రిస్తున్నారు. రాజధాని ప్రాంతంలో నిర్మించిన ఆరు వేల టిడ్కో ఇళ్లను కూడా శుక్రవారం పంపిణీ చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. సిఎంతో వీటిని లబ్ధిదారులకు అప్పగించనున్నారు. ఈ మేరకు సిఎం సభ ఏర్పాట్లను మంత్రులు ఆది మూలపు సురేష్‌, జోగి రమేష్‌, మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీలు ఎల్‌ అప్పిరెడ్డి, తలశిల రఘురామ్‌, ఎంపి నందిగం సురేష్‌, వైసిపి నాయకులు డొక్కా మాణిక్యవరప్రసాద్‌, కలెక్టరు వేణు గోపాలరెడ్డి, సిఆర్‌డిఎ కమిషనర్‌ వివేక్‌ యాదవ్‌ తదితరులు పరిశీలించారు.

  • రాజధానిలో వైసిపి నాయకుల విజయోత్సవ ర్యాలీ

రాజధానిలో వైసిపి నాయకులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. తాళ్ళాయపాలెం జంక్షన్‌ దగ్గర ఉన్న మూడు రాజధానుల శిబిరం దగ్గర నుంచి వెంకటపాలెంలో జరిగే సిఎం సభ వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ఎంపి నందిగం సురేష్‌, తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త కత్తెర సురేష్‌ కుమార్‌, బహుజన పరిరక్షణ సమితి నాయకులు మాదిగాని గురునాధం పాల్గన్నారు. వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ రాజధానిలో పేదలకు ఇళ్ల స్థలాల కోసం చేసిన ఉద్యమం విజయవంత మైందని ఆనందం వ్యక్తం చేశారు. సెంటు స్థలం పంపిణీపై పేదలను అవమానపరిచే విధంగా మాట్లాడిన మాటలను చంద్రబాబు ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఐనవోలులో వైఎస్‌ రాజశేఖర రెడ్డి, ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి చిత్ర పటాలకు పాలాభిషేకం చేశారు.