Nov 23,2022 13:22

జైపూర్‌  :   రాహుల్‌గాంధీ చేపడుతున్న భారత్‌ జోడో యాత్ర బుధవారం కాంగ్రెస్‌ పాలిత ప్రాంతమైన రాజస్థాన్‌కు చేరుకుంది. అయితే పార్టీ సొంత నేతల నుండి రాహుల్‌ నిరసనలు ఎదురయ్యాయి. ప్రస్తుతం రాజస్థాన్‌లో అశోక్ గెహ్లాట్ ముఖ్యమంత్రిగా  కాంగ్రెస్‌ ప్రభుత్వం నాలుగేళ్ల పాలనను పూర్తి చేసుకుంది. ఇప్పుడు సచిన్‌ పైలెట్‌ ను  ముఖ్యమంత్రిని చేయాలంటూ గుర్జర్లు ఆందోళన చేపడుతున్నారు. ''ఇది జరిగితేనే మిమ్మల్ని (రాహుల్‌గాంధీ) స్వాగతిస్తాం. లేకుంటే యాత్రను అడ్డుకుంటాం '' అని గుర్జర్‌ నేత విజయ్  సింగ్‌ బైన్సా హెచ్చరించారు. 2019 సమయంలో కాంగ్రెస్‌ చేసిన ఒప్పందాన్ని అమలు చేయాల్సిన సమయం వచ్చిందని అన్నారు. గుర్జర్ల వ్యక్తిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేయకపోవడంపై తమ కమ్యూనిటీ ఆందోళన చెందుతోందని అన్నారు. కాగా, కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి అశోక్‌గెహ్లాట్‌కు మద్దతు తెలుపుతూ తిరుగుబాటు ప్రకటించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని సచిన్‌ పైలెట్‌ అధిష్టానాన్ని కోరిన అనంతరం ఈ పరిణామం జరగడం గమనార్హం.