Mar 26,2023 17:02

కొచ్చి :  ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌కి చెందిన అడ్వాన్స్‌డ్‌ లైట్‌ హెలికాఫ్టర్‌ ( ఏఎల్‌హెచ్‌) ధ్రువ్‌కు తృటిలో ముప్పు తప్పింది. కేరళలోని కొచ్చిలో ఆదివారం అత్యవసరంగా ల్యాండ్‌ అయినట్లు అధికారులు తెలిపారు. కొచ్చిన్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో టేకాఫ్‌ అయిన వెంటనే కోస్ట్‌ గార్డ్‌ హెలికాఫ్టర్‌ బలవంతంగా ల్యాండ్‌ అయ్యిందని, ఆసమయంలో హెలికాఫ్టర్‌లో ముగ్గురు పైలెట్లు ఉన్నారని, ఒకరికి స్వల్ప గాయాలైనట్లు ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. ఫోర్స్‌ ల్యాండ్‌ అయిన సమయంలో హెలికాఫ్టర్‌ 25 అడుగుల ఎత్తులో ఉందని, ఏఎల్‌హెచ్‌ ధ్రువ్‌ హెలికాఫ్టర్‌ కార్యకలాపాలను పునరుద్ధరించేందుకు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.
హెలిప్యాడ్‌ నుంచి టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే శిక్షణ విమానం కూలిపోయే క్రమంలో పైలట్‌ నేర్పుతో మెయిన్‌ రన్‌వే పక్కకు ల్యాండ్‌ చేయడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో హెలికాఫ్టర్‌లో ముగ్గురు వ్యక్తులు ఉన్నారని, పైలట్‌ చాకచక్యంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు చెప్పారు.