Aug 10,2022 07:05

సామాజిక సంక్షేమానికి కేటాయింపులు పెంచుతానని, ఆర్థిక అసమానతలను తగ్గిస్తానని, పడావుగా ఉంచిన భూములపై అపరాధ పన్ను వేస్తామని, కార్పొరేట్‌ పన్ను పెంచుతామని, ఒంటరి తల్లులకు వేతనాలు పెంచుతామని వాగ్దానం చేశాడు. వేలాది ఎకరాల భూములు కలిగిన వారు, చమురు రంగంలో ఉన్న కార్పొరేట్లు ... గుస్తావ్‌ పెట్రో ప్రభుత్వ సంస్కరణలు, పన్నుల పెంపుదలను అంత తేలికగా అంగీకరించవు. చమురు రంగంలో గత ప్రభుత్వాలు చేసుకున్న ఒప్పందాల నిబంధనలు ఆటంకంగా మారవచ్చు. పర్యావరణ పరిరక్షణకు గాను గనుల తవ్వకం, చమురు ప్రాజక్టుల నిలిపివేత అమలు చేస్తానని గుస్తావ్‌ చెప్పాడు. ఇప్పటికే లోటు బడ్జెట్‌ ఉన్న స్థితిలో ఇవి ఎంతవరకు అమలు జరిగేదీ చెప్పలేము. సంక్షేమ పథకాలు, సబ్సిడీలు పెంచకుండా జనాన్ని సంతృప్తి పరచలేరు. తక్షణం ప్రభుత్వం 22 సంవత్సరాల రికార్డును బద్దలు చేసి 9 శాతం పైగా ద్రవ్యోల్బణాన్ని ఆహార, చమురు ధరలను అదుపు చేయాల్సి ఉంది. ఇది గాక ఇప్పటికీ వివిధ బృందాలుగా ఇరవై వేల మంది తిరుగుబాటుదార్లు ఉన్నారు. వారిని ఒప్పించి జన జీవన స్రవంతిలోకి తీసుకురావాల్సి ఉంది.
 

లాటిన్‌ అమెరికా లోని కొలంబియాలో ఎన్నికైన తొలి వామపక్ష అధ్యక్షుడు గుస్తావ్‌ పెట్రో, తొలి ఆఫ్రో-కొలంబియన్‌ ఉపాధ్యక్షురాలు ఫ్రాన్సియా మార్క్వెజ్‌ ఆదివారం నాడు పదవీ బాధ్యతలు స్వీకరించారు. రాజధాని బగోటాలో దాదాపు లక్ష మంది జన సమక్షంలో జరిగిన కార్యక్రమానికి స్పెయిన్‌ రాజు ఆరవ పెతిలిపే, తొమ్మిది మంది లాటిన్‌ అమెరికా దేశాధినేతలు వచ్చారు. దేశంలో తీవ్రమైన అవినీతి, అసమానతలు, మాదక ద్రవ్య మాఫియాలు, శాంతి కోసం సాయుధ పోరాటాన్ని విరమించిన గెరిల్లాలు జనజీవన స్రవంతిలో కలవటం వంటి అనేక సవాళ్ల మధ్య గుస్తావ్‌ పెట్రో పాలన ప్రారంభమైంది. బలమైన, ఐక్య కొలంబియాను తప్ప రెండు సమాజాల మాదిరి రెండు దేశాలను తాను కోరుకోవటం లేదని తన తొలి ప్రసంగంలో పెట్రో చెప్పాడు. కేవలం 50.42 శాతం ఓట్లతో అధికారానికి వచ్చిన పెట్రోకు దేశంలోని పచ్చి మితవాదులు, కార్పొరేట్లతో పాటు అమెరికన్‌ సామ్రాజ్యవాదుల కుట్రల నుంచి అనేక సవాళ్లు ఎదురుకానున్నాయి. ఐదు కోట్ల మంది జనాభాలో సగం మంది దారిద్య్రంలో ఉన్నందున వారి ఆకలి తీర్చటం తన ప్రధాన కర్తవ్యంగా పెట్రో చెప్పాడు. దానికి గాను ధనికుల నుంచి అదనపు పన్ను వసూలు చేసేందుకు పన్ను సంస్కరణలను ప్రవేశపెడతామని ఆర్థిక మంత్రి జోస్‌ ఆంటోనియో ఒకాంపా చెప్పాడు. దేశంలో మాదక ద్రవ్యాల ముఠాలు విచ్చలవిడిగా పెరిగేందుకు కారణమైన కోకా ఆకుల సాగు నుంచి రైతులను వేరే పంటల సాగుకు మళ్లించేందుకు గ్రామీణ ప్రాంతాలలో పెట్టుబడులు పెడతామని పెట్రో చెప్పాడు. విశ్వవిద్యాలయ విద్య ఉచితంగా అందిస్తామని, ఆరోగ్య, పెన్షన్‌ సంస్కరణలు తెస్తామని వాగ్దానం చేశాడు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా రాళ్ల నుంచి చమురు, గ్యాస్‌ తీయటాన్ని, కొత్తగా చమురు బావుల వృద్ధి నిలిపివేస్తామని ప్రకటించాడు. ప్రస్తుతం దేశ ఎగుమతుల్లో సగం చమురు పరిశ్రమ నుంచే ఉన్నాయి. ఎఫ్‌ఏఆర్‌సి గెరిల్లాలతో కుదిరిన ఒప్పందంలోని అంశాలనే నేషనల్‌ లిబరేషన్‌ ఆర్మీ సంస్థ (ఎల్‌ఎన్‌) తిరుగుబాటుదార్లకూ వర్తింపచేస్తామని గత ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను అది తిరస్కరించింది. ఆ సంస్థతో సంప్రదింపులు జరుపుతామని పెట్రో వాగ్దానం చేశాడు. నయా ఉదారవాద ప్రయోగశాలగా, వాటి అమలుకు నియంతలను ప్రోత్సహించిన ప్రాంతంగా లాటిన్‌ అమెరికా ఉన్న సంగతి తెలిసిందే. వాటిని వ్యతిరేకిస్తున్న జనం అనేక అనుభవాలను చూసిన తరువాత వామపక్ష భావజాలం ఉన్న వారిని ఎన్నుకుంటున్నారు. శతాబ్దాలు, దశాబ్దాల తరబడి ఉన్న పార్టీలను పక్కన పెడుతున్నారు. కొలంబియాలో కూడా అదే జరిగింది.
             ఈ ఏడాది మే 29న అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగ్గా గుస్తావ్‌ పెట్రో నలభై శాతం ఓట్లతో ప్రథమ స్థానంలో ఉన్నాడు. నిబంధనల ప్రకారం సగానికి పైగా ఓట్లు రావాల్సి ఉండటంతో రెండవ దఫా జూన్‌ 19న తొలి రెండు స్థానాల్లో ఉన్నవారి మధ్య జరిగిన పోటీలో 50.42 శాతం ఓట్లతో నెగ్గాడు. ప్రత్యర్ధికి 47.35 శాతం రాగా 2.23 శాతం ఎవరికీ రాలేదు. మార్చి 13న జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో గుస్తావ్‌ పెట్రో నాయకత్వంలోని వామపక్ష కూటమి ఓట్ల రీత్యా పెద్ద పక్షంగా అవతరించినప్పటికీ ఉభయ సభల్లో మితవాదులు, ఇతర పార్టీల వారే ఎక్కువ మంది ఉన్నారు. దేశం మొత్తాన్ని 33 విభాగాలుగా చేసి జనాభాను బట్టి 168కి గాను 162 స్థానాలకు ఎన్నికలు జరిపారు. దామాషా ప్రాతిపదికన వచ్చిన ఓట్లను బట్టి సీట్లను కేటాయిస్తారు. మార్చి ఎన్నికల్లో దిగువ సభలో వామపక్ష కూటమికి 16.78 శాతం ఓట్లు 27 సీట్లు రాగా సోషల్‌ డెమోక్రటిక్‌ శక్తిగా వర్ణితమైన లిబరల్‌ పార్టీకి 14.27 శాతం ఓట్లు 32 సీట్లు వచ్చాయి. మిగిలిన సీట్లన్నింటిని మితవాదులు, ఇతరులు గెలుచుకున్నారు. ఎగువ సభలోని 100 స్థానాలకు గాను వామపక్ష కూటమి 20, లిబరల్‌ పార్టీ 14 సీట్లు తెచ్చుకుంది. పార్లమెంటులో బిల్లులను ఆమోదించాలంటే ఇతర పార్టీల సహకారం అవసరం. దీనికి గాను ఉన్నంతలో తొలుత లిబరల్‌ పార్టీ దగ్గరగా ఉన్నందున ఆ పార్టీతో పెట్రో అవగాహనకు వచ్చారు. తరువాత ఇతర పార్టీలను సంప్రదించారు. జులై 20 నాటికి ఎగువ సభ లోని 108 స్థానాలకు గాను గుస్తావ్‌ నాయకత్వంలోని హిస్టారిక్‌ పాక్ట్‌ కూటమి 63 స్ధానాలున్న పార్టీలతో ఒక అవగాహనకు వచ్చింది. దిగువ సభలో 186 స్థానాలకు గాను 114 సీట్లున్న పార్టీలు మద్దతు ఇస్తున్నాయి. రానున్న నాలుగు సంవత్సరాలు ఈ మద్దతు ఇలాగే ఉంటుందని చెప్పలేము. ఈ పార్టీలకు మంత్రి పదవులు ఇవ్వటం, వాటి వెనుక ఉన్న లాబీల వత్తిళ్లు రానున్న రోజుల్లో పెట్రో సర్కార్‌కు ఇబ్బందులను కలిగించవచ్చు. కొన్ని దేశాల్లోని వామపక్ష ప్రభుత్వాలకు ఎదురైన అనుభవమిదే. తమ ఎజెండాలను పూర్తిగా అమలు జరపాలంటే వామపక్షాలకు ఆటంకంగా మారుతుండటంతో రాజీ పడాల్సి వస్తోంది. అది ప్రజల్లో అసంతృప్తికి కారణమౌతోంది. గుస్తావ్‌ ఇప్పటికే గత ప్రభుత్వాల్లో పని చేసిన ఇద్దరికి మంత్రి పదవులు ఇచ్చారు.
                 లాటిన్‌ అమెరికాలో ప్రభుత్వాలన్నీ అధ్యక్ష తరహావే గనుక వామపక్ష ప్రభుత్వాలు వున్నచోట్ల అవసరమైనపుడు పార్లమెంట్లను తోసి రాజని కొన్ని నిర్ణయాలు అమలు జరపాల్సి వస్తోంది. అవసరమైతే తానూ అదే చేస్తానని ఎన్నికల ప్రచారంలో గుస్తావ్‌ చెప్పాడు. కానీ అది శత్రువులకు అవకాశాలను ఇచ్చినట్లు అవుతున్నది. బ్రెజిల్‌ వంటి చోట్ల పార్లమెంటులో మెజారిటీ లేని కారణంగా వామపక్ష దిల్మా రౌసెఫ్‌ను అభిశంసన ద్వారా పదవి నుంచి తొలగించారు. అలాంటి పరిణామం ఎక్కడైనా పునరావృతం కావచ్చు. అందువలన వామపక్ష శక్తులు పార్లమెంటు, రాష్ట్రాల్లో కూడా మెజారిటీ ఉన్నపుడే తమ ఎజెండాలను అమలు జరపగలవన్నది అనేక దేశాల అనుభవం. అధికార వ్యవస్థలో కీలకమైన మిలిటరీ, న్యాయ విభాగాలన్నీ గత కొన్ని దశాబ్దాలుగా మితవాద, ఫాసిస్టు శక్తులతో నింపివేశారు. తమ వర్గ ప్రయోజనాలకు భంగం కలిగితే అవి చూస్తూ ఊరుకోవు.
                జనాల్లో ఉన్న అసంతృప్తి కారణంగా ఇటీవలి కాలంలో లాటిన్‌ అమెరికాలో పాలకవర్గ పార్టీలకు జనం చుక్కలు చూపుతున్నారు. ఇప్పటి వరకు 12 దేశాల్లో అలాంటి పార్టీలు మట్టి కరిచాయి. కొలంబియాలో మితవాద పార్టీలతో జనం విసిగిపోయారు. 2019, 2020, 2021 సంవత్సరాల్లో జరిగిన సామాజిక పోరాటాల్లో వామపక్ష శక్తులు ముందున్నాయి. రాజధాని బగోటా మేయర్‌గా, సెనెటర్‌గా పని చేసిన పెట్రో 2018 ఎన్నికల్లో ద్వితీయ స్థానంలో నిలిచారు. సామాజిక సంక్షేమానికి కేటాయింపులు పెంచుతానని, ఆర్థిక అసమానతలను తగ్గిస్తానని, పడావుగా ఉంచిన భూములపై అపరాధ పన్ను వేస్తామని, కార్పొరేట్‌ పన్ను పెంచుతామని, ఒంటరి తల్లులకు వేతనాలు పెంచుతామని వాగ్దానం చేశాడు. వేలాది ఎకరాల భూములు కలిగిన వారు, చమురు రంగంలో ఉన్న కార్పొరేట్లు...గుస్తావ్‌ పెట్రో ప్రభుత్వ సంస్కరణలు, పన్నుల పెంపుదలను అంత తేలికగా అంగీకరించవు. చమురు రంగంలో గత ప్రభుత్వాలు చేసుకున్న ఒప్పందాల నిబంధనలు ఆటంకంగా మారవచ్చు. పర్యావరణ పరిరక్షణకు గాను గనుల తవ్వకం, చమురు ప్రాజక్టుల నిలిపివేత అమలు చేస్తానని గుస్తావ్‌ చెప్పాడు. ఇప్పటికే లోటు బడ్జెట్‌ ఉన్న స్థితిలో ఇవి ఎంతవరకు అమలు జరిగేదీ చెప్పలేము. సంక్షేమ పథకాలు, సబ్సిడీలు పెంచకుండా జనాన్ని సంతృప్తి పరచలేరు. తక్షణం ప్రభుత్వం 22 సంవత్సరాల రికార్డును బద్దలు చేసి 9 శాతం పైగా ద్రవ్యోల్బణాన్ని ఆహార, చమురు ధరలను అదుపు చేయాల్సి ఉంది. ఇప్పటికీ వివిధ బృందాలుగా ఇరవై వేల మంది తిరుగుబాటుదార్లు ఉన్నారు. వారిని ఒప్పించి జన జీవన స్రవంతిలోకి తీసుకురావాల్సి ఉంది. ఇవిగాక వెలుపలి నుంచి అమెరికా ఇతర దేశాలు కుట్రలు సరేసరి!

                     ఎం. కోటేశ్వరరావు     ఎం. కోటేశ్వరరావు