Mar 18,2023 21:29

న్యూఢిల్లీ : ప్రతీ వ్యవస్థా సమగ్రమైనది కాదు, కానీ న్యాయమూర్తులను నియమించడానికి వున్న వాటిలో మనం అభివృద్ధి పరుచుకున్న  కొలీజియం వ్యవస్థ ఉత్తమమైనదని భారత ప్రధాన న్యాయమూర్తి డి.వై.చంద్రచూడ్‌ అన్నారు. ప్రభుత్వం, న్యాయవ్యవస్థకు మధ్య ప్రధాన వివాదమైన కొలీజియం వ్యవస్థను ఆయన సమర్ధించారు. ఇండియా టుడే సదస్సులో శనివారం ఆయన మాట్లాడుతూ న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా వుండాలంటే బయటి ప్రభావాల నుంచి కాపాడాల్సి వుందనిఅనాురు. రాజ్యాంగ న్యాయస్థానాల న్యాయమూర్తులుగా తాము సిఫార్సు చేసిన పేర్లను ఆమోదించకపోవడానికి ప్రభుత్వానికి గల కారణాలను కొలీజియం వెల్లడించడంపై న్యాయ శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ అంశంపై సిజెఐ మాట్లాడుతూ ''అభిప్రాయ భేదాలు వుండడం వల్ల తప్పేమిటి? నేనయితే, అత్యంత క్రియాశీలమైన రాజ్యాంగ నీతిజ్ఞతతో ఇటువంటి అభిప్రాయ భేదాలను ఎదుర్కొంటాను. న్యాయ శాఖ మంత్రి అసంతృప్తి విషయంలో నేను జోక్యం చేసుకోదలుచుకోలేదు. మనందరం అభిప్రాయ భేదాలను కలిగి వుంటాం.'' అని అన్నారు. కొలీజియం వ్యవస్థకు రిజిజు పూర్తి వ్యతిరేకం. మన రాజ్యాంగానికి ఇది పనికిరాదని కూడా ఆయన ఒకసారి వ్యాఖ్యానించారు. కేసులను ఎలా పరిష్కరించాలనే విషయంలో ప్రభుత్వం నుంచి ఒత్తిడి లేదని చంద్రచూడ్‌ తెలిపారు. ఎన్నికల కమిషన్‌ తీర్పే ఇందుకు ఉదాహరణ అని అన్నారు.

  • నియామక ప్రక్రియలో జోక్యం చేసుకుంటే ఎలా? : కిరణ్‌ రిజిజు

నియామక ప్రక్రియలో న్యాయమూర్తులు జోక్యం చేసుకుంటే న్యాయవ్యవస్థను పట్టించుకునేది ఎవరు? అని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు ప్రశిుంచారు. ఇండియా టుడే సదస్సులో ఆయన మాట్లాడుతూ కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థలు ఏమి చేయాలను దానిపై 'రాజ్యాంగ లక్ష్మణ రేఖ' స్పష్టంగా ఉందని తెలిపారు. 'ఎన్నికల కమిషనర్ల నియామకం గురించి రాజ్యాంగం స్పష్టంగా పేర్కొంది. ప్రధాన ఎన్నికల కమిషనర్‌, ఎన్నికల కమిషనర్ల నియామకాలకు సంబంధించి ప్రధాని, లోక్‌సభ ప్రతిపక్ష నేత, సిజెఐలతో కూడిన కమిటీ నిర్ణయించాలను సుప్రీంకోర్టు తీర్పును తప్పుపట్టడం లేదు. కానీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా న్యాయమూర్తులు దేశంలోని కీలక నియామకాల విషయంలో జోక్యం చేసుకుంటుంటే న్యాయవ్యవహారాలు ఎవరు చూస్తారు?' అని ప్రశిుంచారు.