Oct 02,2022 13:15

జైపూర్‌  :   కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం చేసే సామర్థ్యం సీనియర్‌ నేత, ఎంపి మల్లికార్జున ఖర్గేకు ఉందని రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌  పేర్కొన్నారు.  కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి జరుగుతున్న ఎన్నికల్లో ఖర్గేనే విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.  ఆదివారం సచివాలయంలోని మహాత్మాగాంధీ విగ్రహానికి   నివాళులు అర్పించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.   ఖర్గేకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందని, ఆయన దళిత వర్గం నుండి వచ్చిన వారని, సహృదయం కలిగిన వ్యక్తి అని, ఆయన పోటీ చేయడాన్ని అందరూ స్వాగతిస్తున్నారని అన్నారు.  పోటీలో ఉన్న మరో నేత శశిథరూర్‌ కూడా మంచి వ్యక్తేనని, ఆయనకూ మంచి ఆలోచనలు ఉన్నాయని, అయితే ఆయన 'ఉన్నత వర్గానికి' చెందిన వ్యక్తని అన్నారు. పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడానికి కావాల్సిన అనుభవం ఖర్గేకు ఉందని, ఈ విషయంలో శశి థరూర్‌ను ఖర్గేతో పోల్చలేమని, దీంతో సహజంగానే పోటీ ఏకపక్షంగానే సాగుతుందని అన్నారు.

ఝార్ఖండ్‌ మాజీ మంత్రి కె.ఎన్‌.త్రిపాఠి నామినేషన్‌ తిరస్కరణకు గురవడంతో ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష ఎన్నికల బరిలో మల్లికార్జున ఖర్గే, శశి థరూర్‌ మాత్రమే మిగిలారు. ఒక వ్యక్తి, ఒక పదవి తీర్మానం ప్రకారం శనివారం ఖర్గే రాజ్యసభ ప్రతిపక్ష స్థానానికి రాజీనామా చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి పంపినట్లు తెలిపాయి. ఈ పదవిని సీనియర్‌ నేతలు పి. చిదంబరం, దిగ్విజరు సింగ్‌కు అప్పగించనున్నట్లు సమాచారం.